e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home Top Slides మీరా.. భారత్‌ మహాన్‌

మీరా.. భారత్‌ మహాన్‌

  • టోక్యో ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో వెండి వెలుగులు
  • మణిపూర్‌ మణిపూస సంచలన ప్రదర్శన
  • మల్లీశ్వరి తర్వాత మీరాబాయి అరుదైన ఘనత
  • రెండు దశాబ్దాల నిరీక్షణకు తెర
  • టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయికి రజతం
  • 202 కేజీల బరువెత్తిన మణిపూర్‌ మణిపూస
  • తొలిరోజే భారత్‌ బోణీ

భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయ సందర్భం. విశ్వక్రీడా వేదికపై మువ్వన్నెల జెండా రెపరెపలాడిన సమయం. శతకోటి భారతావని హృదయం గర్వంగా ఉప్పొంగిపోయిన వేళ.. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో మణిపూర్‌ మణిపూస సయ్‌ఖోమ్‌ మీరాబాయి చాను సంచలనం సృష్టించింది. అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఒలింపిక్స్‌లో జయకేతనం ఎగురవేసింది. కొండంత బరువును అవలీలగా తన భుజాలపై మోస్తూ వెండి వెలుగులు విరజిమ్మింది.

మహిళల 49కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో మొత్తంగా 202 కిలోల బరువెత్తి మీరాబాయి చాను రజత పతకాన్ని ముద్దాడింది. స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో బలాన్ని కూడదీసుకుంటూ టోక్యోలో భారత్‌కు తొలి పతకాన్ని అందించి అందరిలో జోష్‌ నింపింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి తర్వాత విశ్వక్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం గెలిచిన రెండో భారతీయురాలిగా అరుదైన ఘనత అందుకున్నది. పసి ప్రాయంలో కట్టెల మోపుతో మొదలైన ప్రస్థానానికి ఒలింపిక్స్‌లో రజతంతో మీరా మెరుగులు అద్దింది. భారత క్రీడాభిమాని రొమ్ము విరిచి చెప్పుకునేలా చేసిన మీరాను..రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ అభినందనలతో ముంచెత్తారు.

- Advertisement -

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే నిరీక్షణలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. విశ్వక్రీడల తొలిరోజే భారత్‌ ఖాతాలో పతకం చేరింది. 130 కోట్ల మంది భారతీయుల ఆశలనే మోయగా లేనిది.. రెండొందల కేజీల బరువెత్తడం ఒక లెక్కా అన్నట్లు.. భారత స్టార్‌ లిఫ్టర్‌, మణిపూర్‌ మణిపూస సైఖోమ్‌ మీరాబాయి చాను రజతం కైవసం చేసుకొని టోక్యో ఒలింపిక్స్‌లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది.

పసిప్రాయం నుంచే బరువెత్తడాన్ని బాధ్యతగా తీసుకున్న మీరా.. కట్టెల మోపులు, నీళ్ల క్యాన్‌లతో ప్రాక్టీస్‌ ప్రారంభించి నేడు విశ్వవేదికపై భారత ఖ్యాతిని పెంచింది. సిడ్నీ (2000) ఒలింపిక్స్‌లో తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరి కాంస్యం సాధించినప్పటి నుంచి లిఫ్టింగ్‌లో పతకం కోసం కొనసాగుతున్న నిరీక్షణకు మీరా తెరదించగా.. హాకీ, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, టెన్నిస్‌లో ముందంజ వేసిన భారత అథ్లెట్లు మరిన్ని పతకాలపై ఆశలు రేపుతున్నారు!

టోక్యో: విశ్వక్రీడల చరిత్రలో మొదటిసారి క్రీడల తొలి రోజే భారత్‌ పతకం పట్టింది. వెయిట్‌ లిఫ్టింగ్‌లో రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. మీరాబాయి చాను రజత పతకం కైవసం చేసుకుంది. ఐదేండ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో మూడు రౌండ్‌లలోనూ నిర్ణీత బరువెత్తలేక కన్నీటితో మ్యాట్‌ను వీడిన చాను.. ఈసారి 202 కేజీలు (స్నాచ్‌లో 87+క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 115) అలవోకగా ఎత్తిపడేసింది. మణిపూర్‌ ఐరన్‌ లేడీగా గుర్తింపు సాధించిన 26 ఏండ్ల సైఖోమ్‌ మీరాబాయి చాను.. సిడ్నీ (2000) ఒలింపిక్స్‌లో తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరి కాంస్యం సాధించిన తర్వాత ఒలింపిక్స్‌లో పతకం నెగ్గిన రెండో భారత మహిళా లిఫ్టర్‌గా రికార్డుల్లోకెక్కింది. చైనాకు చెందిన హో జిహుయి 210 కేజీలతో స్వర్ణం
చేజిక్కించుకోగా.. ఇండోనేషియాకు చెందిన విండీ కాంటికా 194 కేజీలతో కాంస్యం గెలుచుకుంది. ‘గత ఐదేండ్లుగా ఈ క్షణాలకోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్నా. భారత్‌ తరఫున బోణీ కొట్టడం ఆనందంగా ఉంది. నేను కేవలం మణిపూర్‌కు చెందిన దానిని కాదు. భారతావని ముద్దుబిడ్డను’ అని పతకం నెగ్గాక గద్గద స్వరంతో చెప్పిన చాను.. ఈ పతకాన్ని దేశానికి
అంకితమిస్తున్నట్లు పేర్కొని మరో మెట్టు పైకెక్కింది.

