శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 22, 2020 , 17:39:57

అందుకే ఆర్‌సీబీ ప్రతీసారి ఓడిపోతుంది : చాహల్‌

అందుకే ఆర్‌సీబీ ప్రతీసారి ఓడిపోతుంది : చాహల్‌

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ప్రతి సీజన్‌లోనూ భారీ అంచనాలతో బరిలోకి దిగి చివరికి లీగ్‌ మ్యాచుల దశలోనే ఇంటిదారి పడుతోంది. ఆ జట్టులో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నా.. గత కొన్ని సీజన్లుగా బెంగళూరు ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోతోంది. దానికి కారణం డెత్ ఓవర్లలో బౌలింగ్ బలహీనంగా ఉండటమేనని ఆర్‌సీబీ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ వెల్లడించాడు. 

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సీజన్ సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానుండగా.. బెంగళూరు టీం శుక్రవారమే అక్కడికి చేరుకుంది. ఆర్‌సీబీ ప్రదర్శనపై చాహల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘గత ఆరేండ్లుగా నేను బెంగళూరు టీంకు ఆడుతున్నా. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) ఉన్న ఒక్క ఏడాది మినహా.. మిగిలిన అన్ని సీజన్లలోనూ డెత్ ఓవర్ల బలహీనత అలానే కొనసాగుతూనే ఉంది. ఇన్నింగ్స్ 16-17 వరకూ బాగా కంట్రోల్ చేస్తాం. కానీ.. ఆ తర్వాత 3 ఓవర్లలోనే దాదాపు 30 శాతం మ్యాచ్‌ల్ని మేము చేజార్చుకుంటున్నాం. ఉదాహరణకు 16 ఓవర్లకు ప్రత్యర్థిని 130 పరుగులకు పరిమితం చేస్తే.. ఆ తర్వాత మూడు ఓవర్లలో 160-170 పరుగులు చేయాల్సి ఉంటుంది..కానీ జట్టు డెత్ ఓవర్ల బలహీనత కారణంగా ప్రత్యర్థి ఏకంగా 190-200 స్కోర్లు అందుకుంటున్నారు’’ అని వెల్లడించాడు.

అయితే ఈసారి ఆర్‌సీబీలో క్రిస్ మోరీస్, డేల్ స్టెయిన్, ఆస్ట్రేలియా పేసర్ కేన్ రిచర్డ్‌సన్ వంటి దిగ్గజ బౌలర్లున్నారు. మరి ఈసారైనా ఆర్‌సీబీ కప్పు గెలుస్తుందో చూద్దాం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo