మంగళవారం 07 ఏప్రిల్ 2020
Sports - Feb 03, 2020 , 03:20:58

టీమ్‌ఇండియా నయా చరిత్ర

టీమ్‌ఇండియా నయా చరిత్ర

పొట్టి ఫార్మాట్‌లో కివీస్‌ గడ్డపై ఇప్పటివరకు ఒక్క సిరీస్‌ గెలువని టీమ్‌ఇండియా ఈసారి విశ్వరూపం కనబరిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను అజేయంగా ముగించి ప్రత్యర్థిని వైట్‌వాష్‌ చేసింది. కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్‌ శర్మ (41 బంతుల్లో 60; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో అదరగొడితే.. లోకేశ్‌ రాహుల్‌ (33 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్వితీయ ఫామ్‌ కొనసాగించాడు. ఫలితంగా మొదట భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. గత రెండు మ్యాచ్‌ల్లో సూపర్‌ ఓవర్‌లో ఓటమి పాలైన న్యూజిలాండ్‌ ఆఖరి పోరులోనూ ఒత్తిడికి చిత్తైంది. చేతిలో 7 వికెట్లు ఉన్న దశలో 48 బంతుల్లో 51 పరుగులు చేయలేక చతికిలబడింది.

  • టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌ను 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌
  • 5-0తో సిరీస్‌ కైవసం.. బెంబేలెత్తించిన బుమ్రా.. రాణించిన రోహిత్‌, రాహుల్‌

ఒక్కసారి చేస్తే దాన్ని అద్భుతం అంటాం..రెండు సార్లు చేస్తే అద్వితీయం అనొచ్చు.. మరి ముచ్చటగా మూడోసారి కూడా ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తే దాన్నేమనాలి..? ఇంకేమంటాం టీమ్‌ఇండియా ఆధిపత్యం అనడం తప్ప..మొదట బ్యాట్‌తో తక్కువ పరుగులే చేసినా..  ఆ తర్వాత బంతితో మాయ చేస్తూ.. భారత జట్టు పాంచ్‌ పటాకా మోగించింది. 


టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న ఈ ఏడాదిలో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమ్‌ఇండియా బెంచ్‌ పరీక్ష కూడా పూర్తి చేసుకొని నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌లా దూసుకెళ్తుంటే.. కివీస్‌ మాత్రం చివర్లో చేతులెత్తేసే తమ బలహీనతను ఒకటికి మూడుసార్లు బయటపెట్టుకుంది. ఒత్తిడిని జయించడంలో విఫలమవుతున్న న్యూజిలాండ్‌ మరోసారి నిరాశ పరుస్తూ.. సొంతగడ్డపై జరిగిన పొట్టి సిరీస్‌లో విజయం లేకుండానే ముగించింది. బుమ్రా బుల్లెట్‌ యార్కర్‌లకు శార్దూల్‌, సైనీ సహకారం తోడవడంతో న్యూజిలాండ్‌ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్‌ను ఒడిసిపట్టిన విరాట్‌ గ్యాంగ్‌ ఇక వన్డే వార్‌కు రెడీ అయిపోయింది.

మౌంట్‌మాంగనీ: ప్రహసనం ముగిసింది. క్లీన్‌స్వీప్‌ కల నెరవేరింది. గత నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గి జోరు మీదున్న భారత జట్టు అదే ఊపులో ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి 5-0తో న్యూజిలాండ్‌ను వైట్‌వాష్‌ చేసింది. ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశం లేదంటూ సిరీస్‌ ప్రారంభించిన టీమ్‌ఇండియా.. వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఎదురైన ఓటమికి గట్టిగా బదులిచ్చింది. ఇప్పటి వరకు విదేశాల్లో భారత్‌ కేవలం రెండు సార్లు (2016లో ఆస్ట్రేలియాను 3-0తో, 2019లో వెస్టిండీస్‌ను 3-0తో) మాత్రమే ప్రత్యర్థిని వైట్‌ వాష్‌ చేయగా.. ఇది మూడోసారి. ఆదివారం జరిగిన ఐదో టీ20లో సమిష్టిగా కదంతొక్కిన టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఫుల్‌ఫామ్‌లో ఉన్న లోకేశ్‌ రాహుల్‌ (33 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (41 బంతుల్లో 60; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి అదరగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులకే పరిమితమైంది. సీఫర్ట్‌ (30 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), టేలర్‌ (47 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించారు. బుమ్రా (3/12), సైనీ (2/23), శార్దూల్‌ (2/38) ధాటికి న్యూజిలాండ్‌ మరోసారి ఒత్తిడికి లోనై అలవోకగా నెగ్గాల్సిన మ్యాచ్‌ను భారత్‌కు అప్పగించింది. బుమ్రాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌', రాహుల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.

