ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 29, 2020 , 00:31:11

కరోనా పరేషాన్‌

కరోనా పరేషాన్‌

కరోనా..ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్‌. చైనాలో పుట్టి రోజురోజుకు విస్తృతమవుతున్న వైరస్‌ కారణంగా జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. ఏ ఒక్కరి నోట విన్నా ఇదే మాట. అంతలా ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్‌ క్రీడాటోర్నీలపై తీవ్రంగా ప్రభావం చూపెడుతున్నది. ఎంతలా అంటే నాలుగేండ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌ అసలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు కల్గిస్తున్నది. ఇలాగే వైరస్‌ వృద్ధి చెందుతూ పోతే టోక్యో ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ ప్రకారం జరిగే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా టోర్నీలపై వైరస్‌ కల్గిస్తున్న ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం.

  • గుబులు రేపుతున్న వైరస్‌..
  • టోక్యో ఒలింపిక్స్‌పై నీలినీడలు ..
  • వాయిదా పడుతున్న టోర్నీలు

టోక్యో: కరోనా వైరస్‌ అందరి గుండెల్లో గుబులు రేపుతున్నది. వుహాన్‌ మార్కెట్‌లో మొదలైన ఈ వైరస్‌ అంతకంతకు విస్తృత రూపం దాల్చుతూ 55 దేశాలకు వేగంగా వ్యాప్తి చెందింది. ఈ కారణంగా టోక్యో ఒలింపిక్స్‌తో పాటు అర్హత టోర్నీల్లో పాల్గొనే ఆటగాళ్ల ప్రాతినిధ్యంపై సందిగ్ధత ఏర్పడింది. ముఖ్యంగా చైనాలో జరుగాల్సిన టోర్నీలను వేరే వేదికలకు మార్చాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఆసియా బాక్సింగ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీకి తోడు రెజ్లింగ్‌ టోర్నీలు ఇప్పటికే వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా సైప్రస్‌ వేదికగా వచ్చే నెలలో జరుగాల్సిన షూటింగ్‌ ప్రపంచకప్‌ నుంచి భారత్‌ తప్పుకుంది. ఇలా చెప్పుకుంటే పోతే పెద్ద జాబితానే ఉంది. మరోవైపు కరోనా వైరస్‌ ఆందోళనకరంగా ఉన్నా..క్వాలిఫయింగ్‌ టోర్నీలను వాయిదా వేసే ప్రసక్తే లేదంటూ ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్‌) ప్రకటించింది. 


షెడ్యూల్‌ ప్రకారమే: 

టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభానికి మరో ఐదు నెలల సమయమున్నా..అసలు నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం జరుగుతాయా లేదా అన్న దానిపై అయోమయం నెలకొన్నది. అయితే ఒకవేళ వైరస్‌ ప్రభావం అంతకంతకు పెరిగితే ఒలింపిక్స్‌కు ‘ప్లాన్‌ బి’ లేదన్నది తెలుస్తున్నది. ఇదిలా ఉంటే...గేమ్స్‌ షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని, ఎలాంటి మార్పులు ఉండవని డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ కస్తురా ఎన్యో అంది. విశ్వక్రీడలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జపాన్‌ ప్రభుత్వం ఇప్పటికే 12 బిలియన్ల డాలర్ల(రూ.87వేల కోట్లు)ను ఖర్చుచేసింది. ఒలింపిక్స్‌ చూసేందుకు వచ్చే వివిధ దేశాల అభిమానులతో టూరిజం పెరిగే అవకాశముందని తొలుత భావించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జపాన్‌ ఆశలు సన్నగిల్లినట్లు కనిపిస్తున్నాయి. ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం లేక రద్దు చేయడం, మరో చోటికి తరలించడం లాంటి వార్తలు జపాన్‌ను ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టెలా కనిపిస్తున్నాయి. వాస్తవానికి చైనాలో వైరస్‌ ప్రభావం ఎక్కువున్నా...జపాన్‌లో దీని కారణంగా ఇప్పటి వరకు 9 మంది మరణించగా, 900 మందికిపైగా వైరస్‌తో బాధపడుతున్నారు. వైరస్‌ ప్రభావంతో ఒలింపిక్‌ టార్చ్‌ రన్‌ను కూడా జపాన్‌ ప్రభుత్వం వాయిదా వేసింది. దీనికి తోడు దేశంలో జరుగాల్సిన వివిధ టోర్నీలను అక్కడి ప్రభుత్వం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. టోక్యోకు చెందిన యొమురి జెయింట్స్‌ జట్టు తమ ప్రిసీజన్‌ బేస్‌బాల్‌ మ్యాచ్‌లను ఖాళీగా ఉన్న స్టేడియంలో ఆడాల్సి వచ్చింది. ఇక మార్చి 1న జరుగాల్సిన టోక్యో మారథాన్‌లో కేవలం ఎలైట్‌ రన్నర్స్‌కు మాత్రమే అవకాశం కల్పించారు.  


కోట్లు ఖర్చుపెట్టి: 

56 ఏండ్ల తర్వాత సొంతగడ్డపై జరుగబోతున్న ఒలింపిక్స్‌ నిర్వహణను జపాన్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా ముఖ్య వేదిక అయిన నేషనల్‌ స్టేడియం నిర్మాణం కోసం 1.42(రూ.7వేల కోట్లు) ఖర్చు చేసింది. అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ ఈ స్టేడియాన్ని నిర్మించింది. 


టోక్యో రద్దయితే: 

ఒకవేళ కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెంది ఒలింపిక్స్‌ నిర్వహణ కష్టమైతే...వాయిదా వేయడమా లేక వేరే వేదికకు తరలించడమా అన్నది అంతర్జాతీయ ఒలింపిక్‌ సమాఖ్య నిర్ణయం తీసుకోనుంది. చివరిసారి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒలింపిక్స్‌ వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు అలాంటి పరిస్థితి ఏర్పడలేదు. ఒకవేళ రద్దయితే తాము ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లండన్‌ పేర్కొంది. 


షెడ్యూల్‌ ప్రకారం టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు’ 

- థామస్‌ బాచ్‌

(అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు) 


logo