శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Sep 13, 2020 , 00:36:30

ఫైనల్‌లో థీమ్‌ x జ్వెరెవ్‌

ఫైనల్‌లో థీమ్‌ x జ్వెరెవ్‌

  • సెమీస్‌లో మెద్వెదెవ్‌, బుస్టా ఓటమి 

 కరోనా వైరస్‌ ఆగమనం తర్వాత జరుగుతున్న తొలి గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ తుది అంకానికి చేరుకుంది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో ఆస్ట్రియా స్టార్‌ డొమినిక్‌ థీమ్‌, జర్మనీ ఆటగాడు జ్వెరెవ్‌ తలపడనున్నారు. సెమీస్‌లో తొలుత రెండు సెట్లు కోల్పోయినా  అద్భుతంగా పుంజుకొని జ్వెరెవ్‌  తుదిపోరులో అడుగుపెడితే.. మెద్వెదెవ్‌ను వరుస సెట్లలో ఓడించిన థీమ్‌ టైటిల్‌ పోరుకు చేరాడు. ఇద్దరిలో ఫైనల్‌ ఎవరు గెలిచినా వారికి ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కానుంది. 

న్యూయార్క్‌: తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ముద్దాడాలన్న కసితో ఉన్న యువ ఆటగాళ్లు డొమినిక్‌ థీమ్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ పోరులో అడుగుపెట్టారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌లో రెండో సీడ్‌ థీమ్‌ 6-2, 7-6(9/7), 7-6(7/5) తేడాతో మూడో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌(రష్యా)పై వరుస సెట్లలో గెలిచాడు. 2గంటల 55నిమిషాలు సాగిన మ్యాచ్‌ తొలి సెట్‌లో సునాయాసంగా గెలిచిన థీమ్‌.. ఆ తర్వాతి రెండు ట్రై బ్రేకర్లలో సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన చివరి రెండు సెట్లలో తొలుత ముందంజ వేసిన మెద్వెదెవ్‌ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. రెండో సెట్‌లో డానిల్‌ ఓ దశలో 4-2తో పైచేయి సాధించినా ఆ తర్వాత చతికిలపడ్డాడు. దీంతో ట్రైబ్రేకర్‌కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడా ఓ దశలో 6-5తో మెద్వెదెవ్‌  ముందు నిలిచినా చివరికి సెట్‌ను థీమ్‌ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లోనూ ఇలానే సాగింది. ఓ దశలో మెద్వెదెవ్‌ 5-3తో ముందంజలో ఉండి సెట్‌ను కైవసం చేసుకునేందుకు దగ్గరలో వచ్చాడు. అయితే ఆ సమయంలో పుంజుకున్న థీమ్‌ మ్యాచ్‌ను తనవైపునకు తిప్పుకున్నాడు. ట్రైబ్రేకర్‌లోనూ రెచ్చిపోయిన థీమ్‌.. మెద్వెదెవ్‌ను మట్టికరిపించి యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరిన తొలి ఆస్ట్రియన్‌గా నిలిచాడు. మ్యాచ్‌లో థీమ్‌ రెండు ఏస్‌లు బాదగా.. మెద్వెదెవ్‌ డజను సాధించాడు. ఓ దశలో అంపైర్‌ ఇచ్చిన నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మెద్వెదెవ్‌ లైన్‌ వద్దకు వెళ్లి మార్క్‌ను పరిశీలించి నిబంధనలను ఉల్లంఘించడం వివాదాస్పదమైంది. 

రెండు సెట్లు కోల్పోయినా జ్వెరెవ్‌ గెలుపు 

జర్మనీ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ అద్భుత పోరాట పటిమ ప్రదర్శించాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినా ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడి అంతిమంగా విజయం సాధించాడు. సెమీస్‌లో ఐదో సీడ్‌ జ్వెరెవ్‌ 3-6, 2-6, 6-3, 6-4, 6-3తేడాతో పాబ్లో కరెనో బుస్టా(స్పెయిన్‌)పై గెలిచాడు. మ్యాచ్‌లో  గంటా 25 నిమిషాల పాటు వెనుకంజలో ఉండి రెండు సెట్లు కోల్పోయాక జ్వెరెవ్‌ అద్భుతంగా పోరాడాడు. బలమైన సర్వ్‌లు, నిలకడైన ఆటతో సునాయాసంగా మూడు సెట్లు గెలిచి.. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌లో అడుగుపెట్టాడు. 2011లో జొకోవిచ్‌ తర్వాత సెమీస్‌లో రెండు సెట్లు కోల్పోయినా మ్యాచ్‌ గెలిచిన తొలి ఆటగాడిగా జ్వెరెవ్‌ నిలిచాడు. కాగా బిగ్‌ త్రీ ప్లేయర్లు రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌, నొవాక్‌ జొకోవిచ్‌ లేకుండా యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ జరుగడం 16ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. కరోనా ఆందోళనతో ఫెదరర్‌, నాదల్‌ ఈ టోర్నీకి దూరంగా ఉండగా.. ప్రిక్వార్టర్స్‌లో లైన్‌ అంపైర్‌కు బంతిని కొట్టడంతో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ అనర్హతకు గురయ్యాడు. 

  1. అన్‌సీడెడ్‌ ద్వయానికి డబుల్స్‌ టైటిల్‌   యూఎస్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌  టైటిల్‌ను అన్‌సీడెడ్‌ ద్వయం వెరా  జ్వొనెవెర(రష్యా), లారా సిగెమండ్‌(జర్మనీ) కైవసం చేసుకుంది. తుదిపోరులో వెరా, లారా జోడీ 6-4, 6-4తేడాతో ఝు ఇఫాన్‌, నికోల్‌ ద్వయంపై అలవోక విజయం సాధించింది. 

16. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేసిన తొలి ఆస్ట్రియా ఆటగాడు థీమ్‌. గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరడం జ్వెరెవ్‌కు ఇదే మొదటిసారి. ఫెదరర్‌, జొకోవిచ్‌, నాదల్‌ లేకుండా 16 ఏండ్ల తర్వాత తొలిసారి యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ జరుగనున్నది. 


logo