సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 14, 2020 , 00:46:32

పండుగ పుంజేదో?

పండుగ  పుంజేదో?

గతేడాది వన్డే ప్రపంచకప్‌ తర్వాత గట్టి ప్రత్యర్థితో సిరీస్‌ ఆడని టీమ్‌ఇండియా.. ఆర్నెళ్లుగా అసలు వన్డే బరిలోనే దిగని ఆస్ట్రేలియా.. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమయ్యాయి. పండుగ వేళ జరుగనున్న ఈ పోరులో పందెం కోళ్లకు కొదువేలేదు. రోహిత్‌, ధవన్‌, రాహుల్‌, విరాట్‌తో భారత టాపార్డర్‌ దుర్భేద్యంగా కనిపిస్తుంటే.. ఫించ్‌, వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌తో కంగారూలు కదనానికి సై అంటున్నారు. బౌలింగ్‌లో బుమ్రా, షమీ బుల్లెట్లు సంధించేందుకు సిద్ధమవుతుంటే.. కమిన్స్‌, స్టార్క్‌ రాకెట్లు రెడీ చేసుకుంటున్నారు. మరి సమ ఉజ్జీల సమరంలో శుభారంభం చేసేదెవరో చూడాలి.

  • నేడు భారత్‌, ఆస్ట్రేలియా తొలి వన్డే
  • సమరోత్సాహంలో ఇరు జట్లు
  • మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో..

ముంబై: వరుస విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియా.. సంప్రదాయ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న ఆస్ట్రేలియాతో సమరానికి సిద్ధమయ్యాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడి వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరుగనుంది. వన్డే ప్రపంచకప్‌ (2019) లీగ్‌ దశలో ఎదురుపడ్డ తర్వాత ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగలేదు. గతేడాది మెగాటోర్నీకి ముందు బలహీన జట్టుతో భారత్‌లో అడుగుపెట్టి.. టీ20, వన్డే సిరీస్‌లు చేజిక్కించుకున్న ఆసీస్‌ను ఈ సారి చిత్తుకింద కొట్టాలని విరాట్‌ సేన యోచిస్తుంటే.. టెస్టు ఫామ్‌ను వన్డేల్లోనూ కొనసాగించి టీమ్‌ఇండియాను దెబ్బతీయాలని కంగారూలు కంకణం కట్టుకొని ఉన్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఇలా ఏ విభాగంలో చూసుకున్నా ఇరుజట్లు సమ ఉజ్జీలుగా కనపిస్తుండటంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తున్నది. అయితే అసలు పోరు ప్రారంభానికి ముందే మాటల దాడి మొదలెట్టే ఆసీస్‌.. ఈ సారి కాస్త సంయమనం పాటిస్తుండగా.. సిరీస్‌ హోరాహోరీగా సాగినా.. అంతిమ ఫలితం మాత్రం ఆసీస్‌కు అనుకూలంగానే వస్తుందని రికీ పాంటింగ్‌ అంటున్నాడు. మరి బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పరుగుల వరద పారించి సిరీస్‌లో శుభారంభం చేసేదెవరో నేడు తేలనుంది.


జాదవ్‌కు లాస్ట్‌ చాన్స్‌

జట్టులోకి వచ్చిన కొత్తలో తన ఉపయుక్తమైన స్పిన్‌తో ఆకట్టుకున్న కేదార్‌ జాదవ్‌.. ఇటీవల పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. న్యూజిలాండ్‌ పర్యటనకు ఈ నెల 19న వన్డే జట్టు ఎంపిక జరుగనున్న నేపథ్యంలో జాదవ్‌కు ఈ సిరీస్‌ కీలకంగా మారింది. ఇక్కడ ప్రభావం చూపలేకపోతే.. అజింక్యా రహానే, సూర్యకుమార్‌ యాదవ్‌లో ఒకరికి పిలుపు వచ్చే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇద్దరు స్పిన్నర్లకు బదులు ఒకే స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌తో బరిలో దిగాలని చూస్తున్నది. దీంతో ఏకైక స్పిన్నర్‌గా చాహల్‌ను తోసిరాజని ఆసీస్‌పై హ్యాట్రిక్‌ పడగొట్టిన కుల్దీప్‌ చోటు దక్కించుకోనున్నాడు. జడేజా, జాదవ్‌ రెండో స్పిన్నర్‌ బాధ్యతలు మోస్తారు. జోరుమీదున్న భారత పేస్‌ దళం ఆసీస్‌కు తమ వాడేంటో చూపెట్టాలని ఉత్సుకతతో ఉంది. బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేయగల శార్దూల్‌ను తుది జట్టులో చోటివ్వాలంటే.. షమీ, సైనీల్లో ఒకరు బెంచ్‌కు పరిమితంకాక తప్పకపోవచ్చు. ప్రపంచకప్‌ తర్వాత బుమ్రా ఆడనున్న తొలి వన్డే ఇదే కావడం గమనార్హం.


