సోమవారం 30 మార్చి 2020
Sports - Jan 14, 2020 , 00:34:58

సూర్యదేవ్‌కు కాంస్యం

 సూర్యదేవ్‌కు కాంస్యం
  • ఖేలో ఇండియాలో సత్తాచాటిన తెలంగాణ జిమ్నాస్ట్‌

గువాహటి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో వరుసగా రెండు రోజులు స్వర్ణాలతో మెరిసిన తెలంగాణ ప్లేయర్లు.. మూడో రోజు కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నారు. అండర్‌-21 బాలుర జిమ్నాస్టిక్స్‌ స్టిల్‌ రింగ్స్‌ విభాగంలో తెలంగాణ జిమ్నాస్ట్‌ పేర్న సూర్యదేవ్‌ కాంస్యం చేజిక్కించుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్లో సూర్యదేవ్‌ 11.70 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. కేరళకు చెందిన స్వతీశ్‌ (12.35) స్వర్ణం కైవసం చేసుకోగా.. ఉత్తర ప్రదేశ్‌ జిమ్నాస్ట్‌ సందీప్‌ పాల్‌ (11.95)కు రజతం దక్కింది. వరంగల్‌కు చెందిన 18 ఏండ్ల సూర్యదేవ్‌.. వాగ్దేవి కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నాలుగేండ్ల వయసు నుంచే జిమ్నాస్టిక్స్‌ వైపు ఆకర్షితుడైన సూర్య అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయికి చేరాడు. జూనియర్‌ లెవల్లో రాష్ట్ర స్థాయిలో పలు     పతకాలు సాధించిన అతడు.. మరింత ప్రోత్సాహం లభిస్తే మెరుగైన ఫలితాలు సాధించేందుకు సిద్ధమంటున్నాడు.


దీప్తి దూకుడు..

టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో దూసుకుపోతున్న తెలంగాణ యువ ప్యాడ్లర్‌ సురావజ్జుల ఫిడేల్‌ రఫీక్‌ స్నేహిత్‌ అండర్‌-21 బాలుర సింగిల్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన సెమీస్‌లో స్నేహిత్‌ 6-11, 8-11, 11-4, 11-4, 14-16, 12-10, 11-5తో జీత్‌చంద్ర (హర్యానా)పై నెగ్గి తుదిపోరుకు చేరాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో స్నేహిత్‌ 10-12, 11-4, 11-5, 12-14, 11-5, 11-7తో రాజేశ్‌ పాటిల్‌ (మహారాష్ట్ర)పై గెలిచాడు. మరోవైపు బాలికల 100 మీటర్ల విభాగంలో స్వర్ణం చేజిక్కించుకున్న జివాంజి దీప్తి.. 200 మీటర్లలోనూ సత్తాచాటింది. సెమీఫైనల్స్‌లో 25.30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి మంగళవారం జరుగనున్న తుదిపోరుకు అర్హత సాధించింది. లాంగ్‌జంప్‌లో పసిడి నెగ్గిన అగసర నందిని నేడు 100మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్లో బరిలోకి దిగనుంది.


logo