రెండో ప్రయత్నంలోనే..

స్నాచ్‌లో తొలి ప్రయత్నంలోనే 84 కేజీల బరువెత్తిన చాను.. రెండో ప్రయత్నంలో బరువును 87 కేజీలకు పెంచిన.. మీరా ఈ సారి కూడా సులువుగానే సఫలీకృతమైంది. మూడో ప్రయత్నంలో 89 కేజీలు ప్రయత్నించిన చాను దాన్ని పూర్తి చేయలేకపోయింది. స్నాచ్‌లో మీరా ఎత్తిన అత్యధిక (88 కేజీలు) బరువు కంటే ఇది ఒక కేజీ ఎక్కువ కావడం గమనార్హం. మరోవైపు చైనా లిఫ్టర్‌ జిహుయి స్నాచ్‌లో 94 కేజీల బరువుతో ఒలింపిక్‌ రికార్డు నెలకొల్పింది. క్లీన్‌ అండ్‌ జెర్క్‌ తొలి ప్రయత్నంలో 110 కేజీల బరువెత్తిన చాను.. రెండో ప్రయత్నంలో 115 కేజీలను అలవోకగా ఎత్తింది. మూడో ప్రయత్నంలో 117 కేజీలను యత్నించినా.. దాన్ని పూర్తి చేయలేక రజత పతకంతో సంతృప్తి చెందింది. మెడల్‌ సాధించినట్లు స్పష్టం కావడంతోనే కోచ్‌ విజయ్‌ శర్మను హత్తుకున్న మీరా.. పోడియంపై పతకం అందుకున్న తర్వాత బాంగ్రా నృత్యం చేస్తూ సందడి చేసింది.

చెవి రింగుల కథ

రియో (2016) ఒలింపిక్స్‌ కోసం మీరాబాయి తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో ఆమె తల్లి సైఖోమ్‌ ఓంగ్బీ టాంబీ లైమా.. చానుకు ఓ అరుదైన బహుమతినిచ్చింది. విశ్వక్రీడల్లో.. కూతురు ఎలాగైనా పతకం పట్టాలనే బలమైన ఆకాంక్ష కలిగిన ఆ తల్లి.. మీరాకు ఒలింపిక్‌ రింగ్‌లను పోలిన చెవి దిద్దులు బహుకరించింది. తన దగ్గర ఉన్న బంగారాన్నంతా అమ్మి, పైసా పైసా కూడబెట్టిన సొమ్ముతో ప్రత్యేకమైన చెవి పోగులను చేయించింది. అయితే రియోలో ఆ తల్లి ఆశ నెరవేరకపోయినా.. టోక్యోలో ఆమె కల సాకారమైంది. ఈ మణిపూర్‌ మణిపూస అద్భుత ప్రదర్శనతో రజతం సాధించి యావత్‌ దేశానికి వెండి కొండలా మారింది.

ఈ పతకాన్ని దేశానికి అంకితం ఇస్తున్నా. ఈ ప్రయాణంలో నా విజయం కోసం ప్రార్థించిన కోట్లాది భారతీయులకు కృతజ్ఞతలు. నా కుటుంబం, ప్రత్యేకించి మా అమ్మ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నా. నన్ను ఇంతలా ప్రోత్సహించిన భారత ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు’

మీరాబాయి చాను

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గి భారత పతకాల పట్టికను ఆరంభించిన వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

విశ్వక్రీడల్లో మీరాబాయి చాను ప్రదర్శనతో యావత్‌ భారతం ఉప్పొంగిపోతున్నది. రజతం సాధించిన చానుకు అభినందనలు.. ఆమె విజయం ప్రతీ భారతీయుడికి స్ఫూర్తిదాయకం. టోక్యో ఒలింపిక్స్‌లో ఇది ఎంతో సంతోషకరమైన సందర్భం.

ప్రధాని నరేంద్ర మోదీ

టోక్యో ఒలింపిక్స్‌ మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను రజత పతకం గెలువడం గొప్ప విషయం. మీరాకు ప్రత్యేక అభినందనలు. మన క్రీడాకారులు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశానికి మరిన్ని పతకాలు సాధించాలి.

-సీఎం కేసీఆర్‌

టోక్యో విశ్వక్రీడల్లో రజత పతకంతో మెరిసిన యువ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయికి అభినందనలు. భారత్‌ నిన్ను చూసి గర్విస్తున్నది.

కేటీర్‌, రాష్ట్ర ఐటీ మంత్రి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana