శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Oct 27, 2020 , 00:31:33

చెన్నై నిష్క్రమణ

చెన్నై నిష్క్రమణ

దుబాయ్‌: మూడుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) అధికారికంగా ఈ సీజన్‌ నుంచి నిష్క్రమించింది. గతంలో ఆడిన ప్రతి సీజన్‌లో  ప్లేఆఫ్స్‌/సెమీస్‌ బెర్తు దక్కించుకున్న ధోనీసేన.. ఈసారి అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే నెగ్గిన సీఎస్‌కే.. ఎనిమిది ఓటములు ఎదుర్కొని ఎనిమిది పాయింట్లతో చివరి స్థానంలో కొనసాగుతున్నది. ఆదివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై చక్కటి విజయాన్నందుకున్నా.. ముంబైపై రాజస్థాన్‌ గెలువడంతో చెన్నై అధికారికంగా ప్లేఆఫ్స్‌కు దూరమైంది. 

బెంగళూరుపై గెలుపు తర్వాత ధోనీ మీడియాతో మాట్లాడుతూ ‘మేము ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు లేవు. లెక్కలు వేసుకునే చాన్స్‌ కూడా లేదు. పాయింట్ల పట్టికలో ఎక్కడ ఉన్నామనేది ఆలోచించకుండా మ్యాచ్‌ను ఆస్వాదించడం బెటర్‌. క్రికెట్‌ను ఎంజాయ్‌ చేయకపోతే అది చాలా బాధగా ఉంటుంది. యువ క్రికెటర్లు వచ్చిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకోవడం ముదావహం’ అని అన్నాడు. ఇదిలా ఉంటే లీగ్‌ దశ దగ్గర పడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి మ్యాచ్‌ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో జట్లన్నీ గెలుపు కోసం తుదికంటా పోరాడుతున్నాయి.