శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Jan 21, 2020 , 01:47:14

కార్తీక్‌ కమాల్‌

కార్తీక్‌ కమాల్‌
  • ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో కాంస్యం నెగ్గిన తెలంగాణ లిఫ్టర్‌

గువాహటి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతున్నది. రాష్ర్టానికి చెందిన వెయిట్‌ లిఫ్టర్‌ హలావత్‌ కార్తీక్‌ అండర్‌-21 బాలుర 89 కేజీల విభాగంలో కాంస్య పతకం ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం జరిగిన పోటీల్లో 269 కేజీల (స్నాచ్‌లో 119 + క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 150) బరువెత్తిన కార్తీక్‌ మూడో స్థానంలో నిలిచాడు. తమిళనాడుకు చెందిన ఎస్‌. లోక్‌చంద్‌ (291 కేజీలు), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆదిబోయిన శివరామకృష్ణ యాదవ్‌ (275 కేజీలు) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.

శ్రీవిద్య, శ్రీయ జోడీకి కాంస్యం:బ్యాడ్మింటన్‌లో తెలంగాణ బోణీ కొట్టింది. సోమవారం జరిగిన అండర్‌-21 బాలికల డబుల్స్‌లో రాష్ట్ర జోడీ శ్రీవిద్య, సాయి శ్రీయ 21-16, 11-21, 25-23 తేడాతో ఢిల్లీ ద్వయం రియా, లిఖిత శ్రీవాస్తవపై విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు అండర్‌-21 బాలుర డబుల్స్‌లో రాష్ర్టానికి చెందిన నవనీత్‌ బొక్కా, విష్ణుగౌడ్‌ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో నవనీత్‌, విష్ణు ద్వయం 21-15, 21-17తో అసోం జోడీ సొనోవాల్‌ ఇమాన్‌, సూరజ్‌ గోలాపై గెలిచి పసిడి పోరులో నిలిచింది. ఇక టెన్నిస్‌లో శ్రావ్య శివానీ, సామ సాత్విక జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో ఈ తెలంగాణ ద్వయం 6-1, 6-2తో సందీప్తి రావు, సన్య సింగ్‌(హర్యానా)పై గెలిచింది. అండర్‌-21 బాలుర డబుల్స్‌ సెమీఫైనల్లో సాయి కార్తీక్‌రెడ్డి, తీర్థ శశాంక్‌ జోడీ 4-6, 7-5, 10-8తో మహారాష్ట్ర ద్వయం అథర్వ శర్మ, ధృవ్‌ సునీశ్‌పై గెలిచి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. 


ముచ్చటగా మూడోది

నిజామాబాద్‌ జిల్లా పిట్లంకు చెందిన హలావత్‌ కిషన్‌, కవిత దంపతుల ప్రథమ సంతానం అయిన కార్తీక్‌ హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో గత రెండు పర్యాయాలు స్వర్ణాలు (అండర్‌-17) చేజిక్కించుకున్న అతడు ఈసారి కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఏడేండ్ల క్రితం లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న ఈ ఇందూరు కుర్రాడు.. కానిస్టేబుల్‌ అయిన తండ్రి ప్రోత్సాహంతో ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఎనిమిది పతకాలు సాధించాడు. వచ్చే నెలలో జరుగనున్న సీనియర్‌ నేషనల్స్‌పైనే దృష్టి పెట్టిన కార్తీక్‌.. ప్రోత్సాహం లభిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 


logo