దుమ్మురేపిన బుమ్రా..స్వల్ప లక్ష్యఛేదన ఆరంభంలోనే న్యూజిలాండ్‌ 17/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. గప్టిల్‌ (2), బ్రూస్‌ (0) పూర్తిగా విఫలమైతే.. అచ్చొచ్చిన పిచ్‌పై మున్రో (15) ఆకట్టుకోలేకపోయాడు. ఈ దశలో సీఫర్ట్‌, టేలర్‌ కివీస్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ వరుస బౌండ్రీలతో విజృంభించడంతో.. ఆ జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి 113/3తో నిలిచింది. ఇక విజయానికి 48 బంతుల్లో 51 పరుగులు కావాలి. ఇంకేముంది, కివీస్‌ బోణీ చేసినట్లే అని అంతా అనుకున్నారు. కానీ చివరి వరకు పట్టు సడలించని టీమ్‌ఇండియా అద్భుతం చేసి చూపించింది. నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించాక సీఫర్ట్‌ను ఔట్‌ చేసి సైనీ బ్రేక్‌ ఇస్తే.. బుమ్రా పర్ఫెక్ట్‌ యార్కర్‌తో డారిల్‌ (2)ను వెనక్కి పంపాడు. ఒత్తిడిలో పడ్డ కివీస్‌పై శార్దూల్‌ తన తడాఖా కొనసాగించాడు. ఒకే ఓవర్‌లో శాంట్నర్‌ (6), కుగ్‌లిన్‌ (0)ను పెవిలియన్‌ బాట పట్టించాడు. వందో మ్యాచ్‌ ఆడుతున్న టేలర్‌ అద్భుతాలు చేస్తాడమే అనుకుంటే.. అతడిని కూడా సైనీ బుట్టలో వేసుకున్నాడు. అంతే మ్యాచ్‌ మన చేతుల్లోకి వచ్చేసింది. ఆఖర్లో సోధి (16 నాటౌట్‌) రెండు సిక్సర్లు కొట్టినా అప్పటికే ఆలస్యమైపోయింది.

రోహిత్‌, రాహుల్‌ రాక్స్‌..


అంతకుముందు విరాట్‌ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడంతో రోహిత్‌ శర్మ సారథ్యంలో బరిలో దిగిన టీమ్‌ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. శాంసన్‌ (2) మరోసారి నిరాశపరచగా.. రాహుల్‌ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. సౌథీ వేసిన మూడో ఓవర్‌లో 6,4,4 బాదిన లోకేశ్‌.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రోహిత్‌ కూడా చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ ప్లే ముగిసే సరికి టీమ్‌ఇండియా 53/1తో నిలిచింది. రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించాక రాహుల్‌ ఔటయ్యాడు. అనంతరం అయ్యర్‌ (31 బంతుల్లో 33 నాటౌట్‌; 1 ఫోర్‌, 2 సిక్సర్లు)తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే అర్ధశతకం పూర్తి చేసుకున్నాక కండరాలు పట్టేయడంతో రోహిత్‌ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. చివర్లో అయ్యర్‌ కాస్త నెమ్మదించగా.. దూబే (5) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆఖరి ఓవర్‌లో మనీశ్‌ పాండే (4 బంతుల్లో 11నాటౌట్‌) 6,4 బాదడంతో భారత్‌ ఆమాత్రం స్కోరు చేసింది.

ఒకే ఓవర్‌లో 34 పరుగులు

శివం దూబే వేసిన పదో ఓవర్‌లో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ పండుగ చేసుకున్నారు. తొలి మూడు బంతుల్లో 6,6,4 బాదిన సీఫర్ట్‌ నాలుగో బంతికి సింగిల్‌ తీశాడు.. ఐదో బంతి నోబాల్‌ కాగా దాన్ని టేలర్‌ బౌండ్రీకి తరలించాడు. చివరి రెండు బంతులనూ టేలర్‌ భారీ సిక్సర్లుగా మలచడంతో మొత్తంగా ఆ ఓవర్‌లో 34 పరుగులు వచ్చాయి. దీంతో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్‌గా స్టువర్ట్‌ బిన్నీ (32; వెస్టిండీస్‌తో) పేరిట ఉన్న చెత్త రికార్డును దూబే సవరించాడు. కండరాలు పట్టేయడంతో రోహిత్‌ స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌.. ఈ దెబ్బతో దూబేకు మరోసారి బంతి ఇవ్వలేదు.

స్కోరు బోర్డు

భారత్‌: రాహుల్‌ (సి) శాంట్నర్‌ (బి) బెనెట్‌ 45, శాంసన్‌ (సి) శాంట్నర్‌ (బి) కుగ్‌లిన్‌ 2, రోహిత్‌ (రిటైర్డ్‌హర్ట్‌) 60, అయ్యర్‌ (నాటౌట్‌) 33, దూబే (సి) బ్రూస్‌ (బి) కుగ్‌లిన్‌ 5, పాండే (నాటౌట్‌) 11, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 163/3. వికెట్ల పతనం: 1-8, 2-96, 3-148, బౌలింగ్‌: సౌథీ 4-0-52-0, కుగ్‌లిన్‌ 4-0-25-2, బెనెట్‌ 4-0-21-1, సోధి 4-0-28-0, శాంట్నర్‌ 4-0-36-0.

న్యూజిలాండ్‌: గప్టిల్‌ (ఎల్బీ) బుమ్రా 2, మున్రో (బి) సుందర్‌ 15, సీఫర్ట్‌ (సి) శాంసన్‌ (బి) సైనీ 50, బ్రూస్‌ (రనౌట్‌) 0, టేలర్‌ (సి) రాహుల్‌ (బి) సైనీ 53, డారిల్‌ (బి) బుమ్రా 2, శాంట్నర్‌ (సి) పాండే (బి) శార్దూల్‌ 6, కుగ్‌లిన్‌ (సి) సుందర్‌ (బి) శార్దూల్‌ 0, సౌథీ (బి) బుమ్రా 6, సోధి (నాటౌట్‌) 16, బెనెట్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 20 ఓవర్లలో 156/9. వికెట్ల పతనం: 1-7, 2-17, 3-17, 4-116, 5-119, 6-131, 7-132, 8-133, 9-141, బౌలింగ్‌: సుందర్‌ 3-0-20-1, బుమ్రా 4-1-12-3, సైనీ 4-0-23-2, శార్దూల్‌ 4-0-38-2, చాహల్‌ 4-0-28-0, దూబే 1-0-34-0. 

ఏకపక్ష విజయాల కంటే.. ఇలాంటి హోరాహోరీ మ్యాచ్‌లు మజానిస్తాయి. గత రెండు మూడేండ్లుగా భారత జట్టు ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకునేందుకు ముందుంటున్నారు. అందుకు తగ్గ ఫలితాలు వస్తున్నాయి. ఇదే జోరును మున్ముందు కూడా కొనసాగించాలనుకుంటున్నాం. బౌండ్రీ వద్ద విలియమ్సన్‌తో కలిసి కూర్చొని మ్యాచ్‌ను వీక్షించడం భిన్నమైన అనుభూతినిచ్చింది. కేన్‌, నేను ఒకే విధంగా ఆలోచిస్తాం. ప్రపంచంలోని రెండు భిన్న ధృవాలకు చెందిన వాళ్లం ఇలా ఉండటం అరుదే. అతడు కివీస్‌ జట్టును చక్కగా నడిపిస్తున్నాడు.

 - కోహ్లీ, భారత కెప్టెన్‌


మరోసారి విజయానికి చేరువగా వచ్చి చతికిలబడ్డాం. మ్యా చ్‌ చేతుల్లోకి వచ్చిందనుకున్న తరుణంలో అనవసర తప్పిదాల తో టీమ్‌ఇండియాకు అవకాశాలు ఇచ్చాం. దాన్ని వారు ఏమాత్రం వదల్లేదు. టీ20తో పోల్చుకుంటే వన్డే ఫార్మాట్‌ భిన్నమైనది. ఇక దానిపై దృష్టిపెడుతాం. 

- సౌథీ, న్యూజిలాండ్‌ తాత్కాలిక కెప్టెన్‌


సరదాగా కాసేపు..ఆఖరి టీ20లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇరు జట్ల సారథులు.. విరాట్‌ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌ బౌండ్రీ వద్ద కూర్చొని మ్యాచ్‌ను వీక్షించడం అభిమానులను కట్టిపడేసింది. గాయం కారణంగా కేన్‌ ఈ మ్యాచ్‌కు దూరమైతే.. వరుస మ్యాచ్‌లు ఆడుతున్న కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు.


1ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రాహుల్‌ (224) టాప్‌కు చేరాడు. కోహ్లీ (199) రెండో స్థానంలో ఉన్నాడు. 
3అంతర్జాతీయ టీ20ల్లో వంద మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో ప్లేయర్‌గా రాస్‌ టేలర్‌ నిలిచాడు. షోయబ్‌ మాలిక్‌ (113), రోహిత్‌ శర్మ (107) ముందున్నారు.
1న్యూజిలాండ్‌ గడ్డపై టీమ్‌ఇండియా టీ20  సిరీస్‌ దక్కించుకోవడం  ఇదే తొలిసారి. 
logo