ఆర్నెళ్ల తర్వాత

వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ ఓటమి తర్వాత తిరిగి ఈ ఫార్మాట్‌లో బరిలోకి దిగని ఆస్ట్రేలియా.. ఆర్నెళ్ల తర్వాత వన్డే క్రికెట్‌ ఆడనుంది. గతేడాది బలహీన జట్టుతోనే భారత్‌ పర్యటనకు వచ్చి.. తొలి రెండు మ్యాచ్‌లు ఓడినా.. ఆ తర్వాత అద్వితీయ ప్రదర్శనతో హ్యాట్రిక్‌ విజయాలు సాధించి సిరీస్‌ చేజిక్కించుకున్న కంగారూలు.. ఈసారి బలమైన జట్టుతో బరిలో దిగనున్నారు. సంప్రదాయ ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్న మార్నస్‌ లబుషేన్‌.. ఈ సిరీస్‌తో వన్డే అరంగేట్రం చేయనున్నాడు. మరి కొత్త ఆటగాళ్లను స్టార్‌లుగా మార్చడంలో తిరుగులేని రికార్డున్న భారత్‌.. లబుషేన్‌ను అడ్డుకుంటుందా, లేక అతడిని మరో క్వింటన్‌ డికాక్‌ను చేస్తుందా అనేది ఆసక్తికరం. ఫించ్‌, వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌, హ్యాండ్స్‌కోంబ్‌, కారీతో ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌.. బుమ్రా దళానికి సవాలు విసరడం ఖాయమే. బౌలింగ్‌లో స్టార్క్‌, కమిన్స్‌, హజల్‌వుడ్‌ జోరుమీదున్నారు. ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధర పలికిన కమిన్స్‌పై అందరి దృష్టి  ఉండనుంది. లీగ్‌ చరిత్రలోనే ఇంతవరకు ఏ విదేశీ ప్లేయర్‌కు దక్కనంత పెద్ద మొత్తం చేజిక్కించుకున్న కమిన్స్‌ సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. స్పిన్నర్లు జంపా, అగర్‌ కూడా సత్తాచాటగలవారే.


విరాట్‌ నాలుగులో..


హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా దిగేదెవరో అనే సందేహాలకు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. లోకేశ్‌ రాహుల్‌, శిఖర్‌ ధవన్‌లో ఎవరికో ఒక్కరికే స్థానం దక్కుతుందని అంతా భావిస్తుంటే.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానాన్ని వదులుకొని మరీ ఈ ఇద్దరినీ తుది జట్టులో ఆడించేందుకు కోహ్లీ రెడీ అయిపోయాడు. ‘జట్టు కోసం నేను ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం. ఒకే స్థానంలో ఆడాలని గిరి గీసుకొని కూర్చోలేదు’ అంటున్న విరాట్‌.. ఈ మ్యాచ్‌లో పెద్ద మార్పునకు పూనుకున్నాడు. వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ను పక్కన పెట్టి.. రాహుల్‌కు కీపింగ్‌ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్‌ అయ్యాడు. దీంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వెసులుబాటు కలగడంతో పాటు ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లను ఆడించే వీలు చిక్కుతుందని భావిస్తున్నాడు. 


