బుధవారం 15 జూలై 2020
Sports - Apr 14, 2020 , 19:09:38

ఒలింపిక్స్ వాయిదా నిరాశ కల్గించింది: భావ‌న

ఒలింపిక్స్ వాయిదా నిరాశ కల్గించింది: భావ‌న

ఒలింపిక్స్ వాయిదా నిరాశ కల్గించింది: భావ‌న

బెంగ‌ళూరు:  టోక్యో ఒలింపిక్స్ వ‌చ్చే ఏడాదికి వాయిదా ప‌డ‌టం త‌న‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింద‌ని రేస్ వాక‌ర్ భావ‌న జాట్ అంది. గ‌త ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన జాతీయ చాంపియ‌న్‌షిప్ 20కి.మీల విభాగంలో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించడం ద్వారా భావ‌న..టోక్యో ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించింది. సుదీర్ఘ  ప‌రుగుల రేసులో టోక్యో విశ్వ‌క్రీడ‌ల బెర్తు ద‌క్కించుకున్న తొలి భార‌త మ‌హిళా అథ్లెట్‌గా భావ‌న నిలిచింది. 

అయితే క‌రోనా వైర‌స్‌తో ప‌రిస్ధితులు పూర్తిగా మారిపోయాయ‌ని, ఇదే జోరులో ఒలింపిక్స్‌లో స‌త్తాచాటుదామ‌నుకున్న త‌న ఆశ‌లు స‌న్న‌గిల్లాయ‌ని చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని సాయ్ శిక్ష‌ణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న ఈ రాజ‌స్థాన్ అథ్లెట్ మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడింది. 

‘మంచి ఫామ్‌మీదున్న స‌మ‌యంలో ఒలింపిక్స్ వాయిదా ప‌డ‌టం నిరాశ కల్గించింది. క‌రోనా కార‌ణంగా మార్చిలో జ‌పాన్‌లో జ‌రుగాల్సిన ఆసియా చాంపియ‌న్‌షిప్ వాయిదా ప‌డింది. ఈ టోర్నీ ద్వారా అంత‌ర్జాతీయ స్థాయిలో నేను రాణించ‌గ‌ల్గుతానో లేదో నిరూపించుకోవాల‌నుకున్నాను. అస‌లు టోర్నీలు ఎప్పుడు మొద‌లవుతాయ‌నేది ఇప్పుడు సందేహంగా మారింది. వైర‌స్ వ్యాప్తి చూస్తుంటే వ‌చ్చే ఏడాది కూడా ఒలింపిక్స్ జరుగుతాయా అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా ఉంది. సాయ్ సెంట‌ర్‌లో స‌హ‌చ‌రుల‌తో క‌లిసి ఫిట్‌నెస్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఒక‌రికొక‌రం సామాజిక దూరం పాటిస్తున్నాం’ అని భావ‌న జాట్ అంది. 


logo