శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 13, 2020 , 00:11:30

సిరీస్‌పై ఇంగ్లండ్‌ గురి

సిరీస్‌పై ఇంగ్లండ్‌ గురి

  • నేటి నుంచి పాకిస్థాన్‌తో రెండో టెస్టు.. సిరీస్‌ కాపాడుకునేందుకు పాక్‌ ఆరాటం 

సౌతాంప్టన్‌: పాకిస్థాన్‌తో తొలి టెస్టులో తొలుత తడబడినా ఆ తర్వాత దుమ్మురేపిన ఇంగ్లండ్‌ జట్టు సిరీస్‌పై కన్నేసింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ జట్టుకు దూరమవడం ఎదురుదెబ్బే అయినా పేస్‌ బలంతో పాక్‌ను మళ్లీ కొట్టాలన్న పట్టుదలతో రూట్‌సేన ఉంది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌-పాకిస్థాన్‌ మధ్య రెండో మ్యాచ్‌ గురువారం ఇక్కడి ఏజెస్‌బౌల్‌ మైదానంలో ప్రారంభం కానుంది. మాంచెస్టర్‌ వేదికగా నాటకీయంగా జరిగిన తొలి టెస్టులో మూడు వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లండ్‌ 1-0తో ముందడుగు వేసింది. మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగుల ఆధిక్యంతో పైచేయి సాధించిన పాకిస్థాన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో చిత్తయి ఓటమిపాలైంది. వోక్స్‌(84నాటౌట్‌), జోస్‌ బట్లర్‌ (75) అదరగొట్టడంతో నాలుగో రోజే 277పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ ఛేదించింది. దీంతో పాక్‌ కెప్టెన్‌ అజర్‌ అలీపై విమర్శలు వచ్చాయి. ఈ టెస్టులోనై సత్తాచాటి సిరీస్‌ ఆశలు నిలుపుకోవాలని పాక్‌ ఆరాటపడుతున్నది. 

స్టోక్స్‌ స్థానంలో రాబిన్‌సన్‌ 

కుటుంబ కారణాల వల్ల రెండో టెస్టుకు దూరమైన స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ స్థానంలో ఓలీ రాబిన్‌సన్‌ను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ఎంపిక చేసింది. రెండో టెస్టుకు 14 మందితో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. కాగా రెండో టెస్టు తుదిజట్టులో సీనియర్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ చోటు దక్కి ంచుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి.  

‘బబుల్‌'ను దాటిన హఫీజ్‌ 

పాకిస్థాన్‌ సీనియర్‌ ఆటగాడు మహమ్మద్‌ హఫీజ్‌ బుధవారం బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘించాడు. సౌతాంప్టన్‌లోని ఓ గోల్ఫ్‌ కోర్స్‌కు వెళ్లి..  90ఏండ్లు దాటిన ఓ మహిళతో ఫొటో దిగాడు. ఆమె ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని, స్ఫూర్తిదాయకమైన మహిళను కలిశానని ట్వీట్‌ చేశాడు. నిబంధనల ప్రకారం బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లు బయటివారిని కలువకూడదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన హఫీజ్‌ స్వీయ నిర్బంధంలో ఉంటాడని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) చెప్పింది. పాకిస్థాన్‌ టెస్టు జట్టులో లేని హఫీజ్‌... ఆ తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడాల్సిఉంది.  


logo