మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sports - Sep 15, 2020 , 00:45:52

‘సూపర్‌' థీమ్‌

‘సూపర్‌' థీమ్‌

టెన్నిస్‌లో కొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. దిగ్గజాల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు అదరగొట్టారు. కరోనా వైరస్‌ నిబంధనల మధ్య జరిగిన తొలి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌లో ఆస్ట్రియా స్టార్‌ డొమినిక్‌ థీమ్‌ నయా చాంపియన్‌గా అవతరించాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన తుది సమరంలో డొమినిక్‌ను  విజయం వరించింది. తొలి రెండు సెట్లు కోల్పోయినా..పుంజుకొని పోటీలోకొచ్చిన థీమ్‌..జ్వెరెవ్‌ ఆశలపై నీళ్లు చల్లుతూ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ముద్దాడాడు. ఐదుసెట్లు  పోరాడి టైబ్రేకర్‌లో సత్తాచాటిన ఈ ఆస్ట్రియా స్టార్‌  సూపర్‌ అనిపించుకున్నాడు. 

న్యూయార్క్‌:  ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్‌ థీమ్‌ ఎట్టకేలకు తన గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కలను సాకారం చేసుకున్నాడు. యూఎస్‌ ఓపెన్‌ నయా చాంపియన్‌గా నిలిచాడు. కరోనా వైరస్‌ వల్ల ప్రేక్షకులు లేకుండా ఇక్కడి ఆర్థర్‌ ఆష్‌ స్టేడియంలో జరిగిన యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో తన స్నేహితుడు, ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌(జర్మనీ)పై అసాధారణమైన పోరాటపటిమ కనబరిచి విజయం సాధించాడు. టైటిల్‌  పోరు లో రెండో సీడ్‌ థీమ్‌ 2-6, 4-6, 6-4, 6-3, 7-6(8/6) తేడాతో జ్వెరెవ్‌పై గెలిచాడు. నాలుగు గంటల పాటు మ్యాచ్‌ సాగగా అనేక మలుపులు తిరిగి.. చివరికి టై బ్రేకర్‌తో ముగిసింది. 

జ్వెరెవ్‌ దూకుడు 

తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ టైటిల్‌ పోరులో శుభారంభం చేశాడు. థీమ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగాడు. దూకుడైన ఆటతో తొలి సెట్‌ను 6-2తో సొంతం చేసుకున్న అతడు రెండో సెట్‌లోనూ జోరు కొనసాగించి టైటిల్‌కు చేరువయ్యాడు. ఆ తర్వాత కథ మొత్తం మారిపోయింది. 

మలుపు తిగింది అక్కడే.. 

మూడో సెట్‌లో థీమ్‌ అద్భుతంగా పుంజుకుంటే.. ఒత్తిడికి గురైన జ్వెరెవ్‌ డబుల్‌ ఫాల్ట్‌లతో తడబడ్డాడు. మూడో సెట్‌ ప్రారంభంలోనే జ్వెరెవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 2-3 ఆధిక్యంలోకి వెళ్లిన థీమ్‌ చివరి వరకు అదే జోరును కొనసాగించి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్‌టోలోనూ డొమినిక్‌ దూకుడు కొనసాగించాడు. 

హోరాహోరీగా టై బ్రేకర్‌ 

నిర్ణయాత్మక ఐదో సెట్‌లోనూ థీమ్‌, జ్వెరెవ్‌ నువ్వానేనా అన్నట్టు పోరాడారు. దీంతో  ఫలితం టై బ్రేకర్‌లోనే తేల్చుకోవాల్సి వచ్చింది. అక్కడా ఇద్దరు హోరాహోరీగా ఆడడంతో పాయింట్లు 6-6తో సమమయ్యాయి. చివరికి జ్వెరెవ్‌ బ్యాక్‌హ్యాండ్‌ తప్పిదంతో ఔట్‌ బాదడంతో 8-6తో థీమ్‌ టైబ్రేకర్‌ దక్కించుకొని.. తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన ఆనందంలో సంబురాలు చేసుకున్నాడు.ఆ తర్వాత నెట్‌ దగ్గరికి వెళ్లి తనకు క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిన జ్వెరెవ్‌ను ఆలింగనం చేసుకున్నాడు. మ్యాచ్‌లో థీమ్‌ ఎనిమిది ఏస్‌లు, 8 డబుల్‌ ఫాల్ట్‌లు చేయగా, జ్వెరెవ్‌ 15 ఏస్‌లు అన్నే డబుల్‌ ఫాల్ట్‌లు బాది మూల్యం చెల్లించుకున్నాడు. కాగా కరోనా వైరస్‌ ఆం దోళన కారణంగా స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌, సెర్బియా స్టార్‌ రఫేల్‌ నాదల్‌ యూఎస్‌ ఓపెన్‌కు దూరం కాగా.. ప్రిక్వార్టర్స్‌లో బంతిని లైన్‌ అంపైర్‌కు కొట్టి టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ అనర్హతకు గురైన సంగతి తెలిసిందే. 

గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సాధించేందుకు అతి సమీపంలో వెళ్లా. కానీ కొది ్దపాయింట్లు, కొన్ని గేమ్‌ల దూరంలో ఆగిపోయా. నాకు ఇప్పుడు 23ఏండ్లు. ఇది చివరి అవకాశం అని నేను అనుకోవడం లేదు. గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్‌గా నిలుస్తాననే నమ్మకం నాకుంది. రెండు సెట్లు గెలిచి, టైబ్రేకర్‌లో ఓ దశలో ముందు నిలిచిన తర్వాత కూడా ఓడిపోవడాన్ని జీర్ణించుకోవడం కాస్త కష్టమే. - జ్వెరెవ్‌ భావోద్వేగ ప్రసంగం

నా జీవిత లక్ష్యాన్ని అందుకున్నా. గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించడానికే నా జీవితాన్ని అంకితం చేశా. చిన్నప్పటి నుంచి ఇదే కలకన్నా. మొత్తానికి సొంతం చేసుకున్నా. అయితే ఈ రోజు మేమిద్దరం విజేతలుగా నిలువాలని కోరుకున్నా. ఎందుకంటే ఈ టైటిల్‌ పొందేందుకు ఇద్దరం అర్హులమే. - డొమినిక్‌ థీమ్‌  

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ల్లోఫైనల్‌కు చేరడం థీమ్‌కు ఇది నాలుగోసారి. గతంలో రెండు సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌(నాదల్‌పై),  ఓసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌(జొకోవిచ్‌పై)లో అతడు ఓడిపోయాడు. 

థీమ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కాగా యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన మొదటి ఆస్ట్రియన్‌ కూడా అతడే. 

1990ల్లో పుట్టి.. గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించిన తొలి ఆటగాడిగా థీమ్‌ చరిత్రకెక్కాడు.  


logo