న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లాంటి మెగా ఈవెంట్లో మెడల్ గెలవడం ఎన్ని కోట్ల మందిలో స్ఫూర్తి నింపుతుందో చెప్పేందుకు అద్దం పట్టే వీడియో ఇది. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తొలి మెడల్ సాధించి పెట్టిన సంగతి తెలుసు కదా. టీవీలో ఆమె సాధించిన ఆ ఘనత చూసి ఓ చిన్నారి తెగ మురిసిపోయింది. అంతేకాదు అచ్చూ ఆ మీరాబాయిలాగే టీవీ ముందు నిల్చొని బరువులెత్తింది. ఆ తర్వాత మెడల్‌ను మెడలో వేసుకొని సంబరపడిపోయింది.
దీనికి సంబంధించిన వీడియోను వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ సతీష్ శివలింగం ట్విటర్లో షేర్ చేశాడు. ఆ వీడియోలో కనిపిస్తున్న ఆ పాప కూడా అతని కూతురే అని భావిస్తున్నారు. ఇప్పుడీ చిన్నారి చాను వీడియో సోషల్ మీడియాలో తెగ్ హల్చల్ చేస్తోంది. చివరికి మెడల్ విన్నర్ మీరాబాయి ( Merabai chanu ) కూడా ఈ వీడియో చూసి మురిసిపోయింది. చాలా క్యూట్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది అంటూ ఆమె కామెంట్ చేసింది. ఆ చిన్నారికి ప్రేరణగా నిలిచిన మీరాబాయిని, ఆమెను చూసి స్ఫూర్తి పొందిన చిన్నారిని ప్రశంసిస్తూ.. ఎంతోమంది నెటిజన్లు కామెంట్స్ చేశారు.