శనివారం 04 జూలై 2020
Sports - May 14, 2020 , 17:25:01

టీ20ల్లో `డ‌బుల్‌` సెంచ‌రీల‌కు నాలుగేండ్లు

టీ20ల్లో `డ‌బుల్‌` సెంచ‌రీల‌కు నాలుగేండ్లు

న్యూఢిల్లీ: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2016వ సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సార‌థి విరాట్ కోహ్లీ దూకుడు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత‌డిప్ప‌టి వ‌ర‌కు నాలుగు శ‌త‌కాలు బాదితే.. ఆ నాలుగు కూడా 2016వ సీజ‌న్‌లోనే కొట్టాడంటే ఆ సీజ‌న్‌లో అత‌డి దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవ‌చ్చు. స‌రిగ్గా నాలుగేండ్ల క్రితం ఇదే రోజు త‌న ప్రియ‌మైన స‌హ‌చ‌రుడు ఏబీ డివిలియ‌ర్స్‌తో క‌లిసి కోహ్లీ.. గుజ‌రాత్ ల‌య‌న్స్ బౌలింగ్‌ను ఊచ‌కోత కోశాడు. 

బౌండ్రీలే ల‌క్ష్యంగా దుమ్మురేపిన ఈ జోడీ సెంచ‌రీల‌తో అద‌ర‌గొట్టింది. విరాట్ 55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స‌ర్ల‌తో 109 ప‌రుగులు చేస్తే.. ఏబీ డివీలియ‌ర్స్ ఐపీఎల్లోనే త‌న అత్య‌ధిక స్కోరు న‌మోదు చేసుకున్నాడు. 52 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స‌ర్ల‌తో 129 ప‌రుగులు రాబ‌ట్టాడు. వీరిద్ద‌రు రెండో వికెట్‌కు 229 ప‌రుగులు జోడించ‌డం విశేషం. వీరి దూకుడుతో మొద‌ట బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 248 ప‌రుగులు చేసింది. అనంత‌రం భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌లో ముందే చేతులెత్తేసిన గుజ‌రాత్ ల‌య‌న్స్ చివ‌ర‌కు 18.4 ఓవ‌ర్ల‌లో 104 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ప్ర‌తి ఏడాది ఒక మ్యాచ్‌లో ఆకుప‌చ్చ రంగు దుస్తూల‌తో బ‌రిలో దిగే బెంగ‌ళూరు జ‌ట్టు ఆ రోజు మ్యాచ్‌లో అలాగే గ్రీన్ డ్రెస్‌లు ధ‌రించి దంచికొట్టింది. తాజాగా క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కోసం విరాళాలు సేక‌రించేందుకు ఏబీ, కోహ్లీ.. ఆ మ్యాచ్‌లో వాడిన జెర్సీల‌ను వేలం వేసిన విష‌యం తెలిసిందే.


logo