గురువారం 26 నవంబర్ 2020
Sports - Nov 05, 2020 , 19:13:13

అతడి పేరు చెబితే రికార్డులు వణికిపోవాల్సిందే..

అతడి పేరు చెబితే రికార్డులు వణికిపోవాల్సిందే..

చురుకైన చూపు.. చెదరని చిరునవ్వుకు కేరాఫ్‌ అడ్రస్‌ అతడు..

అతడి పేరు చెబితే రికార్డులు వణికిపోతాయి..

బరిలో దిగాడంటే ప్రత్యర్థులు నీరుగారిపోతారు..

అతనే టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ మూలవిరాట్‌.. విరాట్‌ కోహ్లీ 


ఇప్పటికే అభినవ సచిన్‌ అనిపించుకుంటున్న మన ‘కింగ్‌'.. సమీప భవిష్యత్తులో మాస్టర్‌ బ్లాస్టర్‌ రికార్డులను చెరిపేయడం ఖాయం అనే వాదనల నడుమ ఓసారి ఆ లెక్కలు పరిశీలిస్తే..


రెండు తరాలకు చెందిన ఆటగాళ్ల మధ్య పోలిక సరైంది కాకున్నా.. అభిమానుల మనసులు గెలుచుకున్న వీరిద్దరి మధ్య అనేక సారుప్యతలు కనిపిస్తాయి. 32 ఏండ్లకే ‘రన్‌ మెషీన్‌', ‘రికార్డుల రారాజు’, ‘కింగ్‌ కోహ్లీ’ అనే బిరుదులు సొంతంచేసుకున్న విరాట్‌.. తన ఆరాధ్య దైవం సచిన్‌ టెండూల్కర్‌ బాటలోనే అడుగులు వేస్తున్నాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన రోజు సచిన్‌ పాజీని తన భుజాలపై ఎత్తుకొని మైదానంలో కలియతిప్పిన ఈ చిన్నోడు.. పదేళ్లు తిరుగక ముందే మాస్టర్‌ రికార్డులకు ఎసరు తెచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం సచిన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మీ రికార్డులు ఎవరు బద్దలు కొడతారనుకుంటున్నారు’ అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘రికార్డులు ఉన్నవే బద్దలు కొట్టేందుకు. ఎవరో ఒకరు వాటిని అధిగమిస్తారని తెలుసు. అయితే అది భారతీయ ఆటగాళ్లే అయితే చాలా సంతోషిస్తా.. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మకు ఆ సత్తా ఉంది’ అని అన్నాడు. ఆ మాటలను నిజం చేస్తూ విరాట్‌ విజృంభిస్తున్నాడు.వన్డేల్లో చిరుతలా..

సచిన్‌ కెరీర్‌లో 463 వన్డేలు ఆడితే.. విరాట్‌ ఇప్పటి వరకు 248 మ్యాచ్‌లు ఆడాడు. మాస్టర్‌ ఖాతాలో 18,426 పరుగులు ఉంటే.. కోహ్లీ ఇప్పటికే 11,867 పరుగులతో దూసుకెళ్తున్నాడు. ఇక సెంచరీల విషయానికి వస్తే.. విరాట్‌ ఇదే జోరులో దూసుకెళ్తే.. మరో రెండేండ్లలోనే వన్డే సెంచరీల్లో సచిన్‌ను మించిపోయే చాన్స్‌ ఉంది. టెండూల్కర్‌ ఖాతాలో 49 శతకాలు ఉంటే.. కోహ్లీ 43తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఛేజింగ్‌లో విరాట్‌ గణాంకాలను పరిశీలిస్తే.. అతడు క్రికెట్‌ చరిత్రలోనే ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.టెస్టుల్లో కాస్త కష్టమే..

ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీ 200 టెస్టు మ్యాచ్‌లు ఆడుతాడా అనేది అనుమానమే అయినా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పోల్చుకుంటే సుదీర్ఘ ఫార్మాట్‌లో విరాట్‌ జోరు కాస్త తక్కువే అని చెప్పొచ్చు. కెరీర్‌ ఆరంభంలోఇబ్బంది పడ్డ అతడు ఇటీవలి కాలంలో ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగిపోతున్నాడు. మూడు ఫార్మాట్‌లలో 50 సగటు ఉన్న ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అయితే సచిన్‌ తరంలో టెస్టు క్రికెట్‌కు ఉన్న విలువతో పోల్చుకుంటే ప్రస్తుతం ఆ స్థాయి ఆదరణ లేకపోవడంతో టెస్టు క్రికెట్‌లో మాస్టర్‌ (51) అత్యధిక సెంచరీల రికార్డు చెక్కుచెదరకపోవచ్చు. కోహ్లీతో పార్టీ చేసుకుంటా: సచిన్‌

ఓవరాల్‌గా చూసుకుంటే ప్రస్తుతం సచిన్‌ 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉంటే.. కోహ్లీ (70) మూడో ప్లేస్‌లో ఉన్నాడు. మరొక్క శతంక సాధిస్తే.. రికీ పాంటింగ్‌ (71) సరసన చేరుతాడు. ప్రస్తుతం ఉన్న ఊపులో మరో మూడు నాలుగేండ్లలోనే సచిన్‌ శతకాల రికార్డును విరాట్‌ తన పేరిట రాసుకునే చాన్స్‌లు ఉన్నాయి. వన్డేల్లో తన అత్యధిక శతకాల రికార్డును బద్దలు కొట్టిన రోజు విరాట్‌తో కలిసి షాంపైన్‌ పార్టీ చేసుకుంటా అని సచిన్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ అచ్చొచ్చేనా..

టీమ్‌ఇండియా తరఫున దుమ్మురేపుతున్న విరాట్‌కు ఫ్రాంచైజీ క్రికెట్‌లో మాత్రం అదృష్టం కలిసిరావడం లేదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో కోహ్లీ సారథ్యం వహిస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ ముద్దాడలేకపోయింది. కరోనా విపత్కర పరిస్థితుల మధ్య ప్రస్తుతం దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మెగా లీగ్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన బెంగళూరు ఈ సారైనా కప్‌ గెలువాలని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్‌డే విరాట్‌..


- స్పోర్ట్స్‌ డెస్క్‌


  


కోహ్లీ  
టెండూల్కర్‌
వన్డేలు  
 248  463
పరుగులు
11867
18426
సెంచరీలు
43   
49
టెస్టులు
86
200
పరుగులు 
7240 
15921
సెంచరీలు      
27             
51