శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 04, 2020 , 04:07:21

హైదరాబాద్‌లోనే టీవోఏ ఎన్నికలు రాష్ట్ర హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌లోనే టీవోఏ ఎన్నికలు  రాష్ట్ర హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్‌ సంఘం(టీవోఏ) ఎన్నికలు రోజుకో ములుపు తిరుగుతున్నాయి. ఢిల్లీలో కాకుండా ఎన్నికలు హైదరాబాద్‌లోనే జరుపాలంటూ హైకోర్టును ఆశ్రయించిన జయేశ్‌ రంజన్‌ ప్యానెల్‌కు ఊరట లభించింది. సోమవారం రిట్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎన్నికలు హైదరాబాద్‌లో నిర్వహించాలంటూ స్పష్టమైన తీర్పు వెలువరించింది. టీవోఏ కార్యాలయం ఇక్కడే ఉంచుకుని ఎన్నికలు ఢిల్లీలో నిర్వహిస్తామంటే కుదరదని ఈ సందర్భంగా జస్టిస్‌ వినోద్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా తయారీపై హైకోర్టు ధర్మాసనం అభ్యంతరాలు వ్యక్తం చేసిందని రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు పేర్కొన్నారు. ఓటర్ల సంఖ్యపై అవకతవకలు నెలకొన్న నేపథ్యంలో తాము కోర్టులో సవాలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. దీనికి తోడు జయేశ్‌ రంజన్‌ అధ్యక్ష  నామినేషన్‌ తిరస్కరణ, జగదీశ్వర్‌ యాదవ్‌ పోటీపై కూడా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌ రావు మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. సమైక్య రాష్ట్రంలో ఆఫ్రో ఏషియన్‌ గేమ్స్‌ తర్వాత ఆస్థాయిలో చెప్పుకోదగ్గ టోర్నీలు ఇప్పటి వరకు జరుగలేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో క్రీడలను మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాం. 


హైదరాబాద్‌ను క్రీడా హబ్‌గా తీర్చిదిద్దాలన్న విజన్‌తో ముందుకు వెళుతున్నాం. ఇందులో భాగంగానే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి జయేశ్‌ రంజన్‌ను అధ్యక్ష బరిలో నిలిపాం. కానీ కొందరు ఢిల్లీ పెద్దల సహకారంతో కుట్రలకు తెరతీశారు. వాటన్నంటిని ఛేదిస్తూ ముందుకువెళుతున్నాం. కచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధిస్తాం. స్పోర్ట్స్‌ కోడ్‌ నియామవళి కింద 70 ఏండ్ల పైబడిన వారికి క్రీడాసంఘాల్లో పోటీ చేసే అర్హత లేదు. మరోవైపు ఇప్పటికే రెండు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జగదీశ్వర్‌ యాదవ్‌ అర్హతను మేము ప్రశ్నిస్తున్నాం. దీనిపై మేము కోర్టులో సవాలు చేయబోతున్నాం. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి(ఆర్‌వో) జస్టిస్‌ చంద్రకుమార్‌ నియామకం అనైతికమని భావిస్తున్నాం. జస్టిస్‌ కేసీ భానును  ఆర్వోగా ఎంపిక చేసినట్లు గత నవంబర్‌లో ఐవోఏకు జగదీశ్వర్‌ యాదవ్‌ లేఖ పంపారు. వారి పేర్లను ఆమోదిస్తున్నట్లు ఐవోఏ కూడా ధృవీకరించింది. కానీ ఆయనను కాదని జస్టిస్‌ చంద్రకుమార్‌ను నియమించడం జరిగింది. క్రీడలను అభివృద్ధి చేయాలన్న మంచి ఉద్దేశంతో వచ్చిన జయేశ్‌ నామినేషన్‌ను తిరస్కరించారు. దీనికి గల కారణాలను ఇప్పటి వరకు తెలుపలేదు’ అని ఆయన అన్నారు. 


కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: జగదీశ్వర్‌ యాదవ్‌ 

హైదరాబాద్‌లో ఎన్నికలు జరుగాలన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు జగదీశ్వర్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తున్నట్లు ఓటర్ల జాబితాలో ఎలాంటి అవకతవకలు జరుగలేదు. ఆర్వోగా జస్టిస్‌ చంద్రకుమార్‌ నియామకం సరిగ్గానే జరిగిందని ఆయన అన్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 9న ఎన్నికలు జరుగుతాయని, టీవోఏకు తాను తొలిసారి పోటీచేస్తున్నట్లు జగదీశ్వర్‌ తెలిపారు. logo