మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 04, 2020 , 02:46:48

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ జోరు కొనసాగించాడు.

 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ జోరు కొనసాగించాడు.

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ జోరు కొనసాగించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో 6-0, 6-3, 6-2 తేడాతో డానియెల్‌ ఎలాహీ(కొలంబియా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. మరో మ్యాచ్‌లో గ్రీస్‌ స్టార్‌ స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ 6-1, 6-2, 3-1 తేడాతో అల్‌జాజ్‌ బెడెన్‌(స్లోవెనియా)పై అలవోక విజయం సాధించాడు.  పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో రెండు సెట్లు కైవసం చేసుకుని సిట్సిపాస్‌ దూకుడు మీదున్న సమయంలో బెడెన్‌ కాలి మడమ గాయంతో అర్ధాంతరంగా నిష్క్రమించాడు. మిగతా మ్యాచ్‌ల్లో బయెనా వాకోవర్‌తో దిమిత్రోవ్‌ నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించగా, కరెనో బుస్టా 6-4, 6-3, 5-7, 6-4తో బటిస్టా అగ్యుట్‌పై అద్భుత విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో అమెరికా ప్లేయర్‌ సోఫియా కెనిన్‌ 6-2, 6-0తో ఇరినా బార(రొమేనియా)పై అలవోక విజయం సాధించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించిన తొలి అరబ్‌ ప్లేయర్‌గా ఒన్స్‌ జాబెర్‌(ట్యునిషియా) కొత్త చరిత్ర లిఖించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో జాబెర్‌ 7-6(7), 2-6, 6-3తో సబలెంకాపై విజయం సాధించింది.  

నాదల్‌ వాచ్‌ అ‘ధర’హో 

స్పెయిన్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ ధరించిన వాచ్‌ ధర చూస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే. శుక్రవారం నాటి మ్యాచ్‌లో నాదల్‌ కుడిచేతికి పెట్టుకున్న వాచ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కేవలం 30 గ్రాముల బరువున్న ఈ వాచ్‌ ధర మన కరెన్సీలో ఏకంగా రూ.7.3కోట్లు. స్విట్జర్లాండ్‌కు చెందిన రిచర్డ్‌ మిల్లే కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన 50 వాచ్‌ల్లో ఒకటి నాదల్‌ దగ్గర ఉంది. కార్ల తయారీలో వాడే మెటల్‌ను ఈ వాచ్‌ కోసం వాడారు. ఇదిలా ఉంటే రఫా వాచ్‌పై సోషల్‌ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తున్నారు.