ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Jul 27, 2020 , 15:59:15

బీసీసీఐ పద్ధతి మార్చుకోవాలి: యువరాజ్​

బీసీసీఐ పద్ధతి మార్చుకోవాలి: యువరాజ్​

న్యూఢిల్లీ: కెరీర్ చరమాంకంలో బీసీసీఐ తన పట్ల అనుచితంగా ప్రవర్తించిందని టీమ్​ఇండియా మాజీ స్టార్ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. అలాగే సుదీర్ఘంగా భారత జట్టుకు సేవలు అందించిన వీరేంద్ర సెహ్వాగ్​, హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్​, వీవీఎస్ లక్ష్మణ్ లాంటి వారికి కూడా గౌరవప్రదమైన వీడ్కోలు పలకలేదని సోమవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పటి నుంచైనా గొప్ప ఆటగాళ్లకు గౌరవమివ్వాలని యువీ సూచించాడు.

“నేను దిగ్గజాన్ని అనుకోవడం లేదు. నేను ఎంతో సుదీర్ఘంగా ఆడా.. కానీ టెస్టు క్రికెట్ ఎక్కువగా ఆడలేదు. కొందరు దిగ్గజ ప్లేయర్లు టెస్టు క్రికెట్​లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. వారికి వీడ్కోలు ఎలా పలకాలన్న విషయాన్ని బీసీసీఐ నిర్ణయించాలి. కెరీర్ చివర్లో బీసీసీఐ నా పట్ల అనుచితంగా ప్రవర్తించింది. అలాగే హర్భజన్​ సింగ్, సెహ్వాగ్​, జహీర్ ఖాన్​ లాంటి గొప్ప ఆటగాళ్లను చూస్తే.. వారికి కూడా గౌరవప్రదమైన వీడ్కోలు లభించలేదు. ఇది భారత క్రికెట్​లో భాగమైపోయిది. ఇంతకు ముందు ఇలాంటివి చూశా. అయితే భారత జట్టు తరఫున సుదీర్ఘంగా ఆడిన వాళ్లను భవిష్యత్తులోనైనా కచ్చితంగా గౌరవించాలి. భారత్​కు రెండు ప్రపంచకప్​లను అందించిన గౌతమ్ గంభీర్​ లాంటి వారికి తగిన గౌరవం ఇవ్వాలి. అలాగే సునీల్ గవాస్కర్ తర్వాత అలాంటి మ్యాచ్ విన్నర్​ అయిన సెహ్వాగ్​తో పాటు వీవీఎస్ లక్ష్మణ్​, జహీర్ ఖాన్ కూడా తగిన గౌరవం దక్కాల్సింది” అని యువరాజ్ సింగ్ చెప్పాడు.

టీమ్​ఇండియా తరఫున యువరాజ్ సింగ్​ 304 వన్డేలు, 40టెస్టులు, 58 టీ20లు ఆడాడు.  అలాగే 2007 టీ20 ప్రపంచకప్​, 2011 వన్డే ప్రపంచకప్​లను భారత్ కైవసం చేసుకోవడంలో యువీ కీలకపాత్ర పోషించాడు. 17ఏండ్ల పాటు భారత్​కు ఎన్నో విజయాలు అందించిన యువరాజ్​.. గతేడాది జూన్​ 10న క్రికెట్​కు వీడ్కోలు పలికాడు.  


logo