మంగళవారం 19 జనవరి 2021
Sports - Jan 10, 2021 , 00:40:23

పట్టు చేజారె..

పట్టు చేజారె..

  • ఓటమి కోరల్లో భారత్‌ 
  • భారీ ఆధిక్యం దిశగా ఆస్ట్రేలియా  
  • రెండో ఇన్నింగ్స్‌ 103/2 
  • టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ 244 ఆలౌట్‌ 
  • ఆత్మవిశ్వాసంతో ఆడాల్సిన చోట.. అతి జాగ్రత్తకు పోయిన 

టీమ్‌ఇండియా అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. సిడ్నీ టెస్టులో పైచేయి సాధించే అద్భుత అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకుంది. మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేక పోయిన భారత ఆటగాళ్లు.. ప్రత్యర్థి స్కోరు దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోతే.. మరోసారి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా లక్ష్యాన్ని భారీగా పెంచే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే 197 పరుగుల ఆధిక్యం సాధించిన ఆసీస్‌.. రహానే సేనకు ఆదివారం ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో చూడాలి!

సిడ్నీ: అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్న భారత జట్టు.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో కష్టాల్లో పడింది. బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం వల్ల టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్‌ పుజారా (176 బంతుల్లో 50; 5 ఫోర్లు) కెరీర్‌లోనే అత్యంత నెమ్మదైన అర్ధశతకం నమోదు చేయగా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌కు 4 వికెట్లు దక్కాయి. ముగ్గురు భారత ఆటగాళ్లు రనౌట్‌ కావడం గమనార్హం. అనంతరం 94 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో శనివారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. చేతిలో 8 వికెట్లు ఉన్న ఆసీస్‌ ఓవరాల్‌గా 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. లబుషేన్‌ (47), స్మిత్‌ (29) క్రీజులో ఉన్నారు. నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం కష్టం కావడంతో లక్ష్యం 300 పరుగులు దాటితే టీమ్‌ఇండియా విజయావకాశాలు దాదాపు దూరమైనట్లే!

స్మిత్‌, లబుషేన్‌ మరోసారి..

రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ తన మూడో ఓవర్‌లో పకోస్కీ (10)ని ఔట్‌ చేయగా.. అశ్విన్‌ తొలి ఓవర్‌లోనే వార్నర్‌ (13)ను డగౌట్‌ బాట పట్టించాడు. దీంతో ఆసీస్‌ 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తొలి ఇన్నింగ్స్‌ హీరోలు స్మిత్‌, లబుషేన్‌ అదరగొట్టారు. వేగంగా పరుగులు రాబడుతూ ఆధిక్యాన్ని పెంచారు. అభేద్యమైన మూడో వికెట్‌కు ఈ జంట 68 పరుగులు జోడించింది.

ఒత్తిడికి చిత్తు..

ఓవర్‌నైట్‌ స్కోరు 96/2తో శనివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత జట్టు మరీ నెమ్మదిగా ఆడింది. రన్‌రేట్‌ పెంచే ఒత్తిడిలో రహానే (22) ఔట్‌ కాగా.. విహారి (4) సింగిల్స్‌ తీసేందుకు కూడా తీవ్రంగా ఇబ్బందిపడ్డాడు. చివరకు లేని పరుగుకు ప్రయత్నించి హజిల్‌వుడ్‌ వేసిన సూపర్‌ త్రోకు వికెట్‌ సమర్పించుకున్నాడు. ఈ దశలో పంత్‌ (36) కాసేపు పుజారాకు అండగా నిలిచాడు. వీరిద్దరు కుదురుకోవడంతో ఒక దశలో భారత్‌ 195/4తో మెరుగైన స్థితిలో కనిపించింది. అయితే వరుస ఓవర్లలో వీరు ఔట్‌ కావడంతో భారత్‌ కష్టాల్లో పడింది. ఆ తర్వాత అశ్విన్‌ (10), సైనీ (3), బుమ్రా (0) పెవిలియన్‌కు వరుస కట్టగా.. సిరాజ్‌ (6) అండతో రవీంద్ర జడేజా (28 నాటౌట్‌; 5 ఫోర్లు) కొన్ని విలువైన పరుగులు జతచేశాడు. 

స్కోరు బోర్డు

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 338, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి అండ్‌ బి) హజిల్‌వుడ్‌ 26, గిల్‌ (సి) గ్రీన్‌ (బి) కమిన్స్‌ 50, పుజారా (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 50, రహానే (బి) కమిన్స్‌ 22, విహారి (రనౌట్‌) 4, పంత్‌ (సి) వార్నర్‌ (బి) హజిల్‌వుడ్‌ 36, జడేజా (నాటౌట్‌) 28, అశ్విన్‌ (రనౌట్‌) 10, సైనీ (సి) వేడ్‌ (బి) స్టార్క్‌ 3, బుమ్రా (రనౌట్‌) 0, సిరాజ్‌ (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 6, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 244 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-70, 2-85, 3-117, 4-142, 5-195, 6-195, 7-206, 8-210, 9-216, 10-244, బౌలింగ్‌: స్టార్క్‌ 19-7-61-1, హజిల్‌వుడ్‌ 21-10-43-2, కమిన్స్‌ 21.4-10-29-4, లియాన్‌ 31-8-87-0, లబుషేన్‌ 3-0-11-0, గ్రీన్‌ 5-2-11-0.

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: వార్నర్‌ (ఎల్బీ) అశ్విన్‌ 13, పకోస్కీ (సి) (సబ్‌) సాహా (బి) సిరాజ్‌ 10, లబుషేన్‌ (నాటౌట్‌) 47, స్మిత్‌ (నాటౌట్‌) 29, ఎక్స్‌ట్రాలు: 4, మొత్తం: 103/2. వికెట్ల పతనం: 1-16, 2-35, బౌలింగ్‌: బుమ్రా 8-1-26-0, సిరాజ్‌ 8-2-20-1, సైనీ 7-1-28-0, అశ్విన్‌ 6-0-28-1

జడేజా ఔట్‌..


ఆసీస్‌ పర్యటనలో టీమ్‌ఇండియాను గాయాల బెడద వీడేలా లేదు. ఇప్పటికే షమీ, ఉమేశ్‌, రాహుల్‌ గాయాల కారణంగా సిరీస్‌కు దూరం కాగా.. ఇప్పుడు తాజాగా రవీంద్ర జడేజా ఆ జాబితాలో చేరాడు. శనివారం రెండో సెషన్‌లో బ్యాటింగ్‌ చేస్తుండగా.. స్టార్క్‌ బంతి జడ్డూ ఎడమ చేతి బొటనవేలును బలంగా తాకింది. దీంతో ఇన్నింగ్స్‌ ముగిసిన అనంతరం జడేజాకు స్కానింగ్‌ చేయించగా.. ఎముక పక్కకు జరిగినట్లు తేలింది. దీంతో అతడు ఈ మ్యాచ్‌తో పాటు బ్రిస్బేన్‌ వేదికగా జరుగనున్న నాలుగో టెస్టుకు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఇక కమిన్స్‌ బౌలింగ్‌లో గాయపడ్డ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేస్తాడని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. 

పుష్కర కాలం తర్వాత..

ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌ రనౌట్‌ కావడం 12 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. 2008లో (ఇంగ్లండ్‌పై మొహాలీలో) సెహ్వాగ్‌, లక్ష్మణ్‌, యువరాజ్‌ రనౌట్‌గా వెనుదిరిగారు.