శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 15, 2020 , 01:28:13

చార్‌ మినార్‌

చార్‌ మినార్‌

రెక్కాడితే కానీ డొక్కాడని నేపథ్యం ఒకరిది .. పొట్ట కూటికోసం నగరానికి వలస వచ్చిన గతం మరొకరిది.. ఒలింపిక్స్‌ పతకమే లక్ష్యంగా ఒకరు.. అంతర్జాతీయ యవనిక పై మెరువాలని మరొకరు..

  • ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో నాలుగు స్వర్ణాలు నెగ్గిన తెలంగాణ ప్లేయర్లు
  • 200 మీటర్ల పరుగులో దీప్తి.. 100 మీటర్ల హర్డిల్స్‌లో నందినికి పసిడి పతకాలు
  • టేబుల్‌ టెన్నిస్‌లో స్నేహిత్‌.. సైక్లింగ్‌లో తనిష్క్‌ గౌడ్‌కు గోల్డ్‌ మెడల్స్‌

ఇలా భిన్న నేపథ్యాల నుంచి వచ్చిన నలుగురు తెలంగాణ ప్లేయర్లు జాతీయ స్థాయిలో సత్తాచాటారు. ఖేలో ఇండియా యూత్‌గేమ్స్‌లో అద్వితీయ ప్రదర్శనతో పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. వంద మీటర్లలో చిరుతను తలపించిన దీప్తి.. 200 మీటర్లలోనూ తనకు పోటీలేదని చాటితే.. లాంగ్‌ జంప్‌లో అల్లంత దూరం లంఘించి స్వర్ణం నెగ్గిన నందిని, 100 మీ. హర్డిల్స్‌లో బంగారు పతకం కైవసం చేసుకుంది. జీవితంలో తానెదుర్కొన్న అవరోధాల ముందు హర్డిల్స్‌  ఓ లెక్కా అన్న చందంగా దూసుకెళ్లిన నందిని 0.05 సెకన్ల తేడాతో జాతీయ రికార్డు మిస్‌ చేసుకుంది. ఇక వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ ప్యాడ్లర్‌ స్నేహిత్‌ టేబుల్‌ టెన్నిస్‌ బాలుర సింగిల్స్‌ ఫైనల్లో ప్రత్యర్థిని చిత్తు చేస్తే.. సైక్లింగ్‌లో తనిష్క్‌ గౌడ్‌ తనదైన ముద్ర వేశాడు. 


గువాహటి: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌-2020లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. పోటీల ఆరో రోజు మనవాళ్లు నాలుగు స్వర్ణ పతకాలు చేజిక్కించుకున్నారు. అండర్‌-17 బాలికల 200 మీటర్ల పరుగులో జివాంజి దీప్తి, అండర్‌-17 బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో అగసర నందిని, టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) అండర్‌-21 బాలుర సింగిల్స్‌లో సురావజ్జుల ఫిడేల్‌ రఫీక్‌ స్నేహిత్‌, అండర్‌-21 బాలుర సైక్లింగ్‌ ఒక కిలోమీటర్‌ వ్యక్తిగత విభాగంలో ఎం. తనిష్క్‌ గౌడ్‌ పసిడి పతకాలు కొల్లగొట్టారు. ఇప్పటి వరకు ముగిసిన పోటీల్లో 26 స్వర్ణాలు సహా మొత్తం 107 మెడల్స్‌ సాధించిన మహారాష్ట్ర పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తెలంగాణ 10 పతకాల (6 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు)తో పట్టికలో 11వ స్థానంలో నిలిచింది.


దుమ్మురేపిన దీప్తి..

ట్రాక్‌పై అడుగు పెట్టింది మొదలు చిరుతలా దూసుకుపోతున్న దీప్తి మరోసారి మెరిసింది. మూడు రోజుల క్రితమే అండర్‌-17 బాలికల 100 మీటర్ల పరుగు పందెంలో అగ్రస్థానంలో నిలిచిన ఈ ఓరుగల్లు చిన్నది.. తాజాగా 200 మీటర్ల పరుగులోనూ సేమ్‌ సీన్‌ రిపీట్‌ చేసింది. వింటి నుంచి వదిలిన బాణంలా లక్ష్యం వైపు దూసుకెళ్లిన దీప్తి 24.84 సెకన్లలో గమ్యాన్ని చేరింది. పాయల్‌ వొహ్రా (24.87 సెకన్లు, ఢిల్లీ), సుదేశ్న హన్మంత్‌ శివ (25.24 సెకన్లు, మహారాష్ట్ర) వరుసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి తన ప్రతిభతోనే జాతీయ స్థాయిలో వరుస పతకాలు సాధిస్తున్న దీప్తి.. ద్రోణాచార్య అవార్డీ, జాతీయ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేశ్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్నది. ప్రస్తుతానికి తన మెరుపులు జాతీయ స్థాయికే పరిమితమైనా.. భవిష్యత్తులో అంతర్జాతీయ యవనికపై తనదైన ముద్ర వేయాలని దీప్తి ఉవ్విళ్లూరుతున్నది.


నందిని.. స్వర్ణ రంజిని

ఈ మెగాటోర్నీ లాంగ్‌జంప్‌లో పసిడి నెగ్గి ఇప్పటికే తనదైన ముద్ర వేసిన నందిని.. తాజాగా అండర్‌-18 బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లోనూ టాప్‌లో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మూడు రోజుల క్రితం జరిగిన హీట్స్‌లో ఎవరికీ అందనంత ముందు నిలిచిన నందిని.. మంగళవారం జరిగిన ఫైనల్లోనూ అదే జోరు కనబర్చింది. గన్‌లో నుంచి దూసుకొచ్చిన బుల్లెట్‌లా 14.07 సెకన్లలో లక్ష్యాన్ని చేరింది. ప్రాంజలి దిలీప్‌ పాటిల్‌ (14.57 సెకన్లు, మహారాష్ట్ర), ప్రియ సభాజీత్‌ గుప్తా (14.57 సెకన్లు, మహారాష్ట్ర) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు చేజిక్కించుకున్నారు. మెరుగైన శిక్షణ కోసం కేంద్రీయ విద్యాలయం (కేవీ) నుంచి నార్సింగి గురుకుల పాఠశాలకు మారిన నందిని.. అక్కడ రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రోత్సాహంతో నాగపురి రమేశ్‌ పర్యవేక్షణలో ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నది. 100 మీటర్ల హర్డిల్స్‌తో పాటు హెప్టాథ్లాన్‌, ట్రయథ్లాన్‌, లాంగ్‌జంప్‌లో సత్తా చాటుతున్న నందిని అంతర్జాతీయ టోర్నీల్లో మువ్వన్నెల జెండాను ఎగరేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.


తళుక్కుమన్న తనిష్క్‌

అండర్‌-21 బాలుర వ్యక్తిగత 1000 మీటర్ల టైమ్‌ ట్రయల్‌లో ఎం. తనిష్క్‌ గౌడ్‌ తళుక్కుమన్నాడు. మంగళవారం జరిగిన రేస్‌లో 21 మంది పోటీపడగా.. అందరికంటే ఉత్తమంగా ఒక నిమిషం 8.3 సెన్లలో లక్ష్యాన్ని చేరి బంగారు పతకం ఖాతాలో వేసుకున్నాడు. కర్ణాటకకు చెందిన వెంకప్ప (1 నిమిషం 9.2 సెకన్లు), పంజాబ్‌కు చెందిన గుర్‌ప్రీత్‌ సింగ్‌ (1 నిమిషం 9.5 సెకన్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు చెందిన తనిష్క్‌ గౌడ్‌ ఇటీవల కొరియా వేదికగా జరిగిన ఆసియా సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించడమే లక్ష్యంగా సాగుతున్న తనిష్క్‌ మున్ముందు మరిన్ని మంచి ఫలితాలు సాధించాలని తెలంగాణ సైక్లింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కే దత్తాత్రేయ ఆకాంక్షించారు.


సూపర్‌ స్నేహిత్‌

టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ)లో మహారాష్ట్ర ఆధిపత్యానికి గండికొడుతూ.. తెలంగాణ ప్లేయర్‌ సురావజ్జుల ఫిడేల్‌ రఫీక్‌ స్నేహిత్‌ పసిడి పతకం ఎగరేసుకెళ్లాడు. బాలుర అండర్‌-21 సింగిల్స్‌ ఫైనల్లో స్నేహిత్‌ 4-2 (9-11, 12-10, 12-10, 5-11, 11-8, 11-6)తో రీగన్‌ అల్బిక్యూరిక్‌ (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. టేబుల్‌ టెన్నిస్‌లో తెలంగాణకు ఇదే తొలి ఖేలో ఇండియా గోల్డ్‌ మెడల్‌ కావడం విశేషం. తెలంగాణ టీటీ కోచ్‌ శివానంద్‌ ప్రోత్సాహంతో ఈ టోర్నీలో ముందుకు సాగిన స్నేహిత్‌.. సెమీస్‌లో హర్యానాకు చెందిన టాప్‌ సీడ్‌ జీత్‌ చంద్రను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించాడు. టోర్నీ ఏదైనా స్వర్ణం నెగ్గడం ఆనందాన్ని రెట్టింపు చేస్తుందన్న స్నేహిత్‌.. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్నాడు. త్వరలో హైదరాబాద్‌ వేదికగా జరుగనున్న సీనియర్‌ నేషనల్స్‌తో పాటు, వచ్చే నెల భువనేశ్వర్‌లో జరిగే ‘ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌'లోనూ సత్తాచాటాలని భావిస్తున్నాడు. ‘ఆ రెండు టోర్నీల కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా. సీనియర్‌ నేషనల్స్‌లో పతకం నెగ్గడమే నా తదుపరి లక్ష్యం. యూనివర్సిటీ గేమ్స్‌ కోసం ఇప్పటికే మా జట్టు ప్రాక్టీస్‌ మొదలెట్టింది. భిన్నమైన సవాళ్లు ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నా’అని స్నేహిత్‌ అన్నాడు.


సాట్స్‌ చైర్మన్‌ అభినందన

ఖేలో ఇండియా గేమ్స్‌లో సత్తాచాటిన రాష్ట్ర ప్లేయర్స్‌ను సాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి అభినందించారు. బాలికల అండర్‌-17 100, 200 మీటర్లలో స్వర్ణాలు చేజిక్కించుకున్న జివాంజి దీప్తితో పాటు.. బాలికల లాంగ్‌ జంప్‌, 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణాలు నెగ్గిన అగసర నందినిని మంగళవారం గువాహటిలో కలుసుకున్న సాట్స్‌ చైర్మన్‌.. ఇరువురిని అభినందించారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి జాతీయ స్థాయిలో సత్తాచాటిన యువ అథ్లెట్లకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.


logo