శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Sports - Mar 24, 2020 , 23:06:10

టోక్యోకు బ్రేక్‌

టోక్యోకు బ్రేక్‌

  • కరోనా ఎఫెక్ట్‌తో ఒలింపిక్స్‌
  • వచ్చే ఏడాదికి వాయిదా
  • జపాన్‌ ప్రధానితో చర్చల తర్వాత ఐవోసీ చరిత్రాత్మక నిర్ణయం 
  • 2021లో జరిగినా టోక్యో 2020 పేరుతోనే నిర్వహణ
  • నిర్ణయాన్ని ఆహ్వానించిన సభ్యదేశాలు, అథ్లెట్లు 

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ దెబ్బ.. అతిపెద్ద క్రీడాపండుగ ఒలింపిక్స్‌పై పడింది. వైరస్‌ విలయతాండవంతో ఆలస్యమే శరణ్యమైన వేళ.. టోక్యో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ ఐవోసీ చరిత్రాత్మక నిర్ణయం  తీసుకుంది. ఎన్నో సభ్యదేశాలు, మరెన్నో క్రీడాసంఘాలు, ఎందరో అథ్లెట్ల వినతులు, డిమాండ్లు, ఉపసంహరణ హెచ్చరికల తర్వాత ఐవోసీ తలొగ్గింది. కరోనా విశ్వమారి విజృంభణతో ఒలింపిక్‌ అర్హత పోటీల రద్దు, ప్రాక్టీస్‌ చేసేందుకు వీలు కాని పరిస్థితులు, ఆరోగ్యం భయాలతో తీవ్ర ఆందోళన చెందిన అథ్లెట్లు ఎట్టకేలకు ఊపిరి పీల్చున్నారు. మరోవైపు ఒలింపిక్స్‌ వాయిదాను సభ్యదేశాలన్నీ ఆహ్వానించాయి. 

టోక్యో: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) విజృంభణతో ప్రపంచం మొత్తం వణికిపోతుండడంతో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. క్రీడలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడడంతో టోక్యో ఒలింపిక్స్‌,పారాలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయి దా వేసింది. జపాన్‌ ప్రధాని షింజో అబే, ఐవోసీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ మధ్య మంగళవారం టెలిఫోన్‌ చర్చలు సాగగా, ఒలింపిక్స్‌ను ఏడాది వాయిదా వేయాలని అబే తొలుత ప్రతిపాదించారు. దీనికి థామస్‌ బాచ్‌ పూర్తి అంగీకారం తెలిపాడు. దీంతో ఎలాంటి హింసాత్మక పరిస్థితులు లేకుండా వైరస్‌ కారణంతో ఒలింపిక్స్‌ తొలిసారి ఆలస్యం కానున్నాయి. 

షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ మధ్యలోనే విశ్వక్రీడలను జరిపి తీరుతామని వారం క్రితం వరకు చెప్పిన ఐవోసీ.. పరిస్థితులు చేయిదాటి పోవడంతో ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. కరోనా తీవ్రత పెరగడంతో పాటు సభ్యదేశాలు, క్రీడా సంఘాలు, అథ్లెట్ల డిమాండ్‌ మేరకు 2021కి వాయిదా వేసింది. ‘అథ్లెట్లు, ఒలింపిక్స్‌తో సంబంధమున్న వారితో పాటు ప్రపంచవ్యాప్త ప్రజల ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తున్నాం. 2020 తర్వాత 2021 వేసవి ముగిసే కంటే ముందే క్రీడలను నిర్వహిస్తాం’ అని ఐవోసీ, టోక్యో క్రీడల నిర్వాహకులు ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. కాగా వచ్చే ఏడాది వరకు ఒలింపిక్స్‌ జ్యోతి జపాన్‌లోనే ఉండనుంది. 

124ఏండ్లలో తొలిసారి..

ఒలింపిక్స్‌ వాయిదా పడడం 124ఏండ్ల అధునిక క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి. ప్రపంచ యుద్ధాల కారణంగా 1916(బెర్లిన్‌), 1940(టోక్యో), 1944(లండన్‌)లో విశ్వక్రీడలు రద్దయ్యాయి. మాస్కో 1980, లాస్‌ఏంజెల్స్‌ 1984 ఒలింపిక్స్‌ కొన్ని దేశాల ప్రాతినిధ్యం లేకుండానే జరిగాయి. 

