సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 19, 2020 , 01:12:55

జహ్రా కాంస్య గురి

జహ్రా కాంస్య గురి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: గువాహటి వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ యువ షూటర్‌ జహ్రా ముఫద్దల్‌ దీసావాలా కాంస్య పతకంతో మెరిసింది. శనివారం జరిగిన మహిళల జూనియర్‌ క్లే పీజియన్‌ స్కీట్‌ షూటింగ్‌ ఈవెంటులో పోటీకి దిగిన జహ్రా..ప్రత్యర్థులకు దీటైన పోటీనిచ్చింది. ఏ మాత్రం అంచనాల్లేకుండానే కచ్చితమైన గురితో తుదిపోరులో 102+35 స్కోరుతో కాంస్య పతకాన్ని ఒడిసిపట్టుకుంది. ఏ దశలోనూ వెరవకుండా కడదాకా అద్భుత పోరాట పటిమ కనబరిచిన జహ్రా రాష్ర్టానికి షూటింగ్‌లో తొలి పతకాన్ని తీసుకొచ్చింది. సంజన గౌడ్‌(హర్యానా), కీర్తన(తమిళనాడు) వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు.

జహ్రా కాంస్య పతక ప్రదర్శనను రాష్ట్ర రైఫిల్‌ సంఘం(టీఆర్‌ఏ) అధ్యక్షుడు అమిత్‌ సంఘీతో పాటు కార్యదర్శి అబిద్‌ షరీఫ్‌ అభినందించారు. మరోవైపు టెన్నిస్‌లో అండర్‌-21 బాలికల సింగిల్స్‌లో సామ సాత్విక 6-1, 7-5తో ప్రతిభా ప్రసాద్‌ (కర్ణాటక)పై విజయం సాధించి ముందంజ వేసింది. బాలుర విభాగంలో గంటా సాయి కార్తీక్‌ 6-2, 6-1తో నితిన్‌ సింగ్‌ (హర్యానా)పై అలవోకగా గెలిచాడు. మరో సింగిల్స్‌లో శశాంక్‌ మాచర్ల 6-4, 2-6, 7-6తో దివేశ్‌ గెహ్లాట్‌(హర్యానా)పై విజయం సాధించాడు. 


logo