బుధవారం 25 నవంబర్ 2020
Sports - Nov 10, 2020 , 02:10:53

బ్లేజర్స్‌ విన్నర్స్‌

బ్లేజర్స్‌ విన్నర్స్‌

  • మహిళల ఐపీఎల్‌ టైటిల్‌ మంధాన సేన కైవసం.. ఫైనల్లో నోవాస్‌పై గెలుపు 

మహిళల ఐపీఎల్‌ (టీ20 చాలెంజ్‌) సమరంలో స్మృతి మంధాన సారథ్యంలోని ట్రయల్‌ బ్లేజర్స్‌ విజయఢంకా మోగించింది. ఫైనల్లో ఢిఫెండింగ్‌ చాంపియన్‌ సూపర్‌ నోవాస్‌ను మట్టికరిపించి తొలిసారి టైటిల్‌ ముద్దాడింది. బ్లేజర్స్‌ సారథి స్మృతి ఒంటరి పోరాటంతో బ్యాటింగ్‌ను నిలబెట్టగా.. బౌలర్లు సమిష్టిగా రాణించి సత్తాచాటారు. నోవాస్‌ బౌలర్‌ రాధా యాదవ్‌ స్పిన్‌ మ్యాజిక్‌ వృథా అయింది. మొత్తంగా కరోనా ఆందోళన మధ్య యూఏఈలో నిర్వహించిన టోర్నీ సూపర్‌ సక్సెస్‌ అయింది. 

షార్జా: మహిళల టీ20 చాలెంజ్‌లో ట్రయల్‌ బ్లేజర్స్‌ నయా చాంపియన్‌గా అవతరించింది. సోమవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో హర్మన్‌ ప్రీత్‌ సారథ్యంలోని సూపర్‌ నోవాస్‌ను 16 పరుగుల తేడాతో ఓడించిన బ్లేజర్స్‌ టైటిల్‌తో పాటు రూ.25 లక్షల ప్రైజ్‌మనీ కైవసం చేసుకుంది. నోవాస్‌ హ్యాట్రిక్‌ టైటిల్‌ ఆశలకు బ్లేజర్స్‌ బ్రేకులు వేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్‌ బ్లేజర్స్‌ కెప్టెన్‌ మంధాన(49 బంతుల్లో 68; 5ఫోర్లు, 3సిక్స్‌లు) అద్భుత ఇన్నింగ్స్‌తో 8 వికెట్లకు 118 పరుగులు చేసింది. నోవాస్‌ స్పిన్నర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌' రాధా యాదవ్‌(5/16) తిప్పేయడంతో బ్లేజర్స్‌ జట్టులో ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. స్వల్ప లక్ష్యఛేదనలో తడబడిన సూపర్‌ నోవాస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులకే పరిమితమైంది. ట్రయల్‌ బ్లేజర్స్‌ బౌలర్లలో సల్మా ఖాతూన్‌ మూడు, దీప్తి శర్మ రెండు, ఎక్లెస్టోన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. నోవాస్‌ జట్టులో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌(36 బంతుల్లో 30) మోస్తరుగా ఆడగా మిగిలిన వారు విఫలమయ్యారు. ఓపెనర్‌ ఆటపట్టు జయాంగిని(6) విఫలమైంది. 


సూపర్‌ స్మృతి 

ట్రయల్‌ బ్లేజర్స్‌ కెప్టెన్‌ మంధాన బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. బ్యాటర్లందరూ ఇబ్బందిపడిన పిచ్‌పైనే బౌండరీలతో చెలరేగింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా దూకుడు కొనసాగించి 38 బంతుల్లోనే అర్ధశతకం చేసింది. ఆ తర్వాత వరుసగా ఫోర్‌, సిక్స్‌తో అదరగొట్టి ఔటైంది. బ్లేజర్స్‌లో స్మృతి ఒంటరిగా 49 బంతుల్లో 68 పరుగులు చేస్తే.. మిగిలిన వారంతా 71 బంతులు ఆడి 50 రన్స్‌ మాత్రమే చేశారు. 

సంక్షిప్త స్కోర్లు

ట్రయల్‌ బ్లేజర్స్‌: 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 (స్మృతి 68; రాధా యాదవ్‌ 5/16) సూపర్‌ నోవాస్‌: 20 ఓవర్లలో 7 వికెట్లకు 102 (హర్మన్‌ప్రీత్‌ 30; సల్మా 3/18)