2021లో జరిగినా.. ‘టోక్యో 2020’ 

కరోనా వైరస్‌ కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడినా.. ‘టోక్యో 2020’ పేరుతోనే ఐవోసీ టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహించనుంది. ఈ విషయాన్ని టోక్యో సిటీ గవర్నర్‌ యురికో కోకీ తెలిపారు. ‘పేరు.. టోక్యో 2020గానే ఉంటుంది. ఒలింపిక్స్‌ రద్దు చేసే సమస్యే లేదు. 2021 వేసవిలో ఒలింపిక్స్‌ నిర్వహించడమే మా లక్ష్యం. అథ్లెట్లు అందుకోసమే సిద్ధమవ్వాలి’ అని యురికో చెప్పారు. మార్చి 26న ప్రారంభం కావాల్సిన ఒలింపిక్‌ టార్చ్‌ రిలేను నిలిపేస్తున్నట్టు టోక్యో 2020 అధ్యక్షుడు యషిరో మోరీ చెప్పాడు. 

టోక్యోకు నిరాశ 

కండ్లు చెదిరే ఆతిథ్యంతో.. మునుపెన్నడూ లేని హంగులతో.. ప్రపంచం అబ్బురపోయేలా టోక్యో విశ్వక్రీడలను నిర్వహించాలనుకున్న జపాన్‌ ఆశలు ఈ ఏడాది నెరవేరలేదు. దాదాపు 12.6 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.9.50లక్షల కోట్లు) ఖర్చుతో ఒలింపిక్స్‌ను ఘనంగా నిర్వహించాలని వేసుకున్న ప్రణాళికలు నిలిచిపోయాయి. విశ్వక్రీడల వాయిదాతో జపాన్‌ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. వచ్చే ఏడాది నిర్వహించడం కోసం మరింత ఖర్చు చేయాల్సి రావడంతో మరింత భారం పడనుంది. 1940లోనూ జపాన్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జపాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడిందన్న కారణంగా ఒలింపిక్స్‌ను హెల్సింకోకు ఐవోసీ తరలించింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940 ఒలింపిక్స్‌ చివరికి రైద్దెపోయాయి. 

ఆహ్వానించిన ఐవోఏ 

టోక్యో ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తూ ఐవోసీ తీసుకున్న నిర్ణయాన్ని భారత ఒలింపిక్‌ కమిటీ(ఐవోఏ) ఆహ్వానించింది. ఆరోగ్య ఆందోళన మధ్య శిక్షణ పొందుతూ గురవుతున్న ఒత్తిడి నుంచి భారత అథ్లెట్లకు ఊరట లభించిందని తెలిపింది. ‘ఐవోసీ నిర్ణయాన్ని ఐవోఏ ఆహ్వానిస్తున్నది. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక అథ్లె ట్లు, క్రీడా సమాఖ్యలు, స్పాన్సర్లతో చర్చించి.. ప్రణాళికలను మళ్లీ రూపొందిస్తాం’ అని ఐవోఏ సెక్రటరీ రాజీవ్‌ చెప్పాడు. 

అర్హత సాధించకున్నా.. ఒలింపి క్స్‌ వాయిదా పడడం పట్ల సంతోషంగా ఉ న్నా. అయితే క్వాలిఫికేషన్‌ ప్రక్రియ ఎలా సాగుతుందో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది. లాక్‌డౌన్‌ ఉన్న కారణంగా ఎవరూ సన్నద్ధత గురించి ఆలోచించకండి. ముందు సురక్షితంగా ఉంటే.. ఆ తర్వాత ప్రాక్టీస్‌ గురించి ఆలోచించొచ్చు. 

- సైనా నెహ్వాల్‌, భారత స్టార్‌ షట్లర్‌ 

ప్రస్తుత పరిస్థితులు అసలు బాగోలేవు. జీవితమే ప్రాధా న్యం.. తర్వాతే అన్నీ. మేం వేచిఉండగలం. అథ్లెట్ల సంక్షేమమే అతిముఖ్యం. ఈ నిర్ణయం(ఒలింపిక్స్‌ వాయిదా) అందరకీ మంచిదే. సన్నద్ధమయ్యేందుకు నాతో పాటు అందరికీ ఎక్కువ సమయం దొరికింది. 

- మేరీ కోమ్‌, భారత దిగ్గజ బాక్సర్‌ 

ఇది మంచి నిర్ణ యం. ఎందుకంటే అందరూ ఆందోళనతో ఉన్నారు. అథ్లె ట్ల ఆరోగ్యమే ప్రాధాన్యంగా ఉండాలి. ఎవరూ సరిగా ప్రాక్టీస్‌ చేయడం లేదు. ఇది భారత్‌ పరిస్థితి ఒక్కటే కాదు. ప్రపంచంలో అన్ని దేశాలది. ముందు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడాలి. 

- బజరంగ్‌ పునియా, భారత రెజ్లర్‌  


logo