ఆదివారం 06 డిసెంబర్ 2020
Sports - Oct 06, 2020 , 01:54:03

క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన టాప్‌సీడ్‌ జొకోవిచ్‌

క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన టాప్‌సీడ్‌ జొకోవిచ్‌

  • క్విటోవా, సిట్సిపాస్‌, రుబ్లేవ్‌ కూడా..

పారిస్‌: ఈ ఏడాది తిరుగులేని ఫామ్‌లో ఉన్న ప్రపంచ నంబర్‌  వన్‌ ర్యాంకర్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ దూకుడు కనబరుస్తున్నాడు. ఒక్కసెట్‌ కూడా కోల్పోకుండా టోర్నీ క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. సోమవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌  జొకో 6-4, 6-3, 6-3 తేడాతో 15వ సీడ్‌ కరెన్‌ కచనోవ్‌(రష్యా)పై సునాయాస విజయం సాధించాడు. మ్యాచ్‌ ఆసాంతం దూకుడు కనబరిచిన జొకో 44 విన్నర్లతో ప్రత్యర్థికి అవకాశమే ఇవ్వలేదు. ఇక ఐదో సీడ్‌ స్పెఫనోస్‌ సిట్సిపాస్‌(గ్రీకు) 6-3, 7-6(11/9), 6-2 తేడాతో 18వ సీడ్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌(బల్గేరియా) పై గెలిచి.. ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు చేరిన తొలి గ్రీకు ఆటగాడిగా రికార్డుకెక్కాడు. మరో మ్యాచ్‌లో అండీ రుబ్లేవ్‌(రష్యా) 6-7(4/7), 7-5, 6-4, 7-6(7/3)తో మార్టోన్‌ ఫక్సోవిక్స్‌     (హంగేరీ)పై విజయం సాధించాడు. తొలిసారి క్వార్టర్స్‌ చేరిన సిట్సిపాస్‌, రుబ్లేవ్‌ సెమీస్‌ బెర్త్‌ కోసం తలపడనున్నారు. 

క్విటోవా 8ఏండ్ల తర్వాత..

రెండుసార్లు వింబుల్డన్‌ చాంపియన్‌ పెట్రా క్విటోవా(చెక్‌ రిపబ్లిక్‌) 2012 తర్వాత తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్‌ నాలుగో రౌండ్‌లో ఏడో సీడ్‌ క్విటోవా 6-2, 6-4తేడాతో ఎస్‌ జంగ్‌(చైనా)పై గెలిచింది. కాగా మరోమ్యాచ్‌లో 7-5, 6-2తేడాతో పౌలా బడోసా(స్పెయిన్‌)పై గెలిచిన లారా సెగేమండ్‌(జర్మనీ)తో క్విటోవా సెమీస్‌లో చోటు కోసం పోటీపడనుంది.  నాలుగో సీడ్‌  సోఫియా కెనిన్‌ 2-6, 6-2, 6-1 ఫియోనో ఫెర్రోపై గెలిచింది.