గురువారం 09 జూలై 2020
Sports - May 27, 2020 , 12:22:10

ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదా !

ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదా !

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా ప‌డ‌నున్న‌ది.  2022 సంవ‌త్సరానికి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ వాయిదాప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.  దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ లేదు. కానీ ఆ టోర్నీను వాయిదా వేసే అవకాశాలు ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.  క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దాదాపు అన్ని ర‌కాల క్రీడా టోర్నీలు ర‌ద్దు అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగ‌స్టులో జ‌ర‌గాల్సిన ఒలింపిక్స్‌ను కూడా వాయిదా వేసిన విష‌యం తెలిసిందే.  

అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ..  2022లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  దీని కోసం కొత్త షెడ్యూల్‌ను త‌యారు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.  వాస్త‌వానికి 2021లో ఇండియాలో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర‌గాల్సిన ఉన్న‌ది. అయితే ఆ టోర్నీని య‌థావిధిగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జ‌ర‌గాల్సిన టోర్నీని మాత్రం 2022కు వాయిదా వేశారు. ఇక 50 ఓవ‌ర్ల‌లో వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీని మాత్రం 2023లో ఇండియాలో నిర్వ‌హించ‌నున్నారు. 

ఒక‌వేళ క‌రోనా వైర‌స్ ఉధృతి త‌గ్గితే.. బ‌హుశా ఈ అక్టోబ‌ర్‌‌లో భార‌త్‌లో ఐపీఎల్ నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ నిర్వ‌హ‌ణ కోసం త‌యారు చేస్తున్న కొత్త షెడ్యూల్‌కు బీసీసీఐ అద్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశాలు ఉన్నాయి. మే 28వ తేదీన జ‌ర‌గ‌నున్న ఐసీసీ మీటింగ్‌లో దీనిపై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు.  

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వాయిదాపై ఎటువంటి నిర్ణ‌యాన్ని తీసుకోలేదని ఐసీసీ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. ఆస్ట్రేలియాలో జ‌ర‌గాల్సిన ఈ ఈవెంట్ కోసం ప్ర‌ణాళిక ప్ర‌కారం అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు ఆ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. రేపు జ‌ర‌గ‌నున్న ఐసీసీ బోర్డు స‌మావేశాల్లో దీనిపై నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలిపారు. 


logo