గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 28, 2020 , 02:38:32

తెలంగాణ శుభారంభం

 తెలంగాణ శుభారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం వేదికగా సోమవారం మొదలైన 81వ జాతీయ సీనియర్‌, ఇంటర్‌స్టేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణ జట్లు శుభారంభం చేశాయి. తొలుత జరిగిన మహిళల విభాగంలో తెలంగాణ టీమ్‌ 3-0తో పుదుచ్చేరిపై ఘన విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌లో వరుణి జైస్వాల్‌ 11-1, 11-6, 11-2తో సుభిక్షపై అలవోకగా గెలిచింది. ప్రణీత 10-12, 11-8, 11-4, 11-8తో కన్మణి రావుపై గెలువగా, మోనిక 11-4, 11-4, 11-7తో రాచెల్‌ను ఓడించింది. అదే జోరులో రాజస్థాన్‌ను 3-0తో ఓడించిన తెలంగాణ..హిమాచల్‌ ప్రదేశ్‌తో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ 3-0తో మేఘాలయాపై ఘన విజయం సొంతం చేసుకోగా, గతేడాది సెమీఫైనలిస్టు ఉత్తర్‌ప్రదేశ్‌పై 3-1తో గెలిచారు.  మంగళవారం జరిగే తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌తో తెలంగాణ తలపడుతుంది. సాయంత్రం జరిగిన ప్రారంభోత్సవానికి జాతీయ టీటీ అధ్యక్షుడు, హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతా లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీటీ అసోసియేషన్‌ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, కార్యదర్శి ప్రకాశ్‌రాజ్‌, రాష్ట్ర హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు, సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 550 మంది ఆటగాళ్లు మార్చ్‌ఫాస్ట్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. 


logo