గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 24, 2020 , 19:34:41

టోక్యో ఒలంపిక్స్‌ వాయిదా..

టోక్యో ఒలంపిక్స్‌ వాయిదా..

జపాన్‌: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను ఆర్థికంగా దెబ్బతీస్తూ, వేలాది మంది ప్రాణాలను హరిస్తున్న మహమ్మారి వైరస్‌.. ‘కరోనా’ ప్రభావం ఒలంపిక్స్‌పై పడింది. దాదాపు 190 దేశాలకు పైగా విస్తరించిన ఈ వైరస్‌.. విశ్వక్రీడలకు అడ్డంకిగా మారింది. ఈ ఏడాది జపాన్‌ రాజధాని.. టోక్యో వేదికగా జరగాల్సిన ఒలంపిక్‌ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడ్డాయి. ఇవాళ జపాన్‌ ప్రధాని షింజో అబేతో ఒలంపిక్‌ కమిటీ సమేవేశమైంది. ఈ సమావేశంలో ఒలంపిక్‌ కమిటీ ముందు షింజో అబే.. విశ్వక్రీడలను ఏడాది పాటు వాయిదా వేయాలని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచదేశాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తన నిర్ణయాన్ని కమిటీ ముందు ఉంచానని జపాన్‌ ప్రధాని అన్నారు. కాగా, జపాన్‌ ప్రధాని మాటలకు కమిటీ సానుకూలంగా స్పందించింది. విశ్వక్రీడలను ఏడాదిపాటు వాయిదా వేయాలని నిర్ణయించింది. 

ఇప్పటికే ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఒలంపిక్స్‌ వాయిదా వేయాలనీ తెలిపాయి. కాదని కొనసాగిస్తే తాము పాల్గొనబోమని స్పష్టం చేశాయి. దీంతో, విశ్వ క్రీడలను వాయిదా వేయక తప్పలేదని ఒలంపిక్‌ అధ్యక్షుడు.. థామస్‌ బాక్‌ తెలిపారు. వచ్చే ఏడాది(2021) టోక్యో వేదికగానే ఒలంపిక్స్‌ నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. 

తొలిసారి వాయిదా..

ఒలింపిక్స్‌ను వాయిదా వేసేందుకు అంత‌ర్జాతీయ ఒలింపిక్ క‌మిటీ అంగీకరించిన‌ట్లు జ‌పాన్ ప్ర‌ధాని షింజే అబే తెలిపారు.  క్రీడ‌ల‌ను ఏడాది పాటు వాయిదా వేయాల‌ని ప్ర‌తిపాదించాను, ఐఓసీ అధ్య‌క్షుడు థామ‌స్ బాచ్ ఆ ప్ర‌తిపాద‌న‌ను నూరు శాతం అంగీక‌రించిన‌ట్లు ప్ర‌ధాని షింజో అబే తెలిపారు.  జూలై 24వ తేదీ నుంచి ఆగ‌స్టు 9 వ‌ర‌కు 2020 ఒలింపిక్స్ జ‌ర‌గాల్సి ఉన్న‌ది. కానీ ప్ర‌పంచ దేశాలు అన్నీ క‌రోనా వైర‌స్ ప్ర‌భావానికి లోనుకావ‌డంతో జ‌పాన్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది. 

ఒలింపిక్స్‌ను వాయిదా వేయ‌డం ఇదే మొద‌టిసారి అని, గ‌తంలో వ‌ర‌ల్డ్ వార్ స‌మ‌యంలో క్రీడ‌ల‌ను ర‌ద్దు చేశార‌ని, కానీ తొలిసారి వాయిదా వేస్తున్నార‌ని అధికారులు చెప్పారు. 2021 స‌మ్మ‌ర్‌లో ఈ క్రీడ‌ల‌ను నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్నాయి. ఒలింపిక్స్ ఏర్పాట్ల కోసం ఇప్ప‌టికే జ‌పాన్ సుమారు 30 బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేసింది.  అయితే క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో.. ప‌లు దేశాలు త‌మ అథ్లెట్ల‌ను పంపేందుకు నిరాక‌రించాయి. 


logo