బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Nov 08, 2020 , 19:22:47

బౌల్ట్‌ను వదులుకోవడం పెద్ద తప్పు: టామ్‌ మూడీ

బౌల్ట్‌ను వదులుకోవడం పెద్ద తప్పు: టామ్‌ మూడీ

దుబాయ్‌: స్పీడ్‌స్టర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ను డిఫెండింగ్‌ చాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌కు వదులుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌ పెద్ద తప్పు చేసిందని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ అన్నాడు. గత రెండు సీజన్లు ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహించిన బౌల్ట్‌..ఈ సీజన్‌లో ముంబైకి ఆడుతున్నాడు. బుమ్రా జతగా ప్రత్యర్థి జట్ల బ్యాటింగ్‌ను బెంబేలెత్తిస్తూ విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాడు.

ముఖ్యంగా ఢిల్లీతో క్వాలిఫయర్‌-1లో తొలి ఓవర్‌లోనే పృథ్వీషా, రహానేను పెవిలియన్‌ పంపి మ్యాచ్‌ను ఆదిలోనే బౌల్ట్‌ మలుపు తిప్పాడు. ఈ నేపథ్యంలో టామ్‌ మూడీ స్పందిస్తూ ‘ఢిల్లీ ఘోరమైన తప్పిదానికి పాల్పడింది. బౌల్ట్‌ లాంటి నిఖార్సైన పేసర్‌ను లీగ్‌లోనే పటిష్ట జట్టు అయిన ముంబైకి వదులుకుంది. బౌల్ట్‌ను వద్దనుకున్నప్పుడు ఐపీఎల్‌ యూఏఈలో జరుగుతుందని ఢిల్లీ అనుకోలేదేమో. యూఏఈ పిచ్‌లు స్వింగ్‌కు సహకరిస్తుండటం, బౌల్ట్‌ను జట్టులోకి తీసుకోవడం ముంబైకి బాగా కలిసొచ్చింది.

హార్దిక్‌ పాండ్యా ఫినిషర్‌ పాత్ర అమోఘం. అతనిలాంటి మ్యాచ్‌ ఫినిషర్లు చాలా అరుదు. ఢిల్లీతో మ్యాచ్‌లో పాండ్యా చేతల్లో చేసి చూపించాడు. కేవలం 14 బంతుల్లో ఐదు సిక్స్‌లతో 37 పరుగులు చేసి జట్టు 200 స్కోరు చేరుకోవడానికి కారణమయ్యాడు. ఇది మ్యాచ్‌ను ఒక రకంగా మలుపు తిప్పింది’ అని అన్నాడు.