అంతర్జాతీయ స్థాయిలో రాహుల్‌ పెద్దగా కీపింగ్‌ చేయకున్నా.. ఐపీఎల్లో అతడు వికెట్ల వెనుక చక్కటి ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. మరి కోహ్లీ ప్రయోగం ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాలి. ఆసీస్‌పై మంచి రికార్డు ఉన్న ధవన్‌ చెలరేగాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్నది. ఇరుజట్ల మధ్య చివరగా జరిగిన ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కిన ధవన్‌.. భారత్‌కు అలవోక విజయాన్నందించాడు. ఆ తర్వాత గాయాల బారిన పడిన గబ్బర్‌ ప్రస్తుతం కాస్త ఇబ్బందిపడుతున్నాడు. అయితే, లంకతో ఆడిన చివరి టీ20లో అర్ధశతకం బాది టచ్‌లోకి వచ్చిన అతడు ఇక్కడా అదే అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.


ప్రాక్టీస్‌లో పాండ్యా 


ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు స్టార్‌ ఆల్‌రౌండర్‌ హర్దిక్‌ పాండ్యా టీమ్‌ఇండియాతో కలిసి ప్రాక్టీస్‌ చేశాడు. యోయో టెస్టు విఫలం కావడంతో న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్‌కు దూరమైన పాండ్యా.. సోమవారం వాంఖడే స్టేడియంలో చెమటోడ్చాడు. జట్టు సభ్యులతో కలిసి కసరత్తులు చేయడంతో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ పర్యవేక్షణలో నెట్స్‌లో బంతులేస్తూ కనిపించాడు. 


ఆ మ్యాచ్‌ గుర్తుందా..

రెండేండ్ల క్రితం వాంఖడేలో జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్‌ చేతిలో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఓడింది. మొద ట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 8 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (121) సెంచరీతో అదరగొట్టినా.. మిగిలినవారు పెద్దగా రాణించకపోవడంతో భారత్‌ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. అనంతరం లాథమ్‌ (103), టేలర్‌ (95) సూపర్‌ బ్యాటింగ్‌తో చెలరేగడంతో కివీస్‌ 4 వికె ట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చే ధించింది. అయితే ఇటీవల వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన టీ20లో మాత్రం భారత్‌ విశ్వరూపం ప్రదర్శించింది. రోహిత్‌ (71), రాహుల్‌ (91), కోహ్లీ (70) అర్ధశతకాలతో విరుచుకుపడటంతో 20 ఓవర్లలో 240 పరుగులు చేసింది. అనంతరం ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసి సిరీస్‌ చేజిక్కించుకుంది.


తుది జట్లు (అంచనా)

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌, ధవన్‌, రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), అయ్యర్‌, జాదవ్‌, జడేజా, శార్దూల్‌, కుల్దీప్‌, షమీ/సైనీ, బుమ్రా.

ఆస్ట్రేలియా: ఫించ్‌ (కెప్టెన్‌), వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌, హ్యాండ్స్‌కోంబ్‌, కారీ, అగర్‌, కమిన్స్‌, స్టార్క్‌, హజిల్‌వుడ్‌, జంపా.


పిచ్‌, వాతావరణం

వాంఖడే వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. పిచ్‌పై పచ్చిక కనిపిస్తున్నది. సాయంత్రం వేళ మంచుపడే అవకాశం ఉండటంతో టాస్‌ గెలిచిన జట్టు లక్ష్యఛేదనకు మొగ్గుచూపొచ్చు. ఇటీవల వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన టీ20లో భారత్‌ 240 పరుగులు చేసిన విషయం తెలిసిందే.


1. మరో 10 పరుగులు చేస్తే.. వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల మైలురాయి దాటిన ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌గా వార్నర్‌ రికార్డు సృష్టించనున్నాడు. డీన్‌ జోన్స్‌ 128 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ దాటితే.. ప్రస్తుతం వార్నర్‌ 114 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు. 


కుల్దీప్‌ యాదవ్‌ మరో వికెట్‌ తీస్తే వన్డేల్లో 100 వికెట్లు పూర్తి చేసుకుంటాడు.


ఇటు రోహిత్‌ శర్మ.. 

అటు డేవిడ్‌ వార్నర్‌.

ఇటు విరాట్‌ కోహ్లీ.. 

అటు స్టీవ్‌ స్మిత్‌.

ఇటు లోకేశ్‌ రాహుల్‌..

 అటు మార్నస్‌ లబుషేన్‌.

ఇటు జస్ప్రీత్‌ బుమ్రా..

 అటు ప్యాట్‌ కమిన్స్‌.

ఇటు మహమ్మద్‌ షమీ.. 

అటు మిషెల్‌ స్టార్క్‌.


logo