శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 01, 2020 , 01:51:06

ఫైనల్లో థీమ్‌

ఫైనల్లో థీమ్‌

ఆస్ట్రియా స్టార్‌ డొమెనిక్‌ థీమ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తుదిపోరుకు దూసుకెళ్లాడు. ప్రపంచ నంబర్‌ వన్‌ నాదల్‌ను క్వార్టర్స్‌లో ఓడించిన దూకుడునే సెమీస్‌లోనూ ప్రదర్శించి ఏడో జ్వెరెవ్‌ను థీమ్‌ ఓడించాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిలే లక్ష్యంగా ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌తో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో నేడు సోఫియా కెనిన్‌ - ముగురుజ తలపడనున్నారు.

  • సెమీస్‌లో జ్వెరెవ్‌పై గెలుపు.. జొకోవిచ్‌తో తుదిపోరు
  • నేడు మహిళల సింగిల్స్‌ ఫైనల్‌

మెల్‌బోర్న్‌: తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ వేటలో సంచలన ప్రదర్శనలతో అదరగొట్టిన ఆస్ట్రియా ఆటగాడు డొమెనిక్‌ థీమ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు నాదల్‌ను మట్టికరిపించిన ఈ ఐదో సీడ్‌ ఆటగాడు.. సెమీఫైనల్లోనూ అదే జోరుకొనసాగించి టైబ్రేకర్‌ కింగ్‌ అనిపించుకున్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో థీమ్‌ 3-6,6-4, 7-6(7/3), 7-6(7/4)తేడాతో ఏడో సీడ్‌ అలెగ్జాంజర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై విజయం సాధించి, టైటిల్‌ పోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌తో పోటీకి సిద్ధమయ్యాడు. తొలిసెట్‌లో థీమ్‌ సర్వీస్‌లు మూడుసార్లు బ్రేక్‌ చేసిన జ్వెరెవ్‌ జోరు కనబరిచి కైవసం చేసుకున్నాడు. రెండో సెట్లో థీమ్‌ పుంజుకున్నాడు. బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో చివరి వరకు జోరు కొనసాగించి సెట్‌ను 6-4తో సొంతం చేసుకున్నాడు. తర్వాతి సెట్‌లో ఇరువురు ప్లేయర్లు హోరాహోరీగా తలపడడంతో సుదీర్ఘ ర్యాలీలు సాగాయి. చివరికి 6-6తో సమమైంది. తనకు అచ్చొచ్చిన టైబ్రేకర్‌ కావడంతో థీమ్‌ మరోసారి రెచ్చిపోయాడు. ఓ దశలో 3-0తో ముందంజ వేయడం సహా చివరికి 7-3తో ముగించి సెట్‌ను దక్కించుకున్నాడు. నాలుగో సెట్లో ఇరువురు ప్లేయర్లు సర్వీస్‌లను కాపాడుకునేందుకు శ్రమించారు. దీంతో ఫలితం టైబ్రేకర్‌కు వెళ్లింది. ఈసారి కూడా 3-0తో దూకుడు కనబరిచిన డొమెనిక్‌ థీమ్‌ ఎట్టకేలకు సెట్‌ను కైవసం చేసుకొని టైటిల్‌ పోరులో రెండో సీడ్‌ జొకోవిచ్‌తో థీమ్‌ ఆదివారం టైటిల్‌ కోసం తలపడనున్నాడు.  కాగా, మహిళల డబుల్స్‌ టైటిల్‌ను వరుసగా రెండోసారి క్రిస్టియానా మ్లాదనోవిక్‌(ఫ్రాన్స్‌) - టిమియ బాబోస్‌(హంగేరీ) జోడీ దక్కించుకుంది. 

టైటిల్‌ పట్టేదెవరో..

టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అమెరికా యువ స్టార్‌ సోఫియా కెనిన్‌, మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌, అన్‌సీడెడ్‌ గార్బిన్‌ ముగురుజ(స్పెయిన్‌) సంచలన విజయాలతో మహిళ సింగిల్స్‌ తుదిపోరుకు చేరారు. టైటిల్‌ కోసం శనివారం పరస్పరం తలపడనున్నారు. సెమీస్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకర్‌ ఆష్లే బార్టీని ఓడించి, తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫైనల్‌ చేరిన 14వ సీడ్‌ సోఫియా మంచి జోరుమీదుంది.   మరోవైపు వింబుల్డన్‌ మాజీ విజేత ముగురుజ తన పూర్వవైభవాన్ని  తిరిగి తెచ్చుకోవాలని భావిస్తున్నది. సెమీస్‌లో నాలుగో సీడ్‌ హలెప్‌కు షాకిచ్చిన ముగురుజ సైతం జోరుమీదుంది.  ఈ ఇద్దరిలో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను ముద్దాడేదెవరో చూడాలి.  

నేడు మహిళల సింగిల్స్‌ ఫైనల్స్‌ 

కెనిన్‌ x ముగురుజ 

మధ్యాహ్నం 2గంటల నుంచి సోనీ సిక్స్‌లో..


logo