గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Mar 17, 2020 , 00:13:13

జీవితాలను త్యాగం చేయలేం

జీవితాలను త్యాగం చేయలేం
  • ఒలింపిక్స్‌పై జపాన్‌లో అత్యధికుల అభిప్రాయం ..
  • వాయిదా లేదా రద్దు చేయాలని డిమాండ్‌
  • కరోనా భయంతో విశ్వక్రీడలపై పెరుగుతున్న వ్యతిరేకత..
  • నేడు సభ్యదేశాలతో ఐఓసీ సమావేశం

కరోనా వైరస్‌ విజృంభణతో టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణ సాధ్యమవుతుందా అన్న సందిగ్ధత పెరుగుతూనే ఉంది. జపాన్‌ ప్రధాని షింజో అబే సహా ఐవోసీ అధికారులు షెడ్యూల్‌ ప్రకారమే విశ్వక్రీడలు జరుపుతామన్నా.. పరిస్థితులు మాత్రం రోజురోజుకూ ప్రతికూలంగా మారుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్న విపత్కర పరిస్థితుల్లో  ఒలింపిక్స్‌ నిర్వహించడాన్ని జపాన్‌లో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. తమ జీవితాలను తాకట్టు పెట్టి క్రీడలు నిర్వహించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై సభ్య క్రీడా దేశాలతో ఐవోసీ నేడు నిర్వహించనున్న సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 


టోక్యో: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) విజృంభణతో టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై అనుమానాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. జపాన్‌ ప్రధాని షింజో అబేతో పాటు ఐవోసీ చీఫ్‌ థామస్‌ బాచ్‌ ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని ప్రకటించినా.. జపాన్‌వాసుల్లో అత్యధికులు విశ్వక్రీడలు నిలిపివేస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. తమ జీవితాలను తాకట్టు పెట్టి క్రీడలను నిర్వహించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. జపాన్‌లో ఇప్పటికే 814మంది కరోనా వైరస్‌కు గురికాగా, 24మంది మరణించారు. అయితే ఒలింపిక్స్‌కు నాలుగు నెలల సమయం ఉండడంతో దేశంలో వైరస్‌ ప్రభావం తగ్గినా.. విదేశాల నుంచి వచ్చే వారి వల్ల మళ్లీ వచ్చే ప్రమాదముందని జపాన్‌ ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జూలై 24 నుంచి ఆగస్టు 9వరకు విశ్వక్రీడలు జరగాల్సి ఉంది.   


70శాతం మంది నో.. 

ఈనెల 6 నుంచి 9వ తేదీ మధ్య జపాన్‌ బ్రాడ్‌కాస్టర్‌ ఎన్‌హెచ్‌కే.. ఒలింపిక్స్‌ నిర్వహణపై దేశ వాసుల అభిప్రాయాలను సేకరించింది.  సర్వేలో పాల్గొన్న 45శాతం మంది టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహించడాన్ని వ్యతిరేకించగా.. 40శాతం మంది సమర్థించారు. మరోసారి తాజాగా వెయ్యి మంది అభిప్రాయాలను సేకరించగా అందులో 69.9 మంది టోక్యో ఒలింపిక్స్‌ను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించకూడదని అభిప్రాయపడ్డారని ఎన్‌హెచ్‌కే సోమవారం వెల్లడించింది. 


ప్రాణాలను త్యాగం చేయలేం..

ఒలింపిక్స్‌ నిర్వహణపై చాలా మంది జపాన్‌ ప్రజలు మీడియా ద్వారా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ‘కరోనా సంక్షోభం నుంచి జపాన్‌ బయటపడినా.. ప్రపంచం నలుమూలల నుంచి విదేశీయులు రావడం ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ఒలింపిక్స్‌ నిర్వహించకపోవడమే ఉత్తమం. ఆటల కోసం జీవితాన్ని త్యాగం చేయలేం’ అని కోకి మురా అనే ఉద్యోగి చెప్పారు. ‘ట్రంప్‌ చెప్పినట్టు.. ఒలింపిక్స్‌ను సంవత్సరం పాటు వాయిదా వేయడం మంచిదనేదే నా అభిప్రాయం కూడా. ఇది కాస్త నిరాశ కలిగించేదే అయినా తప్పదు’ అని 90ఏండ్ల మసావ్‌ సుగవారా అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒలింపిక్స్‌పై ఇంతటి ఆందోళన రేగడం ఇప్పుడే చూస్తున్నానని చెప్పారు. ‘చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వైరస్‌ వ్యాప్తి జూన్‌లోగా నియంత్రణలోకి రాకపోతే వాయిదా వేయడమే మంచిది’ అని న్యాయవాది మాన్‌ఫ్రెడ్‌ చెప్పారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ సహా మిగిలిన టోర్నీలు రద్దవుతుండడంతో కొందరు అథ్లెట్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


జీవితంలో ఒకసారి: 

ప్రస్తుత పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ నిర్వహించవద్దంటూ మెజారిటీ జపాన్‌ వాసులు తమ డిమాండ్‌ వినిపిస్తుంటే..మరోవైపు జీవితంలో ఒకసారి వచ్చే అవకాశాన్ని చేజార్చుకోవద్దని మరికొందరు అంటున్నారు. ‘స్వదేశంలో విశ్వక్రీడలు చూసే అవకాశం జీవితంలో ఒకసారే దక్కొచ్చు. అందుకే నా కొడుకును తీసుకెళ్లాలనుకుంటున్నాను. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి ఇలాగే కొనసాగితే మాత్రం వాయిదా వేయడం మంచింది’ అని హిసాయా సుజుకి అన్నారు.


నేడు ఐవోసీ సమావేశం 

కరోనా వ్యాప్తి అంతకంతకూ పెరుగుతుండడంతో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐవోసీ) మంగళవారం సభ్యక్రీడా దేశాలతో పాటు వివిధ క్రీడా ప్రపంచ సమాఖ్యలతో అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కాన్ఫరెన్స్‌ కాల్‌ ద్వారా ఈ సమావేశం జరుగనుంది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 6,500మందికి పైగా మృతి చెందగా, లక్షా 75వేల మంది వైరస్‌ బారిన పడ్డారు.


నిర్ణయానికి తుదిగడువేం లేదు: ఐవోసీ

సిడ్నీ: కరోనా వైరస్‌ వల్ల టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో విశ్వక్రీడలను  రద్దు చేయాల్సి వస్తే, ఆ నిర్ణయం తీసుకునేందుకు ఎలాంటి తుదిగడువు లేదని అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐవోసీ) సమన్వయ కమిషనర్‌ జాన్‌ కోట్స్‌ తెలిపాడు. అయితే ఒలింపిక్స్‌ సజావుగా సాగుతాయనే ఆశిస్తున్నామని ఆస్ట్రేలియాకు చెందిన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. విశ్వక్రీడలపై తుది నిర్ణయం తీసుకునేందుకు మే చివరి గడువని వస్తున్న వార్తల్లో నిజం లేదని జాన్‌ స్పష్టం చేశాడు. మరోవైపు జపాన్‌ ప్రధాని షింజో అబేతో పాటు ఐవోసీ చీఫ్‌ థామస్‌ బాచ్‌ కూడా ఒలింపిక్స్‌ సజావుగా సాగుతాయని చెబుతూనే ఉన్నారు.


 టార్చ్‌ రిలేకు నోఎంట్రీ 

ఏథెన్స్‌: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్‌ టార్చ్‌ రిలేకు ప్రేక్షకులను అనుమతించకూడదని గ్రీక్‌ ఒలింపిక్‌ కమిటీ నిర్ణయించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో భాగంగా టోక్యో ఒలింపిక్‌ జ్యోతి చేతులు మారే సందర్భాన్ని చూసేందుకు అభిమానులకు జారీచేసిన పాస్‌లను రద్దు చేసింది.1896లో మొదటి ఆధునిక ఒలింపిక్స్‌ జరిగిన ప్రఖ్యాత ఏథెన్స్‌ స్టేడియంలో.. గురువారం నిర్వహించనున్న వేడుకకు ముందస్తుగా జారీచేసిన అక్రిడిటేషన్‌ కార్డులు చెల్లవని కమిటీ స్పష్టంచేసింది. 


logo
>>>>>>