శుక్రవారం 15 జనవరి 2021
Sports - Nov 29, 2020 , 00:28:18

సమిష్టిగా సత్తాచాటాల్సిందే..

సమిష్టిగా  సత్తాచాటాల్సిందే..

  • నేడు భారత్‌, ఆస్ట్రేలియా రెండో వన్డే 
  • కోహ్లీసేనకు చావోరేవో
  • దూకుడుమీదున్న కంగారూలు 

సిడ్నీ: బౌలింగ్‌ వైఫల్యం, పేలవమైన ఫీల్డింగ్‌, ఆల్‌రౌండర్ల కొరతతో ఆస్ట్రేలియా పర్యటనలో తొలి వన్డే ఓడిన టీమ్‌ఇండియా తప్పక సత్తాచాటాల్సిన తరుణం ఆసన్నమైంది. అన్ని విభాగాల్లో విఫలమై 66 పరుగుల తేడాతో పరాభవానికి గురైన భారత్‌.. మూడు వన్డేల సిరీస్‌ను నిలుపుకోవాలంటే ఆదివారం ఇక్కడ జరిగే రెండో మ్యాచ్‌లో అతిథ్య ఆసీస్‌పై కచ్చితంగా గెలువాల్సిన పరిస్థితి కొనితెచ్చుకుంది. జట్టులో సమతూకం లేకపోవడం సమస్యగా మారిందని కెప్టెన్‌ కోహ్లీ అన్నట్టే ఆల్‌రౌండర్‌ కొరత జట్టులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. హార్దిక్‌ పాండ్య తొలి వన్డేలో బ్యాటింగ్‌లో సత్తాచాటినా.. గాయం నుంచి ఇటీవలే కోలుకున్న అతడు బౌలింగ్‌ చేసే పరిస్థితులు లేవు. దీంతో ఆరో బౌలర్‌ అందుబాటులో లేకపోవడంతో ఉన్న బౌలింగ్‌ దళంపై ఒత్తిడి పెరుగుతోంది. అదనపు బ్యాట్స్‌మెన్‌ను తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆసీస్‌ను ఓడించాలంటే భారత టాపార్డర్‌ కచ్చితంగా సత్తాచాటాల్సిందే. 

టాప్‌ను కూలిస్తేనే.. 

ఆస్ట్రేలియాపై పైచేయి సాధించాలంటే ఆ జట్టు టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌, కెప్టెన్‌ ఫించ్‌, స్టీవ్‌ స్మిత్‌ త్రయాన్ని బుమ్రా నేతృత్వంలోని పేస్‌ దళం త్వరగా పెవిలియన్‌కు పంపాలి. ఒకవేళ వీరు కుదురుకుంటే తొలి వన్డేలా పరుగుల వరద పారించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరోవైపు భారత యువ పేసర్‌ నవ్‌దీప్‌ సైనీ, స్టార్‌ స్పిన్నర్‌ చాహల్‌ ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. తొలి వన్డేలో ఈ ఇద్దరు 20 ఓవర్లలో 172 పరుగులు సమర్పించుకున్నారు. మరోవైపు సన్‌రైజర్స్‌ యార్కర్‌ స్పెషలిస్టు నటరాజన్‌ వన్డేలకు కవర్‌ బౌలర్‌గా వచ్చాడు. ఒకవేళ చాహల్‌ కూడా ఆడలేకుంటే కుల్దీప్‌ యాదవ్‌ లేదా బ్యాటింగ్‌ కూడా చేయగల పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. 

బలహీనతను కోహ్లీ అధిగమించాల్సిందే.. 

రన్‌ మెషీన్‌, టీమ్‌ఇండియా కెప్టెన్‌ కోహ్లీకి సిడ్నీ మైదానంలో చెత్త రికార్డు ఉంది. ఈ వేదికలో అతడి వన్డే సగటు 11.40 మాత్రమే. ఈ బలహీనతను కోహ్లీ అధిగమించి జూలు విదిలించాల్సిన సమయం వచ్చింది. తొలి వన్డేలో శిఖర్‌ ధవన్‌ ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగించగా..  బౌన్సర్లకు బోల్తా పడిన మయాంక్‌ అగర్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ పిచ్‌కు తగ్గట్టుగా ఆడాల్సి ఉంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న కేఎల్‌ రాహుల్‌ విజృంభిస్తే భారత్‌ మిడిలార్డర్‌ కష్టాలు తీరుతాయి. మరోవైపు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా హార్దిక్‌ మరోసారి నిరూపించుకోవాల్సి ఉంది. స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, కమిన్స్‌, జంపాతో పటిష్టంగా ఉన్న ఆసీస్‌ బౌలింగ్‌ దళాన్ని బాదాలంటే భారత బ్యాట్స్‌మెన్‌ ఆత్మవిశ్వాసంతో ఆడాల్సి ఉంది. తొలి వన్డేలో ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ గాయపడడంతో ఆసీస్‌ జట్టులోకి కొత్త కుర్రాడు కామెరూన్‌ గ్రీన్‌ రావడం కచ్చితంగా కనిపిస్తున్నది. 

కోహ్లీసేనకు జరిమానా 

తొలి వన్డేలో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా భారత జట్టుకు మ్యాచ్‌ ఫీజులో 20 శాతం కోతపడింది. నిర్ణీత సమయంలో 50 ఓవర్లు  పూర్తి చేయకపోవడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ రిఫరీ డేవిడ్‌ బూన్‌.. కోహ్లీసేనకు జరిమానా విధించారు. అలాగే ఇది సుదీర్ఘంగా సాగిన వన్డే అంటూ మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆసీస్‌ స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

జట్లు (అంచనా): 

భారత్‌: ధవన్‌, మయాంక్‌, కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, నటరాజన్‌/సైనీ, షమీ, చాహల్‌/కుల్దీప్‌, బుమ్రా 

ఆస్ట్రేలియా: వార్నర్‌, ఫించ్‌(కెప్టెన్‌), స్మిత్‌, లబుషేన్‌, క్యారీ, మ్యాక్స్‌వెల్‌, గ్రీన్‌/అబాట్‌, కమిన్స్‌, స్టార్క్‌, జంపా, హేజిల్‌వుడ్‌