బుధవారం 08 జూలై 2020
Sports - May 03, 2020 , 08:48:56

ఆత్మహత్య ఆలోచన మూడుసార్లు వచ్చింది: షమీ

ఆత్మహత్య ఆలోచన మూడుసార్లు వచ్చింది: షమీ

న్యూఢిల్లీ: వ్యక్తిగత, క్రికెట్ కెరీర్​కు సంబంధిన సమస్యలు, మానసిక వేదన కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నానని భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ చెప్పాడు. రోహిత్​శర్మతో  ఇన్​స్టాగ్రామ్​ లైవ్​ ద్వారా మాట్లాడిన షమీ ఈ షాకింగ్ విషయాలను వెల్లడించాడు. 

2018 ప్రారంభంలో తన భార్య హసిన్ జహాన్ మహమ్మద్ షమీపై గృహ హింస కేసు పెట్టింది. అతడి సోదరుడిపై కూడా కేసు నమోదైంది. ఇది జరిగిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో షమీ గాయపడ్డాడు. ఆ సమయంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను, ఒత్తిడిని షమీ ఇప్పుడు వెల్లడించాడు. 

“కుటుంబ సమస్యలు ప్రారంభమయ్యాయి.. అప్పుడే యాక్సిడెంట్ అయింది. ఐపీఎల్​కు మరో 10-12రోజులు ఉందనగా ఆ ప్రమాదం జరిగింది. అలాగే నా వ్యక్తిగత విషయాలు మీడియాలో నడిచాయి. ఒకవేళ నా కుటుంబం మద్దతు లేకపోతే నేను క్రికెట్ కెరీర్​ను కోల్పోతానేమో అని ఆలోచించా. ఆ సమయంలో తీవ్ర వ్యక్తిగత సమస్యల కారణంగా మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన మూడుసార్లు వచ్చింది. మేం 24వ అంతస్తులో ఉండేవాళ్లం. నేను అక్కడి నుంచి దూకేస్తానేమోనని మా కుటుంబ సభ్యులు భయపడేవారు. నా సోదరుడు నాకు చాల మద్దతుగా నిలిచాడు. అలాగే ఇద్దరు, ముగ్గురు స్నేహితులు  24గంటలు నా వెంటే ఉండేవారు. ఆ బాధ నుంచి బయటపడి క్రికెట్పై దృష్టిసారించాలని నాకు తల్లిదండ్రులు చెప్పేవారు. అప్పుడు ట్రైనింగ్ ప్రారంభించా.. దెహ్రాదూన్ అకాడమీలో చాలా శ్రమించా” అని షమీ వెల్లడించాడు. అలాగే 2015 ప్రపంచకప్ తర్వాత గాయం నుంచి కోలుకునేందుకు 18నెలల సమయం పట్టడంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యానని, అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నాడు. తన కుటుంబం మద్దతుగా నిలువకపోయి ఉంటే ఆత్యహత్య చేసుకొని ఉండేవాడినేమోనని మహమ్మద్ షమీ చెప్పాడు. logo