శనివారం 28 మార్చి 2020
Sports - Jan 20, 2020 , 02:46:03

శభాష్‌ గణేశ్‌

శభాష్‌ గణేశ్‌
  • ఖేలో ఇండియాలో రజతం నెగ్గిన తెలంగాణ లిఫ్టర్‌

గువాహటి: ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ లిఫ్టర్‌ ధారవత్‌ గణేశ్‌ రజత పతకంతో మెరిశాడు. అండర్‌-17 బాలుర 73 కేజీల విభాగంలో 245 (స్నాచ్‌లో 107, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 138) కేజీల బరువెత్తిన గణేశ్‌ రెండో స్థానంలో నిలిచాడు. మహారాష్ట్రకు చెందిన కిరణ్‌ రవీంద్ర (251 కేజీలు) స్వర్ణం దక్కించుకోగా.. శివ చౌదరి (ఢిల్లీ, 244 కేజీలు) కాంస్యం నెగ్గాడు. మరోవైపు బాక్సింగ్‌లో రాష్ర్టానికి చెందిన గోనెళ్ల నిహారిక కాంస్య పతకం కైవసం చేసుకుంది. అండర్‌-21 బాలికల 75 కేజీల సెమీఫైనల్లో మణిపూర్‌ బాక్సర్‌ సమాంచ చాను చేతిలో ఓడిన నిహారిక కాంస్యం ఖాతాలో వేసుకుంది. ఖోఖోలో రాష్ట్ర బాలుర జట్టు కాంస్య పతకం గెలిచింది. అండర్‌-17 సెమీఫైనల్లో తెలంగాణ 6-9తో మహారాష్ట్ర చేతిలో ఓటమి పాలైంది. ఈ జట్టులో మంథనికి చెందిన శ్రీరామ్‌, గణేశ్‌.. మానకొండూర్‌కు చెందిన ఉదయ్‌.. మరిపెడకు చెందిన ప్రసాద్‌, వెంకటేశ్‌, మహేశ్‌ టోర్నీ ఆసాంతం సత్తాచాటారు.

ఫైనల్లో సామ సాత్విక

టెన్నిస్‌లో తెలంగాణ ప్లేయర్ల జోరు కొనసాగుతున్నది. అండర్‌-21 బాలికల సెమీస్‌లో సామ సాత్విక 7-5, 6-3తో యుబ్రాని బెనర్జీ (పశ్చిమ బెంగాల్‌)పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. అండర్‌-17 బాలికల క్వార్టర్‌ ఫైనల్లో సంజన సిరిమల్ల 6-4, 6-3తో లక్ష్మీ ప్రభ (తమిళనాడు)పై నెగ్గి సెమీస్‌కు చేరింది. బాలుర సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో తీర్థ శశాంక్‌ 1-6, 1-6తో ధృవ్‌ సునీశ (మహారాష్ట్ర) చేతిలో ఓడితే.. అండర్‌-21 బాలుర సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో సాయి కార్తీక్‌ 5-7, 2-6తో దక్షిణేశ్వర్‌ (తమిళనాడు) చేతిలో పరాజయం పాలయ్యాడు.

పేదింట పుట్టి..

నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన గణేశ్‌ మూడేండ్ల క్రితం వెయిట్‌ లిఫ్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న గణేశ్‌.. చిన్నప్పటి నుంచి బరువులెత్తడంలో మేటిగా నిలుస్తూ వచ్చాడు. ఇది గమనించిన కోచ్‌ మాణిక్యాల రావు అతడిని మరింత మెరుగుదిద్దారు. స్పోర్ట్స్‌ స్కూల్‌లోనే స్వీపర్‌గా పనిచేస్తున్న గణేశ్‌ తల్లి సైదమ్మ.. రెక్కల కష్టంతో కొడుకును ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆశిస్తుంటే.. కన్నతల్లి కన్నీళ్లను అర్థం చేసుకున్న ఆ కుర్రాడు అవలీలగా బరువులెత్తుతూ దూసుకుపోతున్నాడు. సీనియర్‌ నేషనల్స్‌లో మెడల్‌ నెగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్న గణేశ్‌.. దానికోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరింత తోడ్పాటు లభిస్తే.. భవిష్యత్తులో ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తానని అంటున్నాడు.


logo