బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 06, 2020 , 00:43:45

పట్టేస్తారా..

పట్టేస్తారా..

  • సిరీస్‌ నెగ్గాలని టీమ్‌ఇండియా
  • సమం చేయాలని ఆసీస్‌ తహతహ
  • నేడు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న చందంగా.. వన్డే సిరీస్‌ కోల్పోయిన చోటే టీ20 సిరీస్‌ చేజిక్కించుకునేందుకు కోహ్లీసేన సమాయత్తమవుతున్నది. వరుస వన్డేలు ఓడిన సిడ్నీ మైదానంలో టీ20 సిరీస్‌ ఒడిసి పట్టేందుకు కోహ్లీసేన కసరత్తులు చేస్తున్నది. గాయం కారణంగా రవీంద్ర జడేజా దూరమవడం టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ కాగా.. ఆసీస్‌ కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ మ్యాచ్‌ ఆడుతాడా లేదా అనేది సందిగ్ధంగా మారింది. బ్యాటింగ్‌లో రాహుల్‌, విరాట్‌.. బౌలింగ్‌లో బుమ్రా, నట్టూ, యుజీ సత్తాచాటితే టెస్టు సిరీస్‌కు ముందు టీమ్‌ఇండియా అంతులేని ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకోవడం ఖాయమే!

సిడ్నీ: ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో తొలి టీ20లో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. నిర్ణయాత్మక రెండో పోరులో ఫేవరెట్‌గా బరిలో దిగనుంది. మిడిలార్డర్‌ విఫలమైనా.. బౌలర్లు విజృంభించడంతో కాన్‌బెర్రాలో బోణీ చేసిన కోహ్లీ సేన.. ఆదివారం సిడ్నీ వేదికగా ఆసీస్‌తో రెండో టీ20లోనూ నెగ్గి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ చేజిక్కించుకోవాలని చూస్తున్నది. ఈ మైదానంలో ఆడిన రెండు వన్డేల్లోనూ భారత్‌ ఓటమి పాలవగా.. ఆ పరాజయాలను పక్కనపెట్టి ప్రతిష్టాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని భావిస్తున్నది. గత మ్యాచ్‌లో స్టార్క్‌ బౌన్సర్‌ ధాటికి గాయపడ్డ రవీంద్ర జడేజా సిరీస్‌కు దూరం కావడం భారత్‌ను కలవరపెట్టే అంశం కాగా.. ఫ్లాట్‌ పిచ్‌పై టాపార్డర్‌ గాడిన పడకుంటే భారత్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. 

కోహ్లీ కుదురుకుంటేనే..

తొలి వన్డే తర్వాత చెప్పుకోదగ్గ స్కోరు చేయని ధవన్‌ నుంచి టీమ్‌ఇండియా భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నది. మరోవైపు కోహ్లీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో అలరించక చాన్నాళ్లు అయ్యింది. వీళ్లతో పాటు సంజూ శాంసన్‌, మనీశ్‌ పాండే కూడా తమ బ్యాట్‌లకు పనిచెబితే భారీ స్కోరు ఖాయమే. జడేజా అందుబాటులో లేకపోవడంతో హార్దిక్‌ పాండ్యాపై అదనపు భారం పడనుంది. తొలి టీ20 నుంచి విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. షమీ స్థానంలో తుది జట్టులోకి రావడం ఖాయమే. బుమ్రా, నటరాజన్‌ కలిసి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ను ఎలా కట్టడి చేస్తారనేది ఆసక్తికరం. గత మ్యాచ్‌లో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' గెలుచుకున్న యుజ్వేంద్ర చాహ ల్‌ మరోసారి కీలకం కానున్నాడు. తొలి పోరులో వికెట్లు పడగొట్టకపోయినా.. పవర్‌ప్లేలో కట్టుదిట్టంగా బంతులేసిన సుందర్‌ అదే ప్రదర్శన పునరావృతం చేయాలని మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది.

