బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 27, 2020 , 00:31:27

పంజాబ్‌ పటాకా

పంజాబ్‌ పటాకా

  • కోల్‌కతాను చిత్తుచేసిన రాహుల్‌ సేన.. 
  • రాణించిన షమీ, గేల్‌, మన్‌దీప్‌

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక నెగ్గాల్సిన దశకు వచ్చాక కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ విజృంభిస్తున్నది. సగం టోర్నీ ముగిసేసరికి ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన పంజాబ్‌.. ఆ తర్వాత వరుసగా ఐదో విజయంతో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది. సమ ఉజ్జీల సమరంలో మహమ్మద్‌ షమీ సూపర్‌ బౌలింగ్‌తో కోల్‌కతాను కట్టడి చేసిన పంజాబ్‌.. ఆ తర్వాత యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌, మన్‌దీప్‌ సింగ్‌ సూపర్‌ పార్ట్‌నర్‌షిప్‌తో సూనాయాసంగా విజయం సాధించింది. 

షార్జా: ద్వితీయార్ధంలో దుమ్మురేపుతున్న పంజాబ్‌ జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట ఓడిన ఆ జట్టు.. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌ దిశగా మరో అడుగు వేసింది.  సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (45 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇయాన్‌ మోర్గాన్‌ (25 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. పంజాబ్‌ బౌలర్లలో షమీ 3, జోర్డాన్‌, రవి బిష్ణోయ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్‌ 18.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మన్‌దీప్‌ సింగ్‌ (56 బంతుల్లో 66 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌'  క్రిస్‌ గేల్‌ (29 బంతుల్లో 51; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. 

ఆడుతూ పాడుతూ..

ఓ మోస్తారు లక్ష్యఛేదనలో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇరగదీసింది. గాయం కారణంగా మయాంక్‌ దూరమైనా.. అతడి స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన మన్‌దీప్‌ సింగ్‌.. కెప్టెన్‌ లోకేశ్‌ రాహుల్‌ (28)కు చక్కటి సహకారం అందించాడు. తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించాక రాహుల్‌ ఔటైనా.. గేల్‌ రాకతో కోల్‌కతా కష్టాలు పెరిగాయే తప్ప తగ్గలేదు. వరుణ్‌ చక్రవర్తి ఓవర్‌లో 2 సిక్సర్లతో దంచుడు మొదలెట్టిన గేల్‌.. నరైన్‌ బౌలింగ్‌లో మరో రెండు సిక్సర్లు బాదాడు. మరో ఎండ్‌లో మన్‌దీప్‌ నిలకడగా ఆడటంతో చూస్తుండగానే లక్ష్యం కరిగిపోయింది. ఈ క్రమంలో మన్‌దీప్‌ సింగ్‌ 49 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంటే.. గేల్‌ 25 బంతుల్లోనే ఫిఫ్టీ మార్క్‌ దాటాడు. రెండో వికెట్‌కు వంద పరుగులు జోడించాక గేల్‌ ఔటైనా.. పూరన్‌ (2 నాటౌట్‌) సహకారంతో మన్‌దీప్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. 


రాణించిన గిల్‌, మోర్గాన్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్‌ రెండో బంతికే నితీశ్‌ రాణా (0) గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ బాట పడితే.. షమీ వేసిన రెండో ఓవర్‌లో రాహుల్‌ త్రిపాఠి (7), దినేశ్‌ కార్తీక్‌ (0) ఔటయ్యారు. దీంతో 10 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కోల్‌కతా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో గిల్‌తో జతకలిసిన కెప్టెన్‌ మోర్గాన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆరంభంలోనే వికెట్లు పడ్డా ఏ మాత్రం బెదరకుండా వరుస బౌండ్రీలతో రెచ్చిపోయాడు. షమీ వేసిన ఆరో ఓవర్‌లో మోర్గాన్‌ రెండు ఫోర్లు కొడితే.. గిల్‌ రెండు సిక్సర్లు అరుసుకున్నాడు. ఈ జోడీ ఇదే జోరు కనబర్చడంతో రన్‌రేట్‌ దూసుకెళ్లింది. మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించాక మోర్గాన్‌ ఔట్‌కాగా.. అక్కడి నుంచి స్కోరు వేగం తగ్గింది. నరైన్‌ (6), నాగర్‌కోటి (6), కమిన్స్‌ (1) విఫలం కాగా.. గిల్‌ క్రీజులో ఉన్నప్పటికీ భారీ షాట్లు ఆడలేకపోయాడు. ఆఖర్లో ఫెర్గూసన్‌ (24 నాటౌట్‌) కొన్ని షాట్లు ఆడటంతో కోల్‌కతా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.