గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 18, 2020 , 01:23:02

టెస్టులపైనే నజర్‌

టెస్టులపైనే నజర్‌

ఎర్ర బంతితో ప్రాక్టీస్‌ చేస్తున్న టీమ్‌ఇండియా

సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమ్‌ఇండియా తొలుత పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడాల్సి ఉన్నా.. కోహ్లీ సేన మాత్రం సుదీర్ఘ ఫార్మాట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నది. రెండు నెలలుగా ఐపీఎల్‌ మ్యాచ్‌లతో బిజీగా ఉన్న ఆటగాళ్లు.. ఎర్ర బంతిని ఎదుర్కోక ఎక్కువ కాలం అవడంతో మొదట టెస్టు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. దుబాయ్‌ నుంచి నేరుగా ఆసీస్‌ చేరుకున్న టీమ్‌ఇండియా క్వారంటైన్‌లో ఉంటూనే సాధన చేస్తున్నది. ఈ నెల 27న మొదలయ్యే పర్యటనలో తొలుత 3 వన్డేలు ఆ తర్వాత 3 టీ20లు ఆడనున్న భారత్‌.. డిసెంబర్‌ 17న తొలి టెస్టు బరిలోకి దిగనుంది. సంప్రదాయ ఫార్మాట్‌ ప్రారంభానికి నెల రోజుల గడువు ఉన్నా.. కోహ్లీ సేన మాత్రం ఇప్పటి నుంచే దానిపై దృష్టి సారించింది. గత (2018-19) పర్యటనలో తొలిసారి ఆసీస్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకుని చరిత్ర సృష్టించిన టీమ్‌ఇండియా.. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీని నిలబెట్టుకునేందుకు ఇప్పటి నుంచే చెమటోడుస్తున్నది.

సిరాజ్‌ బౌలింగ్‌లో కోహ్లీ ప్రాక్టీస్‌..

హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో మంగళవారం విరాట్‌ ప్రాక్టీస్‌ చేశాడు. అయితే ఎప్పట్లా నెట్స్‌లోకాకుండా.. ప్రధాన పిచ్‌పైన టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌ కొనసాగుతున్నది. అచ్చం మ్యాచ్‌ను తలపించేలా నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌ను ఉంచి మనవాళ్లు సాధన చేశారు. పరిమిత ఓవర్ల ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తుండగా.. సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ అసలు పిచ్‌పైనే షాట్లు ఆడారు. సిరాజ్‌, షమీ బౌలింగ్‌ను ఎదుర్కొంటున్న వీడియోను కోహ్లీ ట్విట్టర్‌లో పంచుకున్నాడు. ‘టెస్ట్‌ క్రికెట్‌ సెషన్స్‌ను ఎంతో ప్రేమిస్తా’ అని ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చాడు. సిరీస్‌లో తొలి టెస్టు అనంతరం విరాట్‌ పితృత్వ సెలవులపై భారత్‌కు తిరిగి రానున్న విషయం తెలిసిందే.  

గులాబీ బంతితో..

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌.. డే అండ్‌ నైట్‌ టెస్ట్‌తో ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత ఆటగాళ్లు గులాబీ బంతిని ఎదుర్కొనేందుకు కసరత్తులు చేస్తున్నారు. లోకేశ్‌ రాహుల్‌ గులాబీ బంతితో ప్రా క్టీస్‌ చేస్తుంటే.. షమీ, సిరాజ్‌ బంతిపై ప ట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరు విరాట్‌కు బంతులేస్తున్న వీడియోను ట్వీట్‌ చేసిన బీసీసీఐ ‘ప్రాక్టీస్‌లో నిమగ్నమైన గురు శిష్యులు’ అని వ్యాఖ్య జోడించింది. పుల్‌షాట్లకు పదును పెంచుకునేందుకు అశ్విన్‌ సహకారంతో టెన్నిస్‌ బంతులతో ప్రాక్టీస్‌ చేసిన లోకేశ్‌ రాహుల్‌ తొలి టెస్టు లో చోటు దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.