సోమవారం 30 మార్చి 2020
Sports - Mar 21, 2020 , 23:34:21

సైకిల్‌ సవారి

సైకిల్‌ సవారి

  • జాతీయ స్థాయిలో అదరగొడుతున్న తనిష్క్‌ గౌడ్‌ 
  • సైక్లింగ్‌లో సరికొత్త శిఖరాలకు తెలంగాణ కుర్రాడు

పాఠశాల సెలవుల్లో వేసవి శిబిరానికి వెళ్లిన ఆ కుర్రాడు సైక్లింగ్‌ వైపు ఆకర్షితుడయ్యాడు. అప్పటి వరకు బాస్కెట్‌బాల్‌, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌ అని పరిపరి విధాలుగా ఆలోచించిన ఆ బుడతడి బుర్ర .. సైకిల్‌ దగ్గర ఆగిపోయింది. పన్నెండేండ్ల ప్రాయంలో పైడిల్‌పై కాలు పెట్టిన ఆ చిన్నారి  చూస్తుండగానే జాతీయ స్థాయికి  ఎదిగాడు. వెలోడ్రోమ్‌లో అద్భుతాలు  సృష్టిస్తున్న ఆ టీనేజ్‌ సంచలనమే..  ఎం తనిష్క్‌ గౌడ్‌. అర్హత వయసు రాకముందే  దక్షిణ మధ్య రైల్వే పిలిచిమరీ  ఉద్యోగం ఇచ్చిన తనిష్క్‌ ప్రస్థానంపై  ఓ లుక్కేస్తే.. 

ఆరో తరగతి పూర్తయ్యాక సమ్మర్‌ క్యాంప్‌లో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) వెలోడ్రోమ్‌లో తల్లి వీణతో కలిసి అడుగుపెట్టిన తనిష్క్‌ గౌడ్‌.. సైక్లిస్ట్‌ కావాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా.. తల్లి ప్రోత్సాహంతో ముందుకు సాగిన అతడు ఏడాది తిరిగేలోపు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో లెక్కకు మిక్కిలి పతకాలు సాధించాడు. ఈ క్రమంలో ప్రాక్టీస్‌ సందర్భంగా అతడి కాలికి గాయం కావడం ఆ తల్లి గుండెను కలచివేసింది. పసిప్రాయంలోనే గాయాల బెడద వెంటాడటంతో.. సైక్లింగ్‌కు స్వస్థి పలకాలని కొడుకును కోరింది. అయితే తనిష్క్‌ మాత్రం.. గాయాన్ని లెక్కచేయకుండా మొక్కవోని దీక్షతో ఆరునెలల్లోనే తిరిగి సైకిలెక్కాడు.

మలుపు తిప్పిన గోల్డ్‌మెడల్‌..

గాయం నుంచి కోలుకున్నాక 2017 జనవరిలో జరిగిన జూనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో తనిష్క్‌ స్వర్ణం చేజిక్కించుకున్నాడు. అప్పటి వరకు కొడుకు ప్రతిభపై నమ్మకమున్నా.. ఆటల్లోపడి చదువును అశ్రద్ధ చేస్తాడేమోనని ఆ తల్లి మనసులో ఏమూలో దాగి ఉన్న సంశయాలు కూడా ఈ మెడల్‌తో పటాపంచలయ్యాయి. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకొని తనిష్క్‌.. ఆ ప్రదర్శనతోనే నేషనల్‌ సైక్లింగ్‌ అకాడమీకి ఎంపికయ్యాడు. గత మూడేండ్లుగా ఢిల్లీలో ఉంటూ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న తనిష్క్‌ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 9 పతకాలు కైవసం చేసుకున్నాడు.


ఆసియా చాంపియన్‌షిప్‌నకు అర్హత

అకాడమీలో అతడి ప్రతిభను గుర్తించిన అధికారులు 2019లో ట్రాకింగ్‌ చెకప్‌ నిర్వహించి ఆసియా చాంపియన్‌షిప్‌నకు ఎంపిక చేశారు. ఇది ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ కావడంతో.. 10 కిలోమీటర్ల విభాగంలో కసిదీర సైకిల్‌ తొక్కిన తనిష్క్‌ నాలుగో స్థానంలో నిలిచి తృటిలో 

పతకం చేజార్చుకున్నాడు. ప్రస్తుతానికి మాస్‌ స్టార్ట్‌, పాయింట్‌ రేస్‌ ఈవెంట్‌లపై దృష్టిపెట్టిన తనిష్క్‌.. నేషనల్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించడంతో పాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మెరువడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

తెలంగాణ నుంచి ఒకే ఒక్కడు..

జాతీయ స్థాయి సైక్లింగ్‌ పోటీల్లో మన రాష్ట్రం నుంచి తనిష్క్‌ ఒక్కడే బరిలో ఉన్నాడు. మరో ఐదుగురు సహచరులతో కలిసి జాతీయ జట్టు తరఫున ప్రాక్టీస్‌ చేస్తున్న తనిష్క్‌.. న్యూఢిల్లీలోని ఆంధ్ర ఎడ్యుకేషనల్‌ సొసైటీ నుంచి ఇంటర్‌ పూర్తి చేశాడు. అతడి ప్రతిభను గుర్తించిన దక్షిణ మధ్య (ఎస్‌సీ) రైల్వే అధికారులు అర్హత వయసు లేకున్నా.. నిబంధన లు సడలించి మరీ టీటీఈగా ఉద్యోగం ఇచ్చారు. దీంతో మరింత ఉత్సాహంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

ఆరు గంటలు వేచి ఉండి..

సైక్లింగ్‌ నేషనల్‌ ట్రయల్స్‌లో పాల్గొంటున్న సమయంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్‌) చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి అందించిన సహకారం మరువలేనిదని తనిష్క్‌ పేర్కొన్నాడు. ‘నేను ట్రయల్స్‌లో పాల్గొంటున్న విషయం తెలుసుకున్న సాట్స్‌ చైర్మన్‌.. నన్ను ప్రోత్సహించేందుకు ఢిల్లీకి వచ్చారు. ఆ సమయంలో వెలోడ్రోమ్‌ లోపలికి అనుమతి లేకపోవడంతో ఆరు గంటల పాటు బయటే వేచి ఉండి.. నేను రాగానే హత్తుకొని అభినందించారు. సీనియర్‌ నేషనల్స్‌లో స్వర్ణం సాధిస్తానని ఆయనకు మాటిచ్చా. అందుకు తగ్గట్లే ప్రాక్టీస్‌ చేస్తున్నా’అని తనిష్క్‌ అన్నాడు.

కరోనా వైరస్‌ కారణంగా.. ఢిల్లీలో ప్రత్యేక శిక్షణ నుంచి ఇంటికి వచ్చా. ఈ ఏడాది ఆగస్టులో ఈజిప్ట్‌ వేదికగా జరుగనున్న ప్రపంచ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటే దిశగా ప్రాక్టీస్‌ సాగిస్తున్నా. జూనియర్‌ స్థాయిలో నేషనల్‌ రికార్డు బద్దలు కొట్టా. సీనియర్‌ స్థాయిలోనూ అదే జోరు కొనసాగిస్తాననే నమ్మకముంది. 

- తనిష్క్‌ గౌడ్‌


logo