సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Jul 26, 2020 , 17:56:04

తల్లి మందలించిందని ఒకరు.. సోదరి తిట్టిందని మరొకరు..

తల్లి మందలించిందని ఒకరు.. సోదరి తిట్టిందని మరొకరు..

  • వేర్వేరు ఘటనల్లో ముగ్గురు  యువతులు ఆత్మహత్య

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో శనివారం వేర్వేరు కేసుల్లో ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అజంపూరాలో నివసించే సానియాఖాన్‌(17) ఇంట్లో ఎవరు లేని సమయం చూసి శనివారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం మేరకు చాదర్‌ఘాట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా తల్లి మందలించిందని మరో యువతి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరుకు చెందిన కె.సుందర్‌ లీల(16) తన తల్లిదండ్రులతో కలిసి బోరబండలో నివాసం ఉంటోంది. లీల చదువులపై దృష్టి పెట్టడం లేదని, ఎక్కువగా టీవీ చూస్తుందని, ఫోన్‌ వాడుతుందని ఆమె తల్లి దానమ్మ మందలించడంతో మనస్థాపానికి గురైన లీల శనివారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇకపోతే షాహిన్యాత్‌గంజ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జుమేరాత్‌ బజార్‌కు చెందిన సోనమ్ సాగర్ (29) తన సోదరితో గొడవ పడి వనస్థాపానికి గురై బాత్రూమ్ క్లీన్‌ చేసే యాసిడ్‌ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇల్లు శుభ్రం చేయకుండానే పూజలు చేసినందుకు శుక్రవారం సోనమ్ సోదరి ఆమెను తిట్టింది. దీనిపై ఆవేదనకు గురైన సోనమ్‌ శుక్రవారం రాత్రి బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ తాగిందని పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo