ఆదివారం 24 జనవరి 2021
Sports - Jan 11, 2021 , 12:42:28

టీమిండియా అసాధార‌ణ పోరాటం.. సిడ్నీ టెస్ట్ డ్రా

టీమిండియా అసాధార‌ణ పోరాటం.. సిడ్నీ టెస్ట్ డ్రా

సిడ్నీ: ఆస్ట్రేలియా బౌల‌ర్లు బౌన్స‌ర్ల‌తో బెంబేలెత్తించినా.. చుట్టూ ఫీల్డ‌ర్ల‌ను మోహ‌రించి ఒత్తిడి పెంచాల‌ని చూసినా.. విసుగెత్తి బంతుల‌ను విసిరికొట్టినా.. మాట‌ల‌తో వేధించినా.. చిల్ల‌ర చేష్ట‌ల‌తో బ్యాట్స్‌మ‌న్ గార్డ్‌ను చెరిపేసినా.. టీమిండియా బ్యాట్స్‌మెన్ అసాధార‌ణ పోరాటం చేశారు. సిడ్నీ టెస్ట్‌ను డ్రాగా ముగించారు. క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో నాలుగో ఇన్నింగ్స్‌లో ఏకంగా 131 ఓవ‌ర్ల పాటు పోరాడిన తీరును మెచ్చుకోకుండా ఉండ‌లేము. రిష‌బ్ పంత్(97) అటాకింగ్ ఇన్నింగ్స్‌కు తోడు.. పుజారా(77), విహారి(23 నాటౌట్‌), అశ్విన్(39 నాటౌట్‌) ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియా ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాయి. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ కంగారూ బౌల‌ర్లు చెమ‌టోడ్చినా ఫ‌లితం లేకుండా పోయింది. విహారి, అశ్విన్ చెక్కు చెద‌ర‌ని ఏకాగ్ర‌త‌, దృఢ‌సంక‌ల్పం ముందు ఆసీస్ బౌల‌ర్లు త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. ఈ ఇద్ద‌రూ ఆరో వికెట్‌కు 258 బంతులాడి 62 ప‌రుగులు జోడించ‌డం విశేషం. విహారి అయితే ఏకంగా 161 బంతులాడి 23 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా.. అశ్విన్ 128 బంతుల్లో 39 ప‌రుగులు చేశాడు. దాదాపు అసాధ్య‌మ‌నుకున్న మ్యాచ్‌లో ర‌హానే సేన డ్రాతో గ‌ట్టెక్కిన తీరు ఓ అద్భుత‌మనే చెప్పాలి. కీల‌క‌మైన స‌మ‌యంలో ఆసీస్ ఫీల్డ‌ర్లు క్యాచ్‌లు జార‌విడ‌వ‌డం కూడా ఇండియ‌న్ టీమ్‌కు క‌లిసొచ్చింది. ముందున్న‌ది కొండంత ల‌క్ష్యం.. రెండు టెస్టుల‌కు ముందే ఇదే టీమ్‌ను 36 ప‌రుగుల‌కే కుప్ప‌కూల్చిన బౌలింగ్ లైన‌ప్‌.. అయినా టీమిండియా బ్యాట్స్‌మెన్ బెద‌ర‌లేదు. చెక్కుచెద‌ర‌ని ఏకాగ్ర‌త‌, ఆత్మ‌విశ్వాసంతో క్రీజులో పాతుకుపోయి మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. మ్యాచ్ డ్రాగా ముగిసే స‌మ‌యానికి టీమిండియా 5 వికెట్ల‌కు 334 ప‌రుగులు చేసింది. ఈ డ్రాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో రెండు టీమ్స్ స‌మ‌వుజ్జీలుగా ఉన్నాయి. 1979 త‌ర్వాత టీమిండియా చివ‌రి ఇన్నింగ్స్‌లో ఇన్ని ఓవ‌ర్ల పాటు ఆడి మ్యాచ్‌ను డ్రాగా ముగించ‌డం ఇదే తొలిసారి. 

వాహ్‌.. పంత్‌

నాలుగో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి టీమిండియా స్కోరు 2 వికెట్ల‌కు 98 ప‌రుగులు. రోహిత్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్ పెవిలియ‌న్ చేరారు. చివ‌రి రోజు వ‌చ్చీ రాగానే కెప్టెన్ ర‌హానే (4) కూడా ఔట‌య్యాడు. ఈ ప‌రిస్థితుల్లో గ‌త అనుభ‌వాల‌ను నెమ‌రేసుకున్న అభిమానులు.. టీమిండియా పోరాటం ఇక ఎక్కువ సేపు ఉండ‌ద‌న్న అంచ‌నాకు వ‌చ్చారు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ రిష‌బ్ పంత్.. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌పై విరుచుప‌డ్డాడు. మొద‌ట్లో ఆచితూచి ఆడిన పంత్ త‌ర్వాత చెల‌రేగాడు. ముఖ్యంగా స్పిన్న‌ర్ నేథ‌న్ ల‌య‌న్ ల‌క్ష్యంగా సిక్స‌ర్లతో హోరెత్తించాడు. పుజారాతో క‌లిసి నాలుగో వికెట్‌కు 148 ప‌రుగులు జోడించి టీమిండియాకు మ్యాచ్ డ్రాపై ఆశ‌లు రేకెత్తించాడు. అయితే టెస్టుల్లో మూడో సెంచ‌రీకి కేవ‌లం మూడు ప‌రుగుల దూరంలో ఔట‌య్యాడు. 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో పంత్ 97 ప‌రుగులు చేశాడు. కాసేప‌టికే పుజారా (77) కూడా హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔట్ కావ‌డంతో టీమిండియా గ‌ట్టెక్కుతుందా అన్న అనుమానాలు క‌లిగాయి. 

మ్యాచ్‌కే హైలైట్‌.. విహారి, అశ్విన్ పార్ట్‌న‌ర్‌షిప్‌

అయితే విహారి, అశ్విన్ చివ‌రి సెష‌న్‌లో ఆసీస్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్న తీరు మ్యాచ్‌కే హైలైట్ అని చెప్ప‌వ‌చ్చు. చివ‌రి సెష‌న్‌లో 36 ఓవ‌ర్ల పాటు ఆసీస్ బౌల‌ర్ల‌కు విసుగు తెప్పించేలా వికెట్ల‌కు అడ్డుగోడ‌లా నిలిచారు. ప‌రుగుల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసి కేవ‌లం క్రీజులో పాతుకుపోవ‌డానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఓవైపు ఓవ‌ర్లు క‌రిగి పోతూ ఉంటే.. ఆస్ట్రేలియా బౌల‌ర్లు, ఫీల్డ‌ర్ల‌లో దాని తాలూకు అస‌హ‌నం స్ప‌ష్టంగా క‌నిపించింది. 


ఇవి కూడా చ‌ద‌వండి

సిడ్నీ టెస్ట్‌లో రిష‌బ్ పంత్ అరుదైన రికార్డు

స్టీవ్ స్మిత్ చిల్ల‌ర చేష్ట‌లు.. ఫ్యాన్స్ సీరియ‌స్‌.. వీడియో

ఎయిరిండియా మహిళా పైలట్ల అరుదైన ఘనత

సానియా మీర్జా భ‌ర్త‌కు త‌ప్పిన ప్ర‌మాదం


logo