మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Nov 10, 2020 , 02:10:57

గెలిస్తే చరిత్రే

గెలిస్తే చరిత్రే

  • నేడు ముంబై, ఢిల్లీ మధ్య ఐపీఎల్‌ ఫైనల్‌ 
  • ఐదోసారి టైటిల్‌పై కన్నేసిన రోహిత్‌ సేన.. 
  • మొదటిసారి కప్‌ కోసం కసిగా క్యాపిటల్స్‌  

కరోనా కష్ట కాలంలో ఎన్నో ప్రతికూలతలను దాటుకొని ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ నేటితో ముగియనుంది. 52 రోజులు.. 59 మ్యాచ్‌లు.. 723 సిక్సర్లు.. 656 వికెట్లు.. 5 సెంచరీలు.. 107 హాఫ్‌ సెంచరీలు.. 4 సూపర్‌ ఓవర్‌లతో ప్రేక్షకులను అలరించిన లీగ్‌లో టైటిల్‌ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ క్షణాలకు నేడు తెరపడనుంది. అనేక అవరోధాలను అధిగమించి తొలిసారి ఫైనల్‌ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్‌.. ఇప్పటి వరకు ఆరు సార్లు ఫైనల్‌ చేరిన ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది. ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్‌ నెగ్గిన రోహిత్‌ సేన.. దీపావళి ముందు ‘పాంచ్‌ పటాకా’మోగించాలని చూస్తుంటే.. తారాజువ్వలా దూసుకువస్తున్న ఢిల్లీ ‘లక్ష్మీ బాంబ్‌' పేల్చేందుకు సిద్ధమైంది. మరి ఈ బిగ్‌ఫైట్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!

దుబాయ్‌: కొవిడ్‌-19 కారణంగా స్తంభించిపోయిన క్రీడాలోకాన్ని మస్త్‌ మజాతో నిద్రలేపిన ఐపీఎల్‌ తుది దశకు చేరింది. లీగ్‌ దశలో అలరించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే తుదిపోరుకు అర్హత సాధించాయి. క్వాలిఫయర్‌-1లో సులువైన గెలుపుతో ముంబై నేరుగా తుదిపోరుకు చేరితే.. క్వాలిఫయర్‌లో-2లో హైదరాబాద్‌ను చిత్తు చేసిన ఢిల్లీ తొలిసారి బిగ్‌ఫైట్‌కు సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎదురుపడ్డ మూడుసార్లు ఢిల్లీని చిత్తు కింద కొట్టిన ముంబై నాలుగోసారి కూడా అదే రిపీట్‌ చేయాలని తహతహలాడుతుంటే.. సీన్‌ రివర్స్‌ చేసి తొలిసారి టైటిల్‌ పట్టాలని ఢిల్లీ దృఢనిశ్చయంతో ఉంది. 

వీళ్లే కీలకం..

పుష్కర కాలంగా టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు శిఖర్‌ ధవన్‌, స్టొయినిస్‌, అయ్యర్‌, రబాడ కీలకం కానున్నారు. గత మ్యాచ్‌లో పృథ్వీ షా స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన స్టొయినిస్‌ చక్కటి ఇన్నింగ్స్‌ ఆడటంతో పాటు ప్రత్యర్థి టాపార్డర్‌ వికెట్లు పడగొట్టి జట్టుకు సునాయాస విజయాన్నందించాడు. నిలకడగా రాణిస్తున్న రబాడ అదే జోరు కొనసాగించాలని యాజమాన్యం ఆశిస్తున్నది. 

వీరిపై ఓ కన్నేయండి..

అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్స్‌గా లీగ్‌లో అద్భుతాలు చేస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ ముంబై ఇండియన్స్‌కు ప్రధాన బలం. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ స్థాయికి తగ్గట్లు ఆడకపోయినా.. ఆ జట్టు ఎలాంటి ఇబ్బంది పడలేదంటే ఈ ఇద్దరు యువ ఆటగాళ్లే  కారణం. వీరితో పాటు డికాక్‌, పాం డ్యా బ్రదర్స్‌, పొలార్డ్‌ బ్యాటింగ్‌లో.. బు మ్రా, బౌల్ట్‌ బౌలింగ్‌లో మెరిస్తే ముంబై ఐదోసారి కప్పు కొట్టడం దాదాపు ఖాయమే.

ప్రత్యర్థి జట్టులో మహేంద్రసింగ్‌ ధోనీ లేకుండా ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడటం ముంబై ఇండియన్స్‌కు ఇదే తొలిసారి. 2010, 2013, 2015, 2019 సీజన్‌లలో చెన్నైతో ఫైనల్‌ ఫైట్‌లో తలపడ్డ ముంబై.. 2017లో రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌పై నెగ్గి టైటిల్‌ గెలిచింది. ఈ ఐదుసార్లు ప్రత్యర్థి జట్టులో మహీ ఉన్నాడు.