ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 22, 2020 , 01:09:11

సూపర్‌స్నేహిత్‌

సూపర్‌స్నేహిత్‌

 • వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీటీ ప్లేయర్‌
 • వారం వ్యవధిలో రెండు రాష్ట్ర చాంపియన్‌షిప్‌ టైటిళ్లు 
 • 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ లక్ష్యంగా అడుగులు
 • వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక హైదరాబాదీగా రికార్డు తెలుగు రాష్ర్టాల నుంచి తొలిసారి యూత్‌ నేషనల్‌ చాంపియన్‌గా నిలిచిన ఘనత
 •  19 అంతర్జాతీయ స్థాయిలో స్నేహిత్‌ ఇప్పటి వరకు సాధించిన పతకాలు జాతీయ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం స్నేహిత్‌ స్థానం
 • 2 అండర్‌ 21 కేటగిరీలో స్నేహిత్‌ ర్యాంక్

అంతర్జాతీయ యవనికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలనే ధ్యేయం.. విశ్వక్రీడల్లో విజయ కేతనం ఎగరవేయాలనే లక్ష్యం.. ఆ కుర్రాడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. గమ్యం ముద్దాడే వరకు అలుపెరుగని పోరాటం చేయాలని నిర్ణయించుకున్న ఆ యువ కెరటం.. అంచెలంచెలుగా ఎదుగుతూ యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) జాతీయ చాంపియన్‌గా అవతరించాడు. గత ఐదు దశాబ్దాల్లో తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌గా నిలిచిన ఆ కుర్రాడే సురావజ్జుల ఫిడేల్‌ రఫీక్‌ స్నేహిత్‌.

ఇటీవల వారం రోజుల వ్యవధిలో రెండు రాష్ట్ర చాంపియన్‌షిప్‌ టైటిల్స్‌ నెగ్గిన స్నేహిత్‌.. అందులో ఒక్క గేమ్‌ కూడా కోల్పోకపోవడం అతడి దృఢ సంకల్పానికి నిదర్శనం. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అవసరమైన ర్యాంకింగ్‌పై దృష్టిపెట్టిన అతడు ప్రస్తుతం అంతర్జాతీయ టోర్నీల్లో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. విదేశీ టోర్నీలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తే అద్భుతాలు చేసేందుకు సిద్ధమంటున్నాడు.

భారత టీటీ దిగ్గజం శరత్‌ కమల్‌ను ఆదర్శంగా తీసుకొని టేబుల్‌ టెన్నిస్‌ వైపు వచ్చిన స్నేహిత్‌.. ఉత్తుంగ తరంగంలా దూసుకొచ్చాడు. జూనియర్‌ స్థాయిలో అద్భుతాలు చేసిన అతడు యూత్‌ స్టేజ్‌లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. సెయింట్‌ జోసెఫ్‌ డిగ్రీ కాలేజీలో జర్నలిజం మూడో సంవత్సరం చదువుతున్న స్నేహిత్‌.. పాల్గొన్న ప్రతి టోర్నీలో చక్కటి ప్రదర్శనతో లెక్కకు మిక్కిలి టైటిల్స్‌ ఖాతాలో వేసుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌ అర్హత టోర్నీల సమయానికి.. అంతర్జాతీయ అనుభవం పెద్దగా లేని అతడు.. నాలుగేండ్ల తర్వాత పారిస్‌ (2024)లో జరుగనున్న విశ్వక్రీడలను లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న అతడికి ఆర్థిక ఇబ్బందులు ప్రతిబంధకమవుతున్నాయి. 

ర్యాంక్‌ పెంచుకోవాలంటే..

జూనియర్‌ స్థాయిలో ప్రపంచ రెండో ర్యాంక్‌ వరకు చేరిన స్నేహిత్‌.. సీనియర్‌ స్థాయిలో మాత్రం జాతీయ టాప్‌-20లో ఉన్నాడు. దీనికి ప్రధాన కారణం అతడు ఎక్కువ సంఖ్యలో టోర్నీలు ఆడకపోవడమే. ర్యాంక్‌ మెరుగుపర్చుకుంటేనే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉండటంతో.. ప్రస్తుతం దానిపై దృష్టి సారించిన స్నేహిత్‌ త్వరలో జరుగనున్న టోర్నీల కోసం సిద్ధమవుతున్నాడు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన స్నేహిత్‌కు విదేశీ టోర్నీల్లో పాల్గొనడం శక్తికి మించిన భారంగా పరిణమించింది. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌తో పాటు యూనివర్సిటీ టోర్నీలో పతకాలు సాధించినా.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లో చోటు దక్కకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నది. 


22 దేశాల్లో టోర్నీలు ఆడినా..

ఇప్పటి వరకు 22 దేశాల్లో అనేక టోర్నీలు నెగ్గినా.. పోలండ్‌, జర్మనీ, జపాన్‌, సింగపూర్‌ వంటి మేజర్‌ టోర్నీల్లో స్నేహిత్‌ పాల్గొనలేదు. అలాంటి పోటీల్లో టాప్‌ ఆటగాళ్లు బరిలో దిగుతుండంతో వారితో ఆడితే స్నేహిత్‌ తన టెక్నిక్‌తో పాటు ర్యాంక్‌ మెరుగుపర్చుకోగలుగుతాడు. ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే.. వచ్చే నాలుగేండ్లలో ర్యాంక్‌ మెరుగు పర్చుకోవడంతో పాటు ఒలింపిక్స్‌ బెర్త్‌ దక్కించుకోవడం పెద్ద కష్టం కాదని స్నేహిత్‌ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.

ఆస్తులు అమ్ముకొని..

జోర్డాన్‌ (2017) టైటిల్‌తో వెలుగులోకి వచ్చిన స్నేహిత్‌ కోసం అతడి కుటుంబ సభ్యులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. టోర్నీలకు పంపేందుకు డబ్బు లేకపోవడంతో ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపుడి గ్రామంలో తమకున్న మూడున్నర ఎకరాల వ్యవసాయ భూ మిని అమ్మి అతడిని ప్రోత్సహించారు. మరో నాలుగేండ్లు ఇలాగే కష్టపడితే ఒలింపిక్స్‌లో మెరువడం ఖాయమే కానీ అందుకు ప్రతి ఏటా సుమారు రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీన్ని భరించే స్థాయిలో లేని ఆ కుటుంబం ప్రభుత్వ పోత్సాహం మరింతగా లభిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.

అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఎనిమిది టోర్నీలను ఒలింపిక్స్‌ అర్హతకు పరిగణనలోకి తీసుకుంటారు. అంటే అంతకన్నా ఎక్కువ టోర్నీలు ఆడాలి. వాటిలో అత్యుత్తమంగా ఉన్న ఎనిమిదింటిని గుర్తించి ఆ ప్రదర్శన ఆధారంగా విశ్వక్రీడల్లో చోటు దక్కుతుంది. అంటే ఎన్ని ఎక్కువ టోర్నీలు ఆడితే అంత లాభం అన్నమాట. కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యపడటం లేదు. స్టార్‌ ఆటగాళ్లు శరత్‌ కమల్‌, సాతియాన్‌, హర్మిత్‌ దేశాయ్‌, మానవ్‌ ఠక్కర్‌ వంటి ఆటగాళ్లు విదేశాల్లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. నాలుగేండ్ల తర్వాత జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే ఇప్పటి నుంచి ప్రణాళికలు రచించడం ముఖ్యం. విదేశాల్లో ప్రాక్టీస్‌కు ఇది సరైన సమయం. 

-స్నేహిత్‌

ఒలింపిక్స్‌ పాల్గొనాలంటే ర్యాంక్‌ మెరుగు పర్చుకోవాలి.. అది సాధ్యమవ్వాలంటే అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనాలి. ఒక్కో టోర్నీకి సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఏడాదికి పది, పదిహేను టోర్నీల్లో ఆడితే అతడి ర్యాంక్‌ మెరుగవుతుంది. కానీ మధ్య తరగతి కుటుంబంగా ఆర్థిక భారాన్ని మోయలేకపోతున్నాం. ప్రభుత్వం తరఫున మరింత ప్రోత్సాహం లభిస్తే సత్తాచాటేందుకు స్నేహిత్‌ సిద్ధంగా ఉన్నాడు. ఆసియా, కామన్వెల్త్‌ గేమ్స్‌తో పాటు పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా ముందుకెళుతున్న స్నేహిత్‌కు ఆర్థిక చేయూత లభిస్తే కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించగలనన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.

-రాము, స్నేహిత్‌ తండ్రి

‌స్నేహిత్‌ పతకాల్లో మచ్చుకు కొన్ని..

 • పోర్చుగల్‌ జూనియర్‌ క్యాడెట్‌ ఓపెన్‌ 2018 కాంస్యం
 • ఆసియా జూనియర్‌ క్యాడెట్‌ చాంపియన్‌షిప్‌ 2018 రజతం
 • దక్షిణాసియా జూనియర్‌ చాంపియన్‌షిప్‌ 2018 టీమ్‌ స్వర్ణం
 • ఐఐటీఎఫ్‌ ప్రపంచ జూనియర్‌ సర్క్యూట్‌ 2017 రజతం
 • స్లొవేనియా ఓపెన్‌ జూనియర్‌ సర్క్యూట్‌ 2017 స్వర్ణం
 • జోర్డాన్‌ ఓపెన్‌ జూనియర్‌ సర్క్యూట్‌ 2017  స్వర్ణం


logo