మూడో వన్డేలో గెలిచిన టీమిండియా

క్యాన్బెరా: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా విజయం సాధించింది. తొలి రెండు వన్డేల్లో దారుణంగా ఓడిన కోహ్లి సేన.. చివరిదైన మూడో వన్డేలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఓదార్పు విజయాన్ని సొంతం చేసుకుంది. 13 పరుగులతో గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి పరిమితం చేయగలిగింది. చివరి వరకు పోరాడిన ఆసీస్ 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. బ్యాటింగ్‌లో పాండ్యా, జడేజా మెరుపులు.. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, నటరాజన్ రాణించడంతో ఈ విజయం సాధ్యమైంది. కళ్లు చెదిరే షాట్లతో మరోసారి మ్యాక్స్‌వెల్ భయపెట్టినా.. కీలకమైన సమయంలో అతన్ని పెవిలియన్‌కు పంపించి మ్యాచ్‌ను భారత్ వైపు మలుపుతిప్పాడు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. మ్యాక్స్‌వెల్ కేవలం 38 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. విజయానికి మరో 33 బంతుల్లో 35 పరుగులు అవసరమైన సమయంలో బుమ్రా యార్కర్‌కు క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత ఆస్టన్ అగార్ 28 బంతుల్లో 28 పరుగులు చేసి పోరాడినా.. ఆసీస్ గట్టెక్కలేకపోయింది. అంతకుముందు కెప్టెన్ ఫించ్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. 82 బంతుల్లో 75 పరుగులు చేసి ఔటయ్యాడు. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, బుమ్రా, నటరాజన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు టాప్, మిడిలార్డర్ ఫెయిలైనా.. చివర్లో ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా చెలరేగడంతో 50 ఓవర్లలో 5 వికెట్లకు 302 పరుగులు చేసింది టీమిండియా. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న పాండ్యా.. ఈ మ్యాచ్‌లోనూ కేవలం 76 బంతుల్లో 92 పరుగులు చేయగా.. జడేజా 50 బంతుల్లో 66 పరుగులు చేయడం విశేషం. ఈ ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 పరుగులు జోడించారు. ఒక దశలో 152 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమ్‌ను ఈ ఇద్దరూ ఆదుకున్నారు. మెల్లగా మొదలుపెట్టి.. చివర్లో చెలరేగిపోయారు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు. పాండ్యా 7 ఫోర్లు, 1 సిక్స్ బాదగా.. జడేజా 5 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టడం విశేషం. 108 బంతుల్లో 150 పరుగులు జోడించి ఇద్దరూ అజేయంగా నిలిచారు. అంతకుముందు ఓపెనర్లు ధావన్ (16), శుభ్‌మన్ గిల్ (33) విఫలమైనా.. కెప్టెన్ కోహ్లి (63) హాఫ్ సెంచరీ చేశాడు. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ (19), రాహుల్ (5) కూడా నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
- సోనుసూద్ పిటిషన్‌ను కొట్టివేసిన బాంబే హైకోర్టు
- మేనల్లుడి వివాహాన్ని కన్ఫాం చేసిన వరుణ్ ధావన్ మామ
- రైల్వే ఉద్యోగుల కార్యాలయాన్ని ప్రారంభించిన కేటీఆర్
- ధోనీలాంటి లెజెండ్‌తో నన్ను పోల్చొద్దు!
- ట్రంప్ లేఖ రాసి వెళ్లారు: బైడెన్
- సిమ్ స్వాప్ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- కేటీఆర్‌కు సీఎం అయ్యే అర్హత ఉంది : మంత్రి గంగుల
- రైతు నిరసనలకు మద్దతు ఇవ్వలేదు : కోకా కోలా ఇండియా
- పంచాయతీ ఎన్నికలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- టీమిండియాకు షాక్.. మళ్లీ క్వారంటైన్