బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Aug 15, 2020 , 00:09:18

రేసు రసవత్తరం

రేసు రసవత్తరం

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ రేసులోకి ప్రముఖ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌ రావడంతో పోటీ రసవత్తరంగా మారింది. టాటా గ్రూప్‌తో పాటు ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ సంస్థ అన్‌ అకాడమీ, ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ ఎలెవన్‌ సంస్థలు టైటిల్‌ స్పాన్సర్‌గా ఉండేందుకు ఆసక్తి కనబరిచాయి. ఈ మేరకు ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌(ఈవోఐ)ను బీసీసీఐకి సమర్పించాయి. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ సీనియర్‌ అధికారి శుక్రవారం వెల్లడించారు.  ఈ ఏడాది సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌కు టైటిల్‌ స్పాన్సర్‌గా ఉండేందుకు బీసీసీఐకి ఈఓఐను సమర్పించేందుకు శుక్రవారమే తుదిగడువు. ‘ఈవోఐలో బిడ్‌ ఎంత మొత్తానికి వేస్తున్నామనేది ఉండదు. బిడ్ల మొత్తాన్ని సంస్థలు ఈ నెల 18న బీసీసీఐకి పంపుతాయి’ అని ఆ అధికారి చెప్పారు. దీంతో 18వ తేదీన సంస్థల మధ్య బిడ్ల సమరం తర్వాత టైటిల్‌ స్పాన్సర్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. యోగాగురు రామ్‌దేవ్‌ బాబాకు చెందిన పతంజలితో పాటు రిలయన్స్‌ జియో  కూడా ఐపీఎల్‌ టైటిల్‌ హక్కులకు పోటీలో ఉంటాయని వాదనలు వినిపించినా.. ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా గల్వాన్‌ ఘటన తర్వాత భారత్‌లో చైనా ఉత్పత్తుల బహిష్కరణ ఉద్యమం ఉద్ధృతమవడంతో ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి ఆ దేశానికి చెందిన మొబైల్‌ తయారీ సంస్థ వివో  తప్పుకుంది. స్పాన్సర్‌గా ఉన్నందుకు ప్రతి ఏడాదికి దాదాపు రూ.440కోట్లు ఇచ్చేలా బీసీసీఐతో వివో 2018 నుంచి ఐదేండ్లకు ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ఈ ఏడాది తప్పుకున్నా ఒప్పందం కొనసాగనుంది. అందుకే కొత్తగా ఎంపికయ్యే టైటిల్‌ స్పాన్సర్‌కు హక్కులు ఈ నెల 18 నుంచి డిసెంబర్‌ 31వరకే ఉండనున్నాయి. 


logo