ఫించ్‌ అనుమానమే..

ఆసీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఈ మ్యాచ్‌లో ఆడేది అనుమానంగా కనిపిస్తున్నది. ఒకవేళ అతడికి విశ్రాంతినిస్తే.. మాథ్యూ వేడ్‌ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. వార్నర్‌ గైర్హాజరీలో ఓపెనర్‌గా ఫర్వాలేదనిపించిన షార్ట్‌తో పాటు స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌ కీలకం కానున్నారు. బౌలింగ్‌లో హజిల్‌వుడ్‌, స్టార్క్‌, అబాట్‌, హెన్రిక్స్‌ పేస్‌ బాధ్యతలు మోయనుండగా.. గత మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్వెప్సన్‌ స్థానంలో నాథన్‌ లియోన్‌ జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి.

 తుది జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), ధవన్‌, రాహుల్‌, శాంసన్‌, మనీశ్‌/అయ్యర్‌, హార్దిక్‌, సుందర్‌, దీపక్‌, నటరాజన్‌, బుమ్రా, చాహల్‌.

ఆస్ట్రేలియా: ఫించ్‌/వేడ్‌ (కెప్టెన్‌), షార్ట్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, క్యారీ, అబాట్‌, స్టార్క్‌, లియోన్‌, జంపా, హజిల్‌వుడ్‌.

పిచ్‌, వాతావరణం

సిడ్నీ పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ జరిగిన తొలి రెండు వన్డేల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. వాతావరణం పొడిగా ఉండనుంది. వర్ష సూచన లేదు. 

నేటి నుంచి వామప్‌ మ్యాచ్‌

  • భారత్‌-ఏ x ఆస్ట్రేలియా-ఏ 

సిడ్నీ: ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌కు ముందు భారత ఆటగాళ్లు వామప్‌ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచి ఆస్ట్రేలియా-ఏతో భారత్‌-ఏ మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఓవైపు కోహ్లీసేన ఆస్ట్రేలియాతో రెండో టీ20కి సిద్ధమవుతుంటే.. అదే సమయంలో టెస్టు స్పెషలిస్టులు ఎర్ర బంతితో బరిలో దిగనున్నారు. నాలుగు మ్యాచ్‌ల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో తొలి టెస్టు ఈనెల 17న అడిలైడ్‌ వేదికగా మొదలవనుంది. దీనికి ముందు ఆడనున్న రెండు వామప్‌ మ్యాచ్‌ల్లో కాంబినేషన్‌లను సరిచూసుకోవాల్సి ఉంది. రోహిత్‌ శర్మ గైర్హాజరీలో మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి ఎవరు ఓపెనింగ్‌ చేస్తారనేది టీమ్‌ఇండియా తేల్చుకోవాల్సి ఉంది. ఈ స్లాట్‌ కోసం పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌, లోకేశ్‌ రాహుల్‌ పోటీలో ఉన్నారు. తొలి టెస్టు అనంతరం విరాట్‌ కోహ్లీ స్వదేశానికి తిరిగి వెళ్లనున్న నేపథ్యంలో  రహానే,  పుజార,  విహారి మరింత కీలకం కానున్నారు. ఇక వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌, వృద్ధిమాన్‌ సాహా మధ్య పోటీ నెలకొంది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో వీరందరూ ఆడనుండటంతో ఈ ప్రదర్శన ఆధారంగానే గులాబీ టెస్టుకు జట్టును ఎంపిక చేసే చాన్స్‌లు ఉన్నాయి. ఇక బౌలింగ్‌ విభాగంలో  షమీ, బుమ్రాతో పాటు మూడో పేసర్‌గా హైదరాబాదీ సిరాజ్‌కు చాన్స్‌ ఇవ్వాలా.. లేక సీనియర్‌ ఉమేశ్‌ యాదవ్‌ను కొనసాగించాలో కూడా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో తేలనుంది.logo