బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 02, 2020 , 01:06:22

జొకో శుభారంభం

జొకో శుభారంభం

న్యూయార్క్‌: టాప్‌సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో బోణీ కొట్టాడు. కరోనా వైరస్‌ భయం కారణంగా పలువురు టాప్‌ ప్లేయర్లు టోర్నీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఫేవరెట్‌గా బరిలో దిగిన జొకో స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చాడు. పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో జొకోవిచ్‌ 6-1, 6-4, 6-1తో దామిర్‌ జుముర్‌ (బోస్నియా)పై అలవోక విజయం సాధించాడు. ప్రత్యర్థి నుంచి కనీస ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో.. గంటా 58 నిమిషాల్లోనే జొకో జయభేరి మోగించాడు. సెర్బియా స్టార్‌ 5 ఏస్‌లు సంధించగా.. జుముర్‌ రెండింటితోనే సరిపెట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో సిట్సిపస్‌ (గ్రీస్‌) 6-2, 6-1, 6-1తో అల్బెర్ట్‌ రామోస్‌ (స్పెయిన్‌)పై గెలుపొందగా.. సుదీర్ఘంగా సాగిన పోరులో 16వ సీడ్‌ ఇస్నెర్‌ (అమెరికా) 7-6 (7/5), 3-6, 7-6 (7/5), 3-6, 6-7 (3/7)తో తన దేశానికే చెందిన స్టీవ్‌ జాన్సన్‌ చేతిలో ఓటమి పాలయ్యాడు. 

  గాఫ్‌కు చుక్కెదురు 

  మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌, ప్రపంచ మూడో ర్యాంకర్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ), నవోమీ ఓసాకా (జపాన్‌) తొలి రౌండ్‌లో గెలుపొంది ముందడుగేశారు. అమెరికా యువ సంచలనం కొకో గాఫ్‌ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలై ఇంటి బాటపట్టింది. ప్లిస్కోవా 6-4, 6-0తో అనెహెలినా కలినినా (ఉక్రెయిన్‌)పై.. కెర్బర్‌ 6-4, 6-4తో ఐలా టొమ్లియానోవిచ్‌ (ఆస్ట్రేలియా)పై.. ఒసాకా 6-2, 5-7, 6-2తో తన దేశానికే చెందిన మిసాకిపై గెలుపొందారు. గతేడాది యూఎస్‌ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన గాఫ్‌ 3-6, 7-5, 4-6తో సెవస్తోవా (లాత్వియా) చేతిలో ఓటమి పాలైంది.


logo