ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 27, 2020 , 00:58:54

ఆటకు అందం వీడ్కోలు

ఆటకు అందం వీడ్కోలు

ఆటకు ఆట. అందానికి అందం. భువి నుంచి దివికి దిగివచ్చిన దేవకన్యలా ముట్టుకుంటే కందిపోయే పాలరాతి శిల్పం లాంటి మేను.అందంతోనే కాదు తనదైన ఆటతీరుతో టెన్నిస్‌ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన రష్యా భామ మరియా షరపోవా అభిమానులను ఆశ్చర్యంలో పడేసింది. అవును తానేంతో అభిమానించే టెన్నిస్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికింది. టీనేజ్‌లోనే సంచలనాలు సృష్టించిన షరపోవా టెన్నిస్‌కు ఇక గుడ్‌బై అంటూ సంక్షిప్త సందేశంతో తన నిర్ణయాన్ని ప్రకటించింది. కెరీర్‌లో డోపింగ్‌ మరకగా నిలిచినా..అందమైన ఆటతో కోట్లాది మంది హృదయాలను మరియా కొల్లగొట్టింది. కోర్టులో దిక్కులు పిక్కటిల్లేలా అరిచే ఈ అందాల భామ ఐదు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లకు తోడు మరెన్నో ట్రోఫీలు సొంతం చేసుకుంది. టెన్నిస్‌లో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న షరపోవా ఆటపై చెరగని ముద్రవేసిందనే చెప్పాలి.

  • మారియా షరపోవా సంచలన నిర్ణయం
  • టెన్నిస్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన రష్యా సుందరి

ప్యారిస్‌: టెన్నిస్‌ స్టార్‌ మరియా షరపోవా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆటకు వీడ్కోలు ప్రకటించి అభిమానులను విస్మయంలో ముంచెత్తింది. అద్వితీయమైన ఆటతో ఐదు గ్రాండ్‌స్లామ్‌లు ఖాతాలో వేసుకున్న ఈ 32 ఏండ్ల రష్యా భామ.. తనకు ఇష్టమైన ఆట నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం స్పష్టంచేసింది. ‘టెన్నిస్‌.. నేను వీడ్కోలు చెబుతున్నా. 28 ఏండ్లు, ఐదు గ్రాండ్‌స్లామ్‌ల తర్వాత, మరో శిఖరాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యా. కానీ ఇది చాలా భిన్నమైనది’ అని వానిటీ ఫెయిర్‌ మ్యాగ్‌జైన్‌ ద్వారా వెల్లడించింది. నాలుగేండ్ల వయసులోనే రాకెట్‌ పట్టిన మరియా.. కెరీర్‌లో ఎన్నో ఉత్తాన పతనాలు చవిచూసింది. పద్దెనిమిదేండ్ల ప్రాయంలోనే ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అధిరోహించిన షరపోవా.. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి డోపీగా తేలడంతో బ్యాన్‌ ఎదుర్కొంది. ఇలా ఎన్నో మలుపులు తిరిగిన ఆమె కెరీర్‌కు భుజం గాయం రూపంలో గట్టి ఎదురుదెబ్బ పడింది. నిషేధం పూర్తి చేసుకొని పునరాగమనం చేసినా.. ఫిట్‌నెస్‌ సమస్యలతో పాటు, భుజం గాయం తిరగబెట్టడంతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఇటీవల వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియా ఓపెన్‌లలో మరియా తొలిరౌండ్‌లోనే నిష్క్రమించింది. దీంతో ఆటకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకున్న ఈ ఆరడుగుల అందగత్తె.. 373వ ర్యాంక్‌తో కెరీర్‌ను ముగించింది.


నేనెప్పుడూ గతం గురించి పెద్దగా ఆలోచించలేదు.. భవిష్యత్తు గురించి బెంగ చెందలేదు. ఇదే నా విజయ రహస్యం అనుకుంటా. నా జీవితాన్ని టెన్నిస్‌కు అంకితమివ్వడంతో.. టెన్నిస్‌ నాకు జీవితాన్నించి.  నిద్ర లేవగానే కుడికాలి కంటే ముందు ఎడమ కాలి షూ లేస్‌లు కట్టుకోవడంతో నా దైనందిన జీవితం ప్రారంభమయ్యేది. ప్రాక్టీస్‌ కోర్టు బెంచ్‌పై మా నాన్నతో కలిసి కూర్చునే ఆ మధురమైన క్షణాలు ఇక కోల్పోతా. ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే.. టెన్నిస్‌ నా జీవితంలో ఓ పర్వతంలా కనిపిస్తున్నది. ఆ మార్గంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ శిఖరాన్ని అధిరోహించాక వచ్చిన అనుభూతి మాత్రం అనిర్వచనీయం. 

  షరపోవా


పూర్తి పేరు

మరియా యురివ్నే షరపోవా

ఎత్తు

ఆరడగుల రెండు అంగుళాలు

కెరీర్‌ ప్రారంభం

2001 ఏప్రిల్‌

గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌: 5

ఆస్ట్రేలియా ఓపెన్‌ (2008)

 వింబుల్డన్‌ (2004)

యూఎస్‌ ఓపెన్‌ (2006)

ఫ్రెంచ్‌ ఓపెన్‌ (2012, 2014)

కెరీర్‌ టైటిల్స్‌ 

36 డబ్ల్యూటీఏ

అత్యుత్తమ ర్యాంక్‌

1 (2005 ఆగస్టు)

ఒలింపిక్స్‌ మెడల్‌

రజతం (2012, లండన్‌) 


logo