2020లో వాయిదా పడిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇవే? వీటివల్ల ఎంత నష్టం జరిగిందంటే..?

2020 కోసం చాలా మంది స్పోర్ట్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ ఏడాది కొన్ని మెగా టోర్నీలు జరగనుండటంతో తమకు పండగే అని అనుకున్నారు. అయితే కరోనా వాళ్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ మహమ్మారి వల్ల నిర్వాహకులు ఈవెంట్లను రద్దు చేయడం లేదా వాయిదా వేయడం చేయాల్సి వచ్చింది. దీని వల్ల ఆయా ఈవెంట్ల నిర్వాహకులు భారీ నష్టాలను కూడా చవి చూడాల్సి వచ్చింది. ఇంకొన్ని ఈవెంట్లను అభిమానులు లేకుండా బయో బబుల్‌లో నిర్వహించాల్సి వచ్చింది. మరి 2020లో కరోనా వల్ల వాయిదా పడిన ఆ స్పోర్టింగ్ ఈవెంట్స్ ఏవో ఒకసారి చూద్దాం.
టోక్యో ఒలింపిక్స్
2020లో కరోనా వల్ల వాయిదా పడ్డ అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్.. టోక్యో ఒలింపిక్స్. ఈ ఏడాది జులై 24 నుంచి ఆగస్ట్ 9 వరకూ జరగాల్సిన ఈ గేమ్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. గేమ్స్ నిర్వహించాలా వద్దా అన్నదానిపై తర్జనభర్జన పడ్డ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఈ ఏడాది మార్చి 24న ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. 124 ఏళ్ల ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో గేమ్స్ ఇలా వాయిదా పడటం ఇదే తొలిసారి. ఇప్పుడీ ఈవెంట్ వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్ట్ 8 వరకూ జరగనున్నట్లు కమిటీ ప్రకటించింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి వచ్చే ఏడాది కూడా ఈ టోర్నీ నిర్వహించడం అనుమానమే అని ఈ మధ్యే నిర్వహించిన ఓ పోల్‌లో మెజార్టీ అభిమానులు అభిప్రాయపడ్డారు.
నష్టం ఎంత?
గేమ్స్ వాయిదా పడటం అనేది జపాన్‌కు పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఈ గేమ్స్ నిర్వహణ కోసం ఆ దేశం ఇప్పటికే 1200 కోట్ల డాలర్లకుపైగా ఖర్చు చేసింది. అంతేకాకుండా స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్లు కూడా ఈ గేమ్స్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ జరగనందు వల్ల జపాన్ మొత్తంగా 450 కోట్ల డాలర్లు నష్టపోనున్నట్లు గోల్డ్‌మ్యాన్ సచ్స్ అంచనా వేసింది.
క్రికెట్: టీ20 వరల్డ్‌కప్
2020లో కరోనా వల్ల వాయిదా పడిన మరో మెగా టోర్నీ టీ20 వరల్డ్‌కప్. ఈ టోర్నీ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో జరగాల్సింది. ఈ టోర్నీని కోల్పోయిన కారణంగా ఆస్ట్రేలియాకు 2022లో టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం ఇచ్చారు. 2021లో ఇండియా ఈ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ ఈ టోర్నీ జరగనుంది. 2020లో వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయిన 16 టీమ్స్ 2022లో పాల్గొంటాయి.
నష్టం ఎంత?
టీ20 వరల్డ్‌కప్ వాయిదా పడటం వల్ల క్రికెట్ ఆస్ట్రేలియాకు భారీ నష్టం వాటిల్లింది. ఈ మొత్తం 8 కోట్ల ఆస్ట్రేలియా డాలర్లుగా ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
యూరో 2020 ఫుట్‌బాల్
ఫుట్‌బాల్‌లో వరల్డ్‌కప్ తర్వాత ఆ స్థాయి పాపులారిటీ ఉన్న టోర్నీ యూరో కప్. 24 టీమ్స్ పాల్గొనే ఈ మెగా టోర్నీ ఈ ఏడాది జూన్ 12 నుంచి జులై 12 వరకు జరగాల్సింది. కానీ కరోనా వల్ల వచ్చే ఏడాదికి టోర్నీని వాయిదా వేశారు. 2021లో జూన్ 11 నుంచి జులై 11 వరకూ నిర్వహిస్తామని యూఈఎఫ్ఏ ప్రకటించింది.
నష్టం ఎంత?
యూరో కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయడం వల్ల యూఈఎఫ్ఏకు 30 కోట్ల యూరోల (సుమారు రూ.2700 కోట్లు) నష్టం వాటిల్లిందని అంచనా. ఒకవేళ టోర్నీ మొత్తాన్ని రద్దు చేసి ఉంటే.. ఈ నష్టం 40 కోట్ల యూరోలుగా ఉండేది.
కోపా అమెరికా ఫుట్‌బాల్
యూరోకప్లాగే కోపా అమెరికా టోర్నీకి కూడా చాలా పాపులారిటీ ఉంది. అయితే కరోనా వల్ల ఈ ఏడాది జరగాల్సిన ఈ టోర్నీని కూడా వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. 12 టీమ్స్ పాల్గొనే ఈ టోర్నీ జూన్ 12 నుంచి జులై 12 వరకు జరగాల్సింది.
టెన్నిస్: వింబుల్డన్
టెన్నిస్‌లో ప్రతి ఏటా జరిగే నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వింబుల్డన్ కూడా ఒకటి. అయితే ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా వింబుల్డన్‌ను ఏకంగా రద్దు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1నే ఆల్ ఇంగ్లండ్ క్లబ్ దీనికి సంబంధించిన ప్రకటన చేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వింబుల్డన్ రద్దు కావడం ఇదే తొలిసారి.
నష్టం ఎంత?
వింబుల్డన్ టోర్నీని రద్దు చేయడం వల్ల ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌కు భారీ నష్టం వాటిల్లుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించిన క్లబ్.. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది. దీనివల్ల టోర్నీ నిర్వాహకులు టికెట్ హోల్డర్లకు, బ్రాడ్కాస్ట్ పార్ట్నర్లకు, స్పాన్సర్లకు 20 కోట్ల పౌండ్ల వరకూ రీఫండ్ ఇవ్వగలిగింది.
బ్యాడ్మింటన్
కరోనా వల్ల బ్యాడ్మింటన్‌లో చాలా టోర్నీలే రద్దయ్యాయి. వీటిలో ప్రధానంగా స్విస్ ఓపెన్, ఇండియా ఓపెన్, ఆర్లియన్స్ మాస్టర్స్, మలేషియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, జర్మన్ ఓపెన్, చైనా మాస్టర్స్ టోర్నీలు రద్దయ్యాయి. ఇక 2020 థామస్, ఉబెర్ కప్‌ను వాయిదా వేశారు.
ఫార్ములా వన్
2020లో ఫార్ములా వన్ కూడా మహమ్మారి వల్ల బాగానే నష్టపోయింది. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి, మొనాకో గ్రాండ్ ప్రి, ఫ్రెండ్ గ్రాండ్‌ప్రి రద్దయ్యాయి. ఇక అజర్బైజాన్, బహ్రెయిన్, కెనడియన్, డచ్, స్పానిష్, వియత్నమీస్ గ్రాండ్ ప్రిలు వాయిదా పడ్డాయి.
తాజావార్తలు
- టీమిండియాకు షాక్.. మళ్లీ క్వారంటైన్
- కేబీఆర్ పార్క్ వద్ద యువతి హల్చల్
- బైడెన్, కమలా హారిస్‌లకు బీటౌన్ సెలబ్రిటీల శుభాకాంక్షలు
- హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం
- ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులకు రెండో దశలో టీకా !
- పాయల్ రాజ్‌పుత్.. ఈ ముద్దుల కహానీ ఏంటి?
- ఎత్తు పెరిగేందుకు సర్జరీ.. ఖర్చు ఎంతో తెలుసా?
- అల్లు అర్జున్ కారును ఆపిన గిరిజనులు..!
- ఐపీఎల్ టీమ్స్.. ఎవరు ఉన్నారు? ఎవరిని వదిలేశారు?
- సోనుసూద్ కేసులో నేడు బాంబే హైకోర్టు తీర్పు