ఆదివారం 29 మార్చి 2020
Sports - Jan 13, 2020 , 01:51:14

బంగారు దీప్తి

బంగారు దీప్తి

చిన్నతనంలోనే పరుగును ఇష్టపడిన ఆ అమ్మాయి పొలంగట్లపై చిరుతలా పరుగెత్తడం నేర్చుకుంది. సహజంగా లభించిన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ మరింత రాటుదేలింది. టాలెంట్‌కు పట్టుదల, సాధించాలన్న ఆకాంక్ష తోడైతే పేదరికం అడ్డుకాదని వరుస విజయాలతో నిరూపించింది. అడుగిడిన టోర్నీలన్నింటిలోనూ చిరుతలా పరుగెడుతూ రాష్ర్టానికి పతకాలను తీసుకొస్తున్నది. ఆ తెలంగాణ యువ కెరటమే జివాంజి దీప్తి. వరంగల్‌ జిల్లాలోని మారుమూల గ్రామంలో రైతుకూలీ కుటుంబంలో పుట్టినా.. ప్రతిభలో ధనవంతురాలినేనని నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నది. తాజాగా గువాహటిలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లోనూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని మరోసారి మెరిసింది.

  • ఖేలో ఇండియాలో తెలంగాణ అమ్మాయికి స్వర్ణం
  • 100 మీటర్ల పరుగులో మీట్‌ రికార్డు

గువాహటి: తెలంగాణ యువ కెరటం జివాంజి దీప్తి మరోసారి సత్తాచాటింది. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో ఈ స్ప్రింటర్‌ తనదైన దూకుడు కనబరిచింది. బాలికల 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించడంతో పాటు మీట్‌ రికార్డును తిరగరాసింది. ఆదివారం ఇక్కడ జరిగిన అండర్‌-17 బాలికల 100 మీటర్ల ఫైనల్లో 12.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన జివాంజి దీప్తి అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం చేజిక్కించుకుంది. తమిళనాడుకు చెందిన రుతిక శరవణ (12.26 సె.), షారోన్‌ మారియా (12.46 సె.)వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. తుదిపోరులో దీప్తి, రుతిక ఒకే టైమింగ్‌ నమోదు చేసినా ఫ్రేమింగ్‌ తేడాలో తెలంగాణ అమ్మాయి స్వర్ణం ఎగరేసుకెళ్లింది. అంతకు ముందు జరిగిన హీట్స్‌లో దీప్తి (12.38 సె.) అగ్రస్థానంలో నిలిచి.. ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగుపెట్టింది.

పంట పొలాల నుంచి స్వర్ణాల వరకు..

నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: వరంగల్‌ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన రైతు కూలీ యాదగిరి కుమార్తె జివాంజి దీప్తి. కటిక పేదరికం బాధిస్తున్నా పరుగునే నమ్ముకొని లక్ష్యం వైపుగా ఆమె దూసుకొస్తున్నది. ఊహ తెలియనప్పుడే పరుగును ఇష్టపడిన దీప్తి.. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పొలం గట్లపై చిరుతలా పరుగెత్తుతూ రాటుదేలింది. ఆ సమయంలో తాను చదువుతున్న పాఠశాలలో జరిగిన అథ్లెటిక్స్‌ మీట్‌ దీప్తికి వరమైంది. ఆ పోటీలో దీప్తి మెరుపువేగాన్ని చూసిన ద్రోణాచారి అవార్డీ, జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ మరింత శిక్షణ ఇస్తే దేశానికి పతకాలు తెస్తుందని గుర్తించారు. ఆమె తల్లిదండ్రులను ఒప్పించి స్పోర్ట్స్‌ హాస్టల్‌లో చేర్పించి.. మెరుగైన  శిక్షణ ఇప్పించారు. అక్కడి నుంచి క్రమంగా మెరుగుపడ్డ దీప్తి తన వేగాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2017లో జరిగిన సౌత్‌జోన్‌ 100, 200 మీటర్ల పరుగు పోటీల్లో విజేతగా నిలిచిన దీప్తి అథ్లెటిక్స్‌లో తన రాకను ఘనంగా చాటింది. అదే ఏడాది జరిగిన నేషనల్‌ మీట్‌లోనూ రెండు స్వర్ణాలతో సత్తాచాటింది. సాయ్‌-గోపీచంద్‌ మైత్ర ప్రాజెక్టు కింద శిక్షణ పొందుతున్న దీప్తి.. ఇప్పటి వరకు బరిలోకి దిగిన ప్రతిటోర్నీలోనూ తనదైన ముద్ర వేస్తూ రాణిస్తున్నది. ఈ ఏడాది హాంకాంగ్‌లో జరిగిన ఆసియా యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ వ్యక్తిగత 200 మీటర్ల పోటీలో కాంస్య పతకంతో అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తాచాటింది. ఇటీవల పంజాబ్‌లో జరిగిన జాతీయస్థాయి పాఠశాలల అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ స్ప్రిం ట్‌లో స్వర్ణపతకం కైవసం చేసుకున్న దీప్తి.. తాజాగా ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లోనూ విజయపతాక ఎగురవేసి.. తెలంగాణ నుంచి అంతర్జాతీయస్థాయి స్ప్రింటర్‌ రాబోతున్నదన్న భరోసాను పెంచింది.


logo