సోమవారం 03 ఆగస్టు 2020
Sports - Jul 11, 2020 , 02:15:22

వెస్టిండీస్‌దే పైచేయి

వెస్టిండీస్‌దే పైచేయి

  • తొలి ఇన్నింగ్స్‌ 318 ఆలౌట్‌
  • బ్రాత్‌వైట్‌, డౌరిచ్‌ అర్ధశతకాలు
  • ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 15/0

విండీస్‌ పేసర్లు విజృంభించిన చోట ఇంగ్లండ్‌ బౌలర్లు చేష్టలుడిగి        పోయారు. తలా కొన్ని పరుగులతో తొలుత స్కోరు సమం చేసిన        వెస్టిండీస్‌.. ఆ తర్వాత ఒక్కో పరుగూ జోడిస్తూ.. కీలక ఆధిక్యాన్ని  మూటగట్టుకుంది. స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కరీబియన్లను నిలువరించలేక ఆపసోపాలు పడ్డ ఆతిథ్య పేసర్లు.. చేజేతులా వంద పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్నారు. ఇక నాలుగో రోజు  కరీబియన్‌ పేసర్ల బుల్లెట్లను ఎదుర్కొంటూ.. ఇంగ్లిష్‌ జట్టు ఏ మాత్రం లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి! సౌతాంప్టన్‌: ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లు.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉన్న ఇంగ్లండ్‌ జట్టు.. వెస్టిండీస్‌ సమిష్టి పోరాటం ముందు నిలువలేకపోయింది. రోజ్‌బౌల్‌ లాంటి స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కరీబియన్లను కట్టడి చేయడంలో ఇంగ్లిష్‌ బౌలర్లు విఫలమయ్యారు. దీంతో హోల్డర్‌ సేన తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు పరిమితమైన విషయం తెలిసిందే. ఫలితంగా వెస్టిండీస్‌ 114 పరుగుల కీలక ఆధిక్యాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్‌ క్రిగ్‌ బ్రాత్‌వైట్‌ (65; 6 ఫోర్లు), డౌరిచ్‌ (61; 8 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో కదంతొక్కగా.. చేజ్‌ (47; 6 ఫోర్లు), బ్రూక్స్‌ (39; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆతిధ్య బౌలర్లలో స్టోక్స్‌ 4, అండర్సన్‌ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 114 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ జట్టు.. శుక్రవారం ఆట నిలిచే సమయానికి 10 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా 15 పరుగులు చేసింది.  

బ్రాత్‌వైట్‌, డౌరిచ్‌ పోరాటం

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 57/1తో మూడోరోజు ఆట కొనసాగించిన విండీస్‌ నింపాదిగా ముందుకు సాగింది. బౌలర్లకు సహకారం లభిస్తున్న చోట బ్రాత్‌వైట్‌, హోప్‌ (16) గొప్ప సంయమనం చూపారు. రెండో వికెట్‌కు ఈ జోడీ 59 పరుగులు జతచేసింది. ఆ తర్వాత వీరిద్దరూ ఔటైనా.. బ్రూక్స్‌, చేజ్‌ చక్కటి షాట్లతో స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో చేజ్‌.. ఇంగ్లిష్‌ బౌలర్లను బాగా విసిగించాడు. అతడికి డౌరిచ్‌ కూడా తోడు కావడంతో ఇంగ్లండ్‌ కష్టాలు అధికమయ్యాయి. 51 పరుగుల తేడాతో చివరి ఐదు వికెట్లు కోల్పోయి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.logo