మంగళవారం 14 జూలై 2020
Sports - May 03, 2020 , 01:28:12

ఔరా..లారా

ఔరా..లారా

  • సొగసైన బ్యాటింగ్‌కు చిరునామా

బ్రియాన్‌ చార్లెస్‌ లారా.. క్రికెట్‌ మేలిమి ముత్యం. ఆట కోసమే పుట్టాడా అన్న తరహాలో తన అద్భుత ఆటతీరుతో చెరుగని ముద్ర వేసిన క్రికెటర్‌. మైదానం నలువైపులా సొగసైన షాట్లతో అలరించడంలో సిద్ధహస్తుడు. ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరద పారించడంలో దిట్ట అయిన ఈ కరీబియన్‌ దిగ్గజం శనివారం 51వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా క్రికెట్‌  ప్రపంచం.. లారాను శుభాకాంక్షలతో ముంచెత్తింది. సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అందుకున్న లారా.. వీరోచితంగా పోరాడిన సందర్భాలు అనేకం. అందులో ఆస్ట్రేలియాతో బార్బడోస్‌ వేదికగా 1999 మార్చిలో జరిగిన మూడో టెస్టులో లారా(153 నాటౌట్‌) ఆడిన ఇన్నింగ్స్‌ అద్వితీయం.  

!పోరాటమే విండీస్‌  దిగ్గజం బ్రియాన్‌  లారా  పరమావధి. జట్టు కోసం అహరహం శ్రమించడంలో అందరి కన్నా ముందుంటాడు. 1990లో పాకిస్థాన్‌పై లాహోర్‌లో టెస్టు అరంగేట్రం చేసిన నాటినుంచి అదే పాక్‌పై కరాచీలో 2006లో ఆటకు వీడ్కోలు పలికే వరకు అతడి ఆటతీరు అద్భుతం. సుదీర్ఘ  కెరీ ర్‌లో ఈ కరీబియన్‌ కింగ్‌..131 టెస్టుల్లో 52.88 సగటుతో 11,953 పరుగులు చేశా డు. ఇప్పటి వరకు చెక్కుచెదరని అత్యధిక వ్యక్తిగత స్కోరు(400 నాటౌట్‌) రికార్డుతో పాటు 34 సెంచరీలు సాధించాడు.  

లారా.. వారియర్‌లా..

అప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఘోర ఓటమితో కుదేలైన వెస్టిండీస్‌ జట్టుకు సొంతగడ్డపై 1998-99 ఆస్ట్రేలియా సిరీస్‌ ఒక రకంగా ప్రాణం పోసిందని చెప్పొచ్చు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్‌కు తొలి మ్యాచ్‌ సమర్పించుకుని కష్టాల్లో ఉన్న కరీబియన్లు మలి టెస్టులో పుంజుకుని పోటీలోకి వచ్చారు. బార్బడోస్‌లో జరిగిన మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్‌ స్టీవ్‌ వా (199), పాంటింగ్‌ (104), లాంగర్‌(51) ఆదుకున్నారు. ముఖ్యంగా స్టీవ్‌ వా, పాంటింగ్‌.. కరీబియన్‌ పేస్‌ దాడిని సమర్థంగా ఎదుర్కొవడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 490 పరుగులు చేసింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన విండీస్‌..329 పరుగులు చేసింది. మెక్‌గ్రాత్‌(4/128), గెలెస్పి (3/48) విజృంభణతో విండీస్‌ ఓ దశలో 98 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో  షెర్విన్‌ క్యాంప్‌బెల్‌(105), రిడ్లీ జాకబ్స్‌ (68) సాధికారిక బ్యాటింగ్‌తో ఏడో వికెట్‌కు 153 పరుగులు జోడించారు.  వాల్ష్‌(5/39) విజృంభణతో  ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ నిర్దేశించిన 308 పరుగుల లక్ష్యఛేదన కోసం బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌.. నాలుగో రోజు ఆట ముగిసే సరికి మూడు  వికెట్లు చేజార్చుకుంది. ఐదో రోజు ఉదయం ఆటలో కూడా విండీస్‌ 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ తరుణంలో లారా అద్భుతం చేశాడు. కంగారూ బౌలర్లను కసిగా ఎదుర్కొన్న అతడు చూడచక్కని షాట్లతో అలరించాడు. లారా పోరాటంతో విండీస్‌ పోటీలోకి వచ్చిందని తెలుసుకున్న ఫ్యాన్స్‌ స్టేడియానికి వెల్లువెత్తారు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. లారా మాత్రం వెన్నుచూపని ధీరత్వం ప్రదర్శించాడు. విజయానికి మరో 60 పరుగులు అవసరమైన దశలో క్రీజులోకొచ్చిన ఆంబ్రో స్‌ (12)..లారాకు అండగా నిలిచాడు. పరిస్థితులకు తగ్గట్లు..82 నిమిషాల పాటు అంబ్రోస్‌లో క్రీజులో పాతుకుపోయాడు. ఇక విజయం ఖాయమనుకుంటున్న తరుణంలో ఆంబ్రోస్‌ను గెలెస్పి (3/62) ఔట్‌ చేయడంతో విండీస్‌ ఆశలు మళ్లీ సన్నగిల్లాయి. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోని లారా.. వాల్ష్‌ (0 నాటౌట్‌)తో కలిసి జట్టును గెలిపించాడు. కవర్స్‌లో బౌండరీతో జట్టుకు చిరస్మరణీయ గెలుపును అందించిన లారాను విజ్డెన్‌ తమదైన శైలిలో కీర్తించింది.


logo