సోమవారం 13 జూలై 2020
Sports - Apr 21, 2020 , 00:44:17

క్రీడాహబ్‌ దిశగా..

క్రీడాహబ్‌  దిశగా..

  • స్పోర్ట్స్‌  సిటీ, నూతన విధానంతో రాష్ట్రంలో క్రీడారంగానికి మహర్దశ
  • సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై క్రీడాకారులు, అభిమానుల హర్షం

తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ నానాటికీ పెరుగుతూనే ఉన్నది. రంగం ఏదైనా.. దేశంలోని ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తూ ముందుకు దూసుకెళుతున్నది. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంలో పలు విప్లవాత్మక నిర్ణయాలకు వేదికవుతున్న తెలంగాణ.. క్రీడారంగంలోనూ మరింత ఉన్నత స్థితికి వెళ్లేందుకు సిద్ధమైంది. సీఎం ఆలోచనల్లో నుంచి పురుడు పోసుకున్న స్పోర్ట్స్‌ సిటీ, క్రీడా విధానంతో రాష్ట్రంలో క్రీడారంగానికి మున్ముందు మహర్దశ రాబోతున్నది.  ఈ నిర్ణయాలపై క్రీడాభిమానులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: క్రీడారంగంలో దేశంలోనే రాష్ర్టాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి  కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభు త్వం నడుం బిగించింది. రాష్ర్టాన్ని క్రీడాహబ్‌గా తీర్చిదిద్దేందుకు స్పోర్ట్‌ సిటీ నిర్మా ణం, క్రీడా విధానం రూపకల్పనకు సిద్ధమైంది. క్రీడారంగ అభివృద్ధితో పాటు సం పూర్ణ ఆరోగ్య తెలంగాణ కలను ఈ కీలక చర్యలతో సాకారం చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉన్నది. 

క్రీడాకారులకు అంతర్జాతీయస్థాయి శిక్షణ 

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌తో మొదలుపెడితే కామన్వెల్త్‌ క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లు, ఆసియా గేమ్స్‌ లాంటి మెగా టోర్నీల్లో తెలంగాణ క్రీడాకారులు ఇప్పటికే పలు పతకాలు కొల్లగొట్టారు. జాతీయ టోర్నీలో       విశేషంగా రాణిస్తున్నారు. దీంతో యువత పెద్ద ఎత్తున క్రీడలపై ఆసక్తి కనబరుస్తున్నది.  ఈ నేపథ్యంలో యువ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో స్పోర్ట్స్‌ సిటీ, క్రీడావిధానం భవిష్యత్తులో కీలకపాత్ర పోషించనున్నాయి. తెలంగాణ గ్రామాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదువ లేదు. అలాంటి వారికి అధిక సంఖ్యలో మెరుగైన వసతులతో అత్యాధునిక పద్ధతుల్లో శిక్షణ ఇచ్చే అవకాశం స్పోర్ట్స్‌ సిటీతో దక్కనుంది. 

స్పోర్ట్స్‌  సిటీ, క్రీడా విధానం.. 

ప్రణాళికల్లో భాగంగా...ఫార్మా, ఫిల్మ్‌ సిటీల తరహాలోనే స్పోర్ట్స్‌ సిటీ అభివృద్ధి వైపు అడుగులు వేయబోతున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. హకీంపేట, శామీర్‌పేటలోని 300 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో స్పోర్ట్స్‌ సిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారు. అంతర్జాతీయ హంగులతో దీన్ని నిర్మించేందుకు ప్రణాళికను సిద్ధం చేయనున్నట్టు ప్రకటించారు. క్రీడా విధానం రూపకల్పన కోసం రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధ్యక్షతన ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సభ్యులుగా క్యాబినెట్‌ సబ్‌ కమిటీని సీఎం నియమించారు. 


సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో అత్యుత్తమ క్రీడా విధానాన్ని తీసుకొస్తాం. శామీర్‌పేట, హకీంపేటలో ఉన్న ప్రభుత్వ భూమిలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్పోర్ట్స్‌ సిటీని ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌ వరకే పరిమితం కాకుండా జిల్లా కేంద్రాల్లోనూ అకాడమీలు నెలకొల్పి యువ క్రీడాకారులను మరింతగా పోత్సహిస్తాం. మిగతా రాష్ర్టాలు, ప్రపంచంలోని వివిధ దేశాల  క్రీడా పాలసీలను కూడా అధ్యయనం చేస్తాం. 

- శ్రీనివాస్‌ గౌడ్‌, రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి 


స్పోర్ట్స్‌ సిటీ, క్రీడా విధానాన్ని తీసుకురావాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచన అద్భుతం. రాష్ట్రంలోని మాజీ ఒలింపియన్లు, ఒలింపిక్‌ సంఘం, ఆయా క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయులు, పీడీలు, స్పోర్ట్స్‌ జర్నలిస్టులతో  రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. వారి సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.

-ఏ.వెంకటేశ్వర్‌ రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ 


మెరుగైన సౌకర్యాలు ఉంటేనే చక్కటి ఫలితాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం హకీంపేటలో స్పోర్ట్స్‌ సిటీ నిర్మించాలని నిర్ణయిం చడం అభినందనీయం. ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటేనే క్రీడారంగంలో అగ్రగామిగా దూసుకెళ్లగలం. 

- తిలక్‌ వర్మ, క్రికెటర్‌


క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధ్యక్షతన క్యాబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేయడం హర్షనీయం. క్రీడా విధానం రూపకల్పనలో రాష్ట్రంలోని ప్రముఖ క్రీడాకారులు, క్రీడా సంఘాలు, నిపుణులను భాగస్వామ్యం చేయాలి. రాష్టంలో మెగా ఈవెంట్లను నిర్వహించేందుకు సబ్‌కమిటీ చొరవతీసుకోవాలి.

 - జగన్మోహన్‌ రావు, జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడు 


దేశంలో ఇప్పటి వరకు స్పోర్ట్స్‌ సిటీ గురించి ఎవరూ ఆలోచించలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మదిలో తొలిసారి మెదిలిన ఈ ఆలోచన చాలా బాగుంది. క్రీడల ద్వారా వ్యాయమానికి తోడు మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది. స్పోర్ట్స్‌ సిటీ, క్రీడా పాలసీ ద్వారా మరింత మంది క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావచ్చు.      

నాగపురి రమేశ్‌, భారత అథ్లెటిక్స్‌ కోచ్‌


స్పోర్ట్స్‌ సిటీ నిర్మించాలనుకుంటున్న ప్రభుత్వ నిర్ణయం చాలా మంచిది. భవిష్యత్‌ తరాలకు ఇది ఎంతో దోహదపడుతుంది. ప్రస్తుతం క్రీడారంగంలో హర్యానా రాష్ట్రం ముందు వరుసలో దూసుకెళ్తున్నది. స్పోర్ట్స్‌ సిటీలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తే.. మన దగ్గర నుంచి కూడా మరింత మంది చాంపియన్లు వస్తారు.  

- నిఖత్‌ జరీన్‌, బాక్సర